ఆఫర్ లెటర్ ఆలస్యం కాకుంటే బతికి ఉండేవాడు
ఆఫర్ లెటర్ ఆలస్యం కాకుంటే బతికి ఉండేవాడు
Published Wed, Oct 30 2013 12:06 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
కొత్తకోట మండలం పాలెం ఎన్హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సులో 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైన ఘోర దుర్ఘటనలో హృదయవిదారకమైన ఉదంతాలలో కాలిబూడిదైపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఆడారు రవి (27)ది భిన్నమైన ఉదంతం. అంతా సజావుగా జరిగి ఉంటే, తను కలలుగన్న మల్టీనేషనల్ కంపెనీ ఆక్సెంచుర్ (Accenture) హైదరాబాదు ఆఫీసులో ఈ పాటికి చేరి ఉండేవాడు. ఈ ఒక్క రోజు ఆగి ఉన్నట్టైతే మరో మల్టీనేషనల్ కంపెనీ కెటి & టి (KT &T) లో తానిప్పుడు చేస్తున్న బెంగలూరులోనే చేరి ఉండేవాడు.
"ఒక విధంగా వాడి చావుకు నేను కూడా బాధ్యుడ్నేనేమో. వాడు ఎటూ తేల్చుకోలేక పోతుంటే కెటి & టి కంటే ఆక్సెంచుర్ పెద్ద కంపెనీ అని సలహా ఇచ్చాను. మంగళవారానికి కెటి & టి ఆఫర్ లెటర్ వస్తే, ఉండిపోతానని, లేకపోతే హైద్రాబాద్ బయిల్దేరతానని అన్నాడు," అని చెప్పుకొచ్చాడు ఆడారు రవి ప్రాణ స్నేహితుడు కె. లీలా శివ ప్రసాద్. మిత్రుడ్ని రిసీవ్ చేసుకోవాలన్న ఆత్రుతలో ఉన్న తాను, గుర్తు పట్టడం కూడా కష్టమైన ఆ మిత్రుడి శవాన్ని చూడటానికి వెళ్తున్నానని దుర్ఘటనా స్తలానికి వెళ్లబోయే ముందు 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడాడు.
ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం, విజయనగరానికి చెందిన రవి చదువులో చాలా చురుకైన వాడు. మాచర్ల న్యూటన్ కాలేజీలో ఇంజినీరింగ్ 2003- 2007 బ్యాచ్. 2007 ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, బెంగలూరులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేస్తున్నాడు. రవికి ఒక అన్నయ్య, ఓ చెల్లి ఉన్నారు. అన్నయ్య విజయనగరంలోనే తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ, ఇంటర్నెట్ సెంటర్ నడుపు కుంటున్నాడు. రవి ఆ కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. త్వరలో చెల్లి పెళ్ళి చేయాలని, మంచి కంపెనీలో మరింత మంచి జీతం వచ్చే ఉధ్యోగంలో చేరాలని పట్టుదలగా కొన్ని పెద్ద కంపెనీలలో ప్రయత్నించి సఫలమయ్యాడు.
నిజానికి కెటి & టి ఆఫర్ చేసిన జీతం ఎక్కువ అయినా, ఆఫర్ లెటర్ ఇవ్వడంలో జాప్యం జరగడం, ఆక్సెంచుర్ ఇంకా పేరున్న కంపనీ కావడంతో రవి మంగళవారం రాత్రి తన మృత్యువుని వెదుక్కుంటూ బయిల్దేరినట్టైయింది. "రాత్రి బస్సు ఎక్కిన తర్వాత కూడా ఫోన్ చేశాడు. రేపు జాయిన్ అయ్యాక, సాయంత్రం కె ఎఫ్ సీ లో పార్టీ చేసుకుందాం అన్న వాడిని ఇప్పుడు గుర్తు పట్టడానికి కూడా లేదు,' అని ఆడారు రవి స్నేహితుడు లీలా ప్రసాద్ భోరుమన్నాడు.
Advertisement
Advertisement