మహబూబ్ నగర్ బస్సు ప్రమాదంలో 45 మంది మృతి - 10 ప్రధానాంశాలు
మహబూబ్ నగర్ బస్సు ప్రమాదంలో 45 మంది మృతి - 10 ప్రధానాంశాలు
Published Wed, Oct 30 2013 12:16 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. కొత్తకోట మండలం పాలెం ఎన్హెచ్ 44పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాధమిక సమాచారం అందింది. వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న 49 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
1. మహబూబ్‌నగర్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 9494600100, 08542-245927/08542-245930/08542-245932
2. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద మృతుల బంధువులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బాధితుల సమాచారం కోసం ట్రావెల్స్ ప్రతినిధులను ప్రశ్నించారు. ట్రావెల్స్ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బస్సు ప్రమాదంపై ట్రావెల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల వివరాల కోసం వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ట్రావెల్స్ ప్రతినిధులు తమకు సరైన సమాచారం ఇవ్వటం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవారి వివరాలు చెప్పాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు పోలీసులు జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు
3. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నుంచి ఇప్పటివరకూ 45 మృతదేహాలను వెలికి తీశారు. ప్రయాణికులు సజీవ దహనం కావటంతో బస్సు కింద భాగం నుంచి కట్టర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. బస్సులో మొత్తం 49మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవటంతో డీఎన్ఏ నిర్వహించిన అనంతరం చనిపోయినవారి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని .... ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు.
4. ప్రమాద వోల్వో బస్సు జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం. AP 02 TA 0963 నెంబర్ గల బస్సు దివాకర్ రోడ్డు లైన్ పేరుతో అనంతపురంలో రిజిస్టర్ అయ్యింది. అయితే ఆర్టీఏ రికార్డుల్లో బస్సు స్టేటస్ ఇనాక్టివ్గా ఉంది. జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రర్ అయిన బస్సు....జబ్బర్ ట్రావెల్స్ పేరుతో ఎందుకు నడుస్తుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. 2010 అక్టోబర్ 6న రిజిస్ట్రర్ అయ్యింది.
5. మహబూబ్నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సుతో తమ ట్రావెల్స్కు ఎలాంటి సంబంధం లేదని జేసీ ట్రావెల్స్ యాజమాన్యంతెలిపారు. తాము రెండేళ్ల క్రితమే బస్సును అమ్మివేసినట్లు వారు బుధవారమికర్కడ పేర్కొన్నారు. జబ్బర్ ట్రావెల్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని... టైటిల్ మార్చకపోవటం వల్లే తమ ట్రావెల్స్ పేరు ఉందన్నారు.
6. కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన ప్రయివేట్ వోల్వో బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ....ముఖ్యమంత్రి ఫోన్తో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ ప్రమాదంలో 42మంది ప్రయాణికులు సజీవ దహనం అయినట్లు డీఐజీ వెల్లడించారు.
7. ప్రమాదానికి గురైన జబ్బర్ ట్రావెల్స్ బెంగుళూరు కార్యాలయం యజమాని షకీల్ పరారీలో ఉన్నాడు. బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న షకీల్ ఫోన్ స్విచాఫ్ చేసి అందుబాటులో లేకపోవటంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. జబ్బర్ ట్రావెల్స్ ప్రధాన కార్యాలయంతో పాటు, మిగతా కార్యాలయాల వద్ద బెంగళూరు సివిల్, ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. బస్సు ప్రయాణికుల వివరాలను బెంగళూరు పోలీసులు సేకరిస్తున్నారు. రెండు బస్సుల ప్రయాణికులను ఒకే బస్సులో తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సు రిజిస్ట్రేషన్ వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు.
8. బుధవారం ఉదయం బస్సు ప్రమాదం జరిగినా..ప్రభుత్వం, అధికారులు స్పందిచలేదని మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలకు చెందిన మంత్రి డీకే అరుణ, రవాణశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జేసీ దివాకరరెడ్డిలపై మండిపడ్డారు.
9. మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట వద్ద ఈ రోజు తెల్లవారుజామున వోల్వో బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది మరణించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోర్టు ఆంక్షల కారణంగా ప్రమాద ఘటన స్థలానికి వెళ్లలేకపోతున్నాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వద్దకు వెళ్లాల్సిందిగా వైఎస్ జగన్ పార్టీనేతలను ఆదేశించారు.
10. మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి హైదరాబాద్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు: శ్రీకర్ పద్మారావునగర్ (సికింద్రాబాద్ ), రాజేష్ బీహెచ్‌ఈఎల్ ఓల్డ్ ఎమ్‌ఐజీ (ఇన్ఫోటెక్ ఉద్యోగి),
యోగేష్ గౌడ బెంగళూరు ( టోలిచౌకి ) మాదాపూర్ గోల్ప్ కోర్ట్ కోచ్, జయసింగ్, బాషా ( ఉత్తరప్రదేశ్ ) .... వీరిలో యోగేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మిగతా నలుగురు 30 శాతం గాయపడినట్లు అపోలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ తమిల్లా తెలిపారు. ఎమర్జెన్సీ విభాగంలో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
Advertisement
Advertisement