ఘోరం | 45 killed in Andhra Pradesh as speeding Volvo bus crashes, bursts into flames | Sakshi
Sakshi News home page

ఘోరం

Published Thu, Oct 31 2013 3:20 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

45 killed in Andhra Pradesh as speeding Volvo bus crashes, bursts into flames

* పాలమూరు బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనం
కొత్తకోట మండలం పాలెం శివారులో దుర్ఘటన
కల్వర్టును ఢీకొనటంతో పేలిన డీజిల్ ట్యాంకు
చూస్తుండగానే కాలిపోయిన జబ్బార్ ట్రావెల్స్ బస్సు
15 క్షణాల్లో బస్సును చుట్టుముట్టిన అగ్నికీలలు
మాంసం ముద్దలుగా మారిన ప్రయాణికులు
బతికింది డ్రైవర్, క్లీనర్ సహా ఏడుగురే
*  విచారణకు సీఎం ఆదేశం.. దుర్ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
 
ఘటనా స్థలం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  కోరలు సాచి క్షణాల వ్యవధిలో చుట్టుముట్టిన అగ్నికీలలు. రెప్పపాటులో ఒళ్లంతా అంటుకున్న పెను మంటలు. నిలువునా కాలిపోతూ హాహాకారాలు. కాపాడండంటూ నిస్సహాయంగా ఆర్తనాదాలు. నిమిషాల్లోనే సర్వం భస్మీపటలం. తెల్లవారుజామున తెల్లారిపోయిన 45 నిండు ప్రాణాలు. వింటేనే ఒళ్లంతా జలదరించేతటి దారుణమిది. గుండెల్ని పిండే మహా విషాదమిది. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఘోరమైన బస్సు ప్రమాదమిది.

బెంగళూరు నుంచి 50 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ రోడ్ లైన్స్ పేరుతో ఉన్న ఈ బస్సు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారులో అగ్నికి ఆహుతైంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఓ కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు గోడను ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకు పేలిపోయి ఒక్కసారిగా నిప్పంటుకుంది. కేవలం 15 క్షణాల వ్యవధిలో అగ్నికీలలు బస్సంతటినీ చుట్టుముట్టాయి.

డ్రైవర్, క్లీనర్ వెంటనే డ్రైవర్ సీటు పక్కనుండే తలుపు తెరుచుకుని బయటకు దూకేయడంతో పెద్దగా గాయాలేమీ కాకుండానే బతికి బయటపడ్డారు. డ్రైవర్ క్యాబిన్‌లో, ముందు వరస సీట్లలో ఉన్న ఐదుగురు ప్రయాణికులు కూడా వెంటనే తేరుకుని అదే తలుపు గుండా బయటకు దూకేశారు. మిగతా వారెవరూ ముంచుకొచ్చిన మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. 45 మంది ప్రయాణికులు బస్సులోనే నిలువునా కాలి బుగ్గయ్యారు. వారంతా గాఢ నిద్ర నుంచి తేరుకుని, జరిగిన ఘోరాన్ని అర్థం చేసుకునే లోపే సమయం మించిపోయింది.

అన్నివైపుల నుంచీ మంటలు చుట్టుముడుతుండటంతో బస్సులోంచి బయట పడే మార్గం లేక నిస్సహాయంగా ప్రాణాలు వదిలారు. వారిలో ఒక్కరి ముఖం మాత్రమే గుర్తు పట్టగలిగే స్థితిలో ఉంది. మిగతావన్నీ కాలి బుగ్గయ్యాయి. కొన్ని శవాలైతే రెండు మూడు శరీర భాగాలు మినహా మొత్తం బూడిదగా మారిపోయాయి. పుట్టింట్లో పురుడు పోసుకునేందుకు వస్తున్న ఓ నిండు చూలాలు.. తల్లి ఒడిలో పడుకున్న ముక్కుపచ్చలారని చిన్నారి.. సోదరి పెళ్లి పిలుపు కోసం వస్తున్న అన్నాచెల్లెళ్లు.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరేందుకు కోటి ఆశలతో, అపాయింట్‌మెంట్ లెటర్‌తో బయల్దేరిన 24 ఏళ్ల యువకుడు.. కాలి మాంసపు ముద్దలుగా మారిన వారిలో ఇలాంటి వారెందరో ఉన్నారు!

ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్యుల బృందం బుధవారం ఉదయమే ఘటనా స్థలికి వెళ్లి మృతదేహాలకు అక్కడే శవపరీక్షలు చేసింది. బంగారు గొలుసులు, రింగులు తదితరాల ఆధారంగా గుర్తించగలిగిన నాలుగు మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించి, మిగతా 41 శవాలను రాత్రి ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదం తర్వాత ప్రయాణికుల క్యాబిన్ తలుపు అసలు తెరుచుకుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. బతికి బయటపడ్డ వారిలో కొందరు తాము ముందు వరసలో కూర్చున్నామంటున్నా, మళ్లీ అడిగితే ఏమీ చెప్పలేకపోతున్నారు.

ప్రమాదంపై ప్రభుత్వం ప్రాథమిక విచారణకు ఆదేశించింది. రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, రోడ్ సేఫ్టీ) ఎస్.ఎ.వి.ప్రసాదరావును విచారణాధికారిగా నియమించింది. ప్రమాదానికి కారణమేమిటి, బాధ్యులెవరు వంటి వివరాలతో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా దీనిపై విచారించి నివేదిక సమర్పించాల్సిందిగా మహబూబ్‌నగర్ ఎస్పీని ఆదేశించింది.

గాఢ నిద్రలో ఉండగానే...
ఏపీ02 టీఏ 0963 నంబర్ బస్సు బెంగళూరులో రాత్రి 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు బయల్దేరింది. తెల్లవారుజామున దాదాపు 5.10 సమయంలో పాలెం-కనుమెట్ట గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు వద్దకు రాగానే, ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బస్సును డ్రైవర్ కుడివైపు తిప్పాడు. ఆ సమయంలో దాని వేగం గంటకు 130 కిలోమీటర్లకు పైనే ఉంది. కల్వర్టు తాలూకు పిట్టగోడ రోడ్డుపైకి ఉండటంతో బస్సు హెడ్‌లైట్ భాగం గోడ పై భాగానికి బలంగా గుద్దుకుంది.

వంపు తిరిగినట్టుగా ఉన్న గోడ దిగువ భాగాన్ని బస్సు డీజిల్ ట్యాంకు ఢీకొట్టి అతివేగం కారణంగా ఒక్కసారిగా పగిలిపోయింది. అందులోని డీజిల్ మొత్తం బయటకు చిమ్మినట్టుగా పడింది. బస్సు టైర్లు కూడా డీజిల్‌తో తడిసిపోయాయి. హెడ్‌లైట్ పగలగానే నిప్పురవ్వలు ఎగిసి పడి డీజిల్‌కు అంటుకున్నాయి. డీజిల్ అంతటా విస్తరించి ఉండటంతో క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. బస్సు లోపల ఏసీ వ్యవస్థ ఉండటంతో అందులోని గ్యాస్ కూడా మంటలు పెరగటానికి కారణమైంది. అదే సమయంలో బస్సు కుడి వైపు టైర్ కూడా పేలిపోయింది. దాంతో బస్సు 300 మీటర్ల వరకు అలాగే దూసుకెళ్లి రోడ్డుకు ఎడమ వైపు నిలిచిపోయింది.

బస్సు బాడీ ఫైబర్‌తో చేసింది కావడం, లోపల కర్టెన్లు, సీటు కవర్లు... ఇలా అన్నీ మంటలంటుకునే వస్తువులే ఉండటంతో చూస్తుండగానే అగ్నికీలలు బస్సంతటినీ చుట్టుముట్టాయి. లగేజీ బాక్సులో జరీ చీరలకు ఉపయోగించే దారం చుట్టలు భారీగా ఉండటం కూడా మంటలు పెరిగేందుకు కారణమైంది. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు కల్వర్టు గోడను ఢీకొనగానే వారంతా కుదుపుతో ఎగిరి ముందు సీట్లకు గుద్దుకుని ఒక్కసారిగా మెలకువలోకి వచ్చారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే మంటలు శరవేగంగా లోపలికి వ్యాపించడంతో పాటు బస్సంతా దట్టమైన పొగతో నిండిపోయింది.

మంటలు ముందు భాగం నుంచే లోనికి విస్తరించటంతో ప్రాణాలు దక్కించుకునేందుకు అంతా వెనక వైపు పరుగులు తీశారు. అప్పటికే అద్దాలు పగిలిన రెండు కిటికీల్లోంచి బయటకు దూకేందుకు ప్రయత్నించారు. కానీ ఆసరికే చాలామందికి ఒళ్లంతా మంటలంటుకోవడంతో ఒక్కరు కూడా బయటకు రాలేకపోయారు. దాదాపుగా శవాలన్నీ వెనుక భాగంలో ఒకే చోట కుప్పలా పడి ఉన్నాయి. ఒకరు ముందువైపు కిటికీలోంచి బయటకు దూకే ప్రయత్నంలో శరీరం సగం బస్సు బయటికి, సగం లోపలి వైపు ఉన్న దశలోనే ప్రాణాలొదలడం అందరినీ కలచివేసింది.
 
సామర్థ్యం 43... ఉన్నది 50 మంది..
కాసులకు కక్కుర్తిపడే అధికారులు ప్రైవేటు బస్సుల ఆగడాలకు కళ్లెం వేయకపోతుండటం అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయనటానికి ఈ ప్రమాదం మరో నిదర్శనం. ఈ బస్సు సామర్థ్యం డ్రైవర్, క్లీనర్ కాకుండా 43 మందే. కానీ టికెట్ బుకింగ్ వివరాల ప్రకారమే అందులో 44 మంది ప్రయాణికులున్నారు. ప్రమాద సమయంలో వారి సంఖ్య 50కి చేరింది! సామర్థ్యానికి మించి ప్రయాణిస్తున్న వారిలో కొందరు డ్రైవర్ క్యాబిన్‌లోని డ్రైవర్ విశ్రాంతి సీటు, ఇతర చోట్ల ఇరుక్కుని కూర్చున్నట్టు సమాచారం.
 
వేరే వాహనాల్లోని వారు స్పందించి ఉంటే...
ప్రమాదం జరిగి బస్సు అగ్నికీలలో చిక్కుకుని ప్రయాణికులంతా హాహాకారాలు చేస్తున్నా దాని ముందూ, వెనకా వెళ్తున్న వాహనాల్లోని వారిలో చాలామంది గుడ్లప్పగించి చూశారే తప్ప రక్షించేందుకు పెద్దగా ప్రయత్నించలేదు. బస్సు ఏ కారును ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదానికి గురైందో ఆ కారు కూడా ఆగకుండానే వెళ్లిపోయింది. సరిగ్గా బస్సు వెనకే వస్తున్న ఇన్నోవా డ్రైవర్ శ్రీనివాస్ ప్రయాణికులను కాపాడేందుకు విఫలయత్నం చేశారు. ఇన్నోవాలోని నలుగురు ప్రయాణికులు కూడా కిందకు దిగి బస్సు అద్దాలపైకి రాళ్లు విసిరినా అవి పగల్లేదు. వారు 100, 108లకు సమాచారమిచ్చి వెళ్లిపోయారు.

అదే సమయంలో వెనకే మరో ప్రైవేటు బస్సు వచ్చి కూడా ఆగకుండానే పోయింది. పక్కనున్న దాబా సిబ్బంది మాత్రం వెంటనే వచ్చి సాయపడే ప్రయత్నం చేశారు. 15 నిమిషాల్లో పోలీసులు వచ్చేసరికే అంతా అయిపోయింది. దాదాపు అంతే వ్యవధిలో వచ్చిన 108 అంబులెన్స్ సిబ్బంది, కిటికీల్లోంచి దూకి బతికి బయటపడ్డ వారికి ప్రాథమిక చికిత్స చేశారు.

45 నిమిషాల తర్వాత ఫైరింజన్...
పోలీసులు, 108 అంబులెన్స్ సకాలంలో వచ్చినా, మంటలార్పాల్సిన ఫైరింజన్ మాత్రం దాదాపు ముప్పావుగంట తర్వాత వచ్చింది. ఘటనా స్థలికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వనపర్తి నుంచి అది వచ్చేసరికే అంతా బుగ్గిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement