నడిరోడ్డుపై నరమేథం!
సంపాదకీయం: ఆదమరిచివున్న అధికారుల సాక్షిగా, బాధ్యత గుర్తెరగని సర్కారు సాక్షిగా మరోసారి నడిరోడ్డుపై రాకాసి వాహనం 45 నిండు ప్రాణాలను బలితీసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా పాలెం సమీపంలో బుధవారం వేకువజామున జరిగిన ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. ఎన్నో కుటుంబాల్లో పండుగముందు పెను విషాదాన్ని నింపింది. బెంగళూరునుంచి బయల్దేరిన వోల్వో బస్సు మరొక్క గంటలో గమ్యస్థానం హైదరాబాద్ చేరుతుందనగా హఠాత్తుగా మంటలంటుకుని క్షణాల్లో భస్మీపటలమైంది. అయినవారూ, ఆప్తులూ కనీసం తమవారి భౌతికకాయాలనైనా చూసుకుందామనుకుంటే అక్కడ మిగిలివున్నవి కేవలం మాంసపు ముద్దలే. లభ్యమైన బంగారు ఆభరణాల ఆధారంగా మాత్రమే తమవారి జాడల్ని పోల్చుకోగలిగారంటే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సోదరి పెళ్లి పిలుపు కోసం హైదరాబాద్ బయల్దేరిన ఇద్దరు అన్నాచెల్లెళ్లు... పుట్టింట్లో పురుడు పోసుకుందామని బస్సెక్కిన నిండు చూలాలు... సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి విజయోత్సాహంతో ఇంటికొస్తున్న యువకుడు... బతుకుతెరువు కోసం బెంగళూరు వెళ్లి అయినవారిని చూసుకోవడానికి వస్తున్న ఉద్యోగి... ఇలా ఎందరెంద రి జీవితాలో మాడి మసైపోయాయి. వోల్వో బస్సు చూడ్డానికి రాకాసి బస్సులా ఉంటుంది.
దాని వేగమూ, దూకుడూ భాగవతంలో చిన్ని కృష్ణుణ్ణి చిదిమేయడానికి వచ్చిన శకటాసురుణ్ణి గుర్తుకు తెస్తాయి. అది ప్రాథమికంగా బస్సు అనే సంగతిని బస్సు యజమానిగానీ, నడిపే డ్రైవర్‌గానీ, పర్యవేక్షణ చేయాల్సిన అధికారులుగానీ గుర్తించడంలేదు. బుల్లెట్ ట్రెయిన్‌ను నడుపుతున్నట్టో, విమానాన్ని నడుపుతున్నట్టో గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దాన్ని పోనిస్తే అస్తవ్యస్థంగా, అడ్డదిడ్డంగా ఉండే మన రహదారులపైన ఏమైనా జరగవచ్చన్న స్పృహ వీరెవరికీ కలగడం లేదు. వెళ్లాల్సిన దూరమెంతనే లెక్కేలేదు. అది 500 కి లోమీటర్లు కావొచ్చు, వెయ్యి కిలోమీటర్లు కావొచ్చు... చిమ్మ చీకట్లను ఛేదిస్తూ వాయువేగంతో అక్కడికి చేరడమే లక్ష్యం. రాత్రి ఎప్పుడో 11 గంటలకు బయల్దేరే బస్సు తెల్లవారడానికి ముందే గమ్యస్థానంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే దూరాన్ని ఆర్టీసీ బస్సులు చేరడానికీ, ప్రైవేటు బస్సులు చేరడానికీ మధ్య గంటల తేడా ఉంటున్నదంటే ప్రైవేటు బస్సుల దూకుడు ఏ స్థాయికి చేరుతున్నదో అంచనా వేసుకోవచ్చు.
ప్రయాణికులనూ, వారికి సంబంధించిన లగేజీని మాత్రమే మోసుకు పోవాల్సిన ఈ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా యధేచ్ఛగా సరుకులను చేరేస్తున్నాయి. ఆ సరుకులు ఎలాంటివైనా కావొచ్చు. రసాయనాలైనా కావొచ్చు... టపాసులైనా కావొచ్చు... దుస్తులైనా కావొచ్చు... అన్ని రకాలైన సరుకులనూ ఈ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తున్నాయి. అందుకోసం నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో గంటల తరబడి ఆగుతున్నాయి. అలా ఆగడంవల్ల కలిగే ఆలస్యాన్ని అధిగమించడానికి అటు తర్వాత పెనువేగంతో వెళ్తున్నాయి. ప్రయాణికుల్ని మాత్రమే ఎక్కించుకోవాల్సిన బస్సులు ఇలా కళ్లముందే సరుకుల్ని చేరేస్తున్నా, అందుకోసమని బస్సు ఆపరేటర్లు గోడౌన్లను నిర్వహిస్తున్నా రవాణా శాఖ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారు. హైదరాబాద్‌లో రాత్రి 8 దాటాక రోడ్లమీదకొచ్చే ఈ బస్సులు ఏంచేస్తున్నాయో, ఎక్కడెక్కడ ఆగుతున్నాయో, ఏమేమి తీసుకెళ్తున్నాయో చూసే నాథుడు లేడు. బెంగళూరులో అయినా, చెన్నైలో అయినా, ముంబైలో అయినా ఇంతకన్నా మెరుగైన పరిస్థితులేమీ లేవు. బస్సుల నిర్వహణ ఎలా ఉంటున్నదో, నిబంధనలన్నిటినీ పాటిస్తున్నారో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సివున్న వ్యవస్థలు పనిచేయడం లేదు. జరుగుతున్న లోటుపాట్లన్నీ అధికారులకూ, ఇతర సిబ్బందికీ తెలుసు. వారికి మార్గ నిర్దేశనం చేయాల్సిన అమాత్యులకూ తెలుసు. కానీ, అటు లాభాపేక్ష... ఇటు కాసుల కక్కుర్తి అన్నిటినీ కప్పెడుతోంది. కొందరు ఆరోపిస్తున్నట్టు ప్రైవేటు బస్సు ఆపరేటర్ల వ్యవస్థ మాఫియాగా తయారైతే తప్ప పరిస్థితులు ఇంతగా క్షీణించవు. దూర ప్రయాణాలు చేసే బస్సులకు తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. వారు మద్యం సేవించకుండా ఉండాలి. ఇప్పుడు ప్రమాదం జరిగిన బస్సులో ఒక్క డ్రైవరే ఉన్నాడు. అతను మద్యం సేవించి ఉండొచ్చని కొందరంటున్నారు.
వోల్వో బస్సులు చూడటానికి అందంగా తీర్చిదిద్దినట్టే ఉంటాయి. ఏసీ బస్సులు గనుక బయటినుంచి గాలి చొరబడే అవకాశం లేదు. అందులో వాడే సిల్కు తెరలు, ఫైబర్, రెగ్జిన్‌లను వినియోగించి తయారుచేసే సీట్లు క్షణాల్లో అంటుకునే స్వభావం గలవి. పొరపాటున బస్సు మంటల్లో చిక్కుకుంటే ప్రయాణికులకు బయటకు వచ్చే తోవే ఉండదు. నిబంధనల ప్రకారం అత్యవసర సమయాల్లో అద్దాలను బద్దలు కొట్టడానికి ప్రతి సీటువద్దా ఇనుప వస్తువు ఉంచాలి. ఎమర్జెన్సీ డోర్ అందరికీ తెలిసేలా ఏర్పాటుచేయాలి.
కానీ, బస్సులో బిగించే తెరలు దేన్నీ గుర్తించకుండా చేస్తున్నాయి. విమానాల్లో అయితే బయల్దేరే ముందు ప్రయాణికులకు భద్రత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే ఏర్పాటు ఉంటుంది. కానీ, వోల్వో బస్సుల్లో అలాంటిదేమీ కనబడదు. రోడ్డు ప్రమాదాల్లో మన దేశానిది ప్రపంచంలోనే అగ్రస్థానమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. ఇక్కడ ఏటా లక్షా 10 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. నిరుడు దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మన రాష్ట్రం వాటా 10.8 శాతం. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఎలాంటి కార్యాచరణ అవసరమో గుర్తించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి అవసరమైన సంఖ్యలో బస్సులనూ ఉంచక, ప్రైవేటు ఆపరేటర్లపైన అవసరమైన నిఘానూ ఉంచక ప్రభుత్వమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది. ఇప్పటికైనా పాలకులు తమ బాధ్యతను గుర్తెరిగి అవసరమైన చర్యలు తీసుకోవాలి.