మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. కొత్తకోట మండలం పాలెం ఎన్హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక సమాచారం అందింది. వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న 49 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నుంచి ఇప్పటివరకూ 45 మృతదేహాలను వెలికి తీశారు. ప్రయాణికులు సజీవ దహనం కావటంతో బస్సు కింద భాగం నుంచి కట్టర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. బస్సులో మొత్తం 49మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద మృతుల బంధువులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బాధితుల సమాచారం కోసం ట్రావెల్స్ ప్రతినిధులను ప్రశ్నించారు. ట్రావెల్స్ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బస్సు ప్రమాదంపై ట్రావెల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యులు, బంధువుల వివరాల కోసం వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ట్రావెల్స్ ప్రతినిధులు తమకు సరైన సమాచారం ఇవ్వటం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవటంతో డీఎన్ఏ నిర్వహించిన అనంతరం చనిపోయినవారి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని .... ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు.