తేరుకులోనే లోపే.. మృతుఒడిలోకి | Five passengers alive from Volvo bus catches fire accident | Sakshi
Sakshi News home page

తేరుకులోనే లోపే.. మృతుఒడిలోకి

Published Thu, Oct 31 2013 2:45 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Five passengers alive from Volvo bus catches fire accident

మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలోఐదుగురు ప్రయాణికులు, బస్సు డ్రైవర్, క్లీనర్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో బెంగళూరుకు చెందిన యోగేష్‌గౌడ అనే ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారికి తొలుత మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మినహా ఆరుగురు క్షతగాత్రులు 12-25 శాతం గాయాలతో బాధపడుతున్నట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ సమి స్పష్టం చేశారు. దట్టమైన పొగ, మంట కారణంగా వ చ్చిన వేడిగాలి లోపలికి వెళ్లడం వల్ల (రెస్పిరేటరీ బర్నింగ్స్) గుండె, ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే నాళాలు దెబ్బతిని ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. గాయపడ్డవారందరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం గురించి బాధితులు వెల్లడించిన వివరాలు..    - సాక్షి, సిటీబ్యూరో
 
 కళ్లు తెరిచి చూసే సరికి...
 ‘‘సైబర్ టవర్స్‌లోని ఐఐఐ లోటస్ ఇన్ఫోటెక్‌లో పని చేస్తున్నాను. ప్రాజెక్టు పనిమీద బెంగళూరు వెళ్లి, తిరిగి వస్తున్నాను. డ్రైవర్ వెనకాలే ఉన్న సీటులో విండో పక్కన మరోవ్యక్తి, ఇటువైపు నేను కూర్చున్నాం. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఒక్కసారిగా ఒంటికి మంటలు అంటుకోవడంతో కళ్లు తెరిచి చూశాను. అప్పటికే బస్సులో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వెంటనే నా పక్కన ఉన్న ఆయనను లేపేందుకు ప్రయత్నించాను. కానీ, ఆయన లేవలేదు. నేను కిటికీ అద్దాలు పగలగొట్టి బయటికి దూకాను. అప్పటికే ఒళ్లంతా మంటలు అంటుకున్నాయి. తేరుకుని చూసేలోపే నా పక్కన కూర్చున్న వ్యక్తి మంటల్లో కాలిపోయాడు. నాకు అయిన గాయాల కన్నా.. పక్కన కూర్చున్న వ్యక్తిని కాపాడుకోలేకపోయాననే బాధే నన్ను ఎక్కువగా వేధిస్తోంది. ఒక నిమిషం ముందు మేల్కొన్నా.. అతడిని కాపాడే వాడిని’’

 - రాజేష్ (28) స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. ఆయన భార్య శైలజ. ఉద్యోగరీత్యా వారు హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌లో ఉంటున్నారు. సైబర్‌టవర్స్‌లోని లోటస్ ఐఐఐ ఇన్ఫోటెక్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రమాదంలో కుడి చేతికి, వీపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ఒంటిపై 12 శాతం కాలిపోయింది. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
 
 వ్యాపారం కోసం వచ్చి...
 మజర్ పాషా(30) స్వస్థలం బెంగళూరు. రెడీమేడ్ వస్త్రాలు సరఫరా చేస్తుంటారు. వారానికి ఒకసారి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. ఇక్కడి దుకాణాల యజమానుల నుంచి ఆర్డర్లు తీసుకువెళతారు. అనంతరం వస్త్రాలు సరఫరా చేస్తారు. మంగళవారం కూడా అదే తరహాలో హైదరాబాద్‌కు బయలుదేరి ప్రమాదంలో గాయపడ్డారు. తల, ఛాతీ, వీపు భాగాలతో పాటు 25 శాతం శరీరం కాలిపోయింది.
 

 ప్రధాన ద్వారం తెరుచుకోకనే..
 ‘‘రెండేళ్ల కింద బెంగళూరులోని హెచ్‌పీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా చేరాను. దీపావళి పండుగ కోసం మంగళవారం ఇంటికి బయలుదేరాను. నేను స్టాప్‌కు వచ్చేసరికి బస్సు బయలుదేరింది. దాంతో ఆటోలో వెళ్లి మరీ బస్సు ఎక్కాను. ప్రయాణంలో ఉండగా తెల్లవారుజామున బస్సు దేన్నో ఢీ కొట్టినట్లు భారీ శబ్దం విన్పించింది. కళ్లు తెరిచి చూసే సరికి బస్సులో దట్టమైన పొగ వ్యాపించింది. నాలుగు వైపుల నుంచి మంటలు బస్సు లోపలికి వ్యాపించాయి. ఓ ప్రయాణికుడు ప్రధాన ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు. కానీ, అవి తెరుచుకోకపోవడం వల్లే అంతా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో నేను చేతులతో కిటికీ అద్దాలు పగలగొట్టి బయటికి దూకాను. అప్పటికే ఛాతీ ఎడమ భాగానికి, వీపుపై మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న మరో వ్యక్తిని బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించాను. కానీ, అతని కుడి కాలు కిటికీ ల మధ్య ఇరుక్కుపోవడంతో కాపాడలేకపోయాను.’’
 - చేనం సాయి శ్రీకర్(32), హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో నివస్తున్నారు. హెచ్‌పీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రమాదంలో ముఖం, కాళ్లు, చేతులు, వీపు భాగంలో 12 శాతం గాయాలయ్యాయి.
 
 డ్రైవర్ వెంటే దూకిన క్లీనర్
 ప్రమాదంలో బయటపడిన వారిలో ఒకరైన ఇజాజ్‌పాషా (25)ది బెంగళూరు. ప్రమాదానికి గురైన బస్సు క్లీనర్. ఆయన రెండేళ్లుగా ఈ బస్సులో క్లీనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రమాద సమయంలో డ్రైవర్ క్యాబిన్‌లో కూర్చున్న ఇజాజ్‌పాషా.. డ్రైవర్ బస్ నుంచి దూకిన వెంటనే దూకేశాడు. ఆయనకు వనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండటంతో.. బుధవారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్‌డీవో ఆసుపత్రికి తరలించారు. ఇజాజ్‌పాషా 15 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నారు.
 
 గుర్తొస్తే.. భయమేస్తోంది...
 ‘‘నేను. హిందూవర్ ఇన్నోవేషన్ సంస్థలో లిఫ్ట్‌లకు అద్దాలు అమర్చేపని చేస్తున్నాను. ఇదే పనిమీద వారం క్రితం బెంగళూరుకు వెళ్లి, తిరిగి వస్తున్నాను. ఆ బస్సులో నాతో పాటు 50 మంది దాకా ప్రయాణికులున్నారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. నేను మేల్కొని చూసేసరికి మంటలు వ్యాపించాయి. బస్సులో కనిపించిన ఎమర్జెన్సీ ద్వారం నుంచి బయటకు దూకేశా. నాతోపాటు మరికొందరూ దూకేశారు. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది.’’
 
 - జైసింగ్(40) ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఉపాధి కోసం ఐదేళ్ల కింద కోసం హైదరాబాద్‌కు వచ్చి, తుర్కపల్లిలో నివాసం ఉంటున్నారు. హిందూవర్ ఇన్నోవేషన్ సంస్థలో లిఫ్ట్‌లకు అద్దాలు అమర్చే పనిచేస్తున్నారు. అదే పనిమీద ఇటీవల బెంగళూరు వెళ్లి వస్తూ ప్రమాదంలో గాయపడ్డాడు. కాళ్లు, చేతులు సహా శరీరంపై 10-12 శాతం కాలినగాయాలయ్యాయి.
 
 వద్దన్నా వినకుండా వచ్చా...
 ‘‘మాది బెంగళూరు. మాదాపూర్ గోల్ఫ్‌కోర్టులో పది నెలల నుంచి కోచ్‌గా పని చేస్తున్నాను. టోలీచౌకి సమీపంలో నివాసం. కొద్ది రోజుల కింద అనారోగ్యంగా ఉండడంతో విశ్రాంతి కోసం బెంగళూరులోని ఇంటికి వెళ్లాను. దీపావళి పండుగ అనంతరం వెళ్లాల్సిందిగా సోదరులు చెప్పినా వినిపించుకోకుండా హైదరాబాద్‌కు బయలుదేరాను. తెల్లవారు జామున ఒక్కసారిగా వెనుక నుంచి మంట శరీరానికి తాకింది. దాంతో ఒక్క ఉదుటున బయటికి దూకేశా. అయినా మంటలు నన్ను వదిలి పెట్టలేదు. తర్వాత ఏం జరిగిందో తెలియదు.’’
 
 - యోగేష్ గౌడ(29) స్వస్థలం బెంగళూరు. మాదాపూర్‌లోని గోల్ఫ్‌కోర్స్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడు. ప్రమాదానికి గురైన బస్సులో డ్రైవర్‌కు వెనుక బి-3 సీటులో కూర్చున్నాడు. ముఖం, తల, ఛాతీ, కాళ్లు, చేతులపై తీవ్రగాయాలయ్యాయి. శరీరం 45 శాతం కాలిపోయింది. వైద్యులు వెంటిలేటర్ అమర్చి, చికిత్స అందిస్తున్నారు.
 
 ‘డీఎన్‌ఏ’తోనే గుర్తింపు..
 బస్సు ప్రమాద ఘటనలో మృతులను గుర్తించడం ప్రధాన సమస్యగా మారింది. ట్రావెల్స్ నిర్వాహకుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా మృతుల సంఖ్యను అంచనా వేయగలుగుతున్నారు కానీ ఏ మృతదేహం ఎవరిదనేది గుర్తించడం కష్టమవుతోంది. కొన్ని మృతదేహాలకు కొన్ని ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. మరికొన్ని మృతదేహాలు అస్తిపంజరంలా ఎముకల గూడులా కనిపిస్తున్నాయి. ముఖం, బట్టలు, ఆభరణాలను గుర్తించే అవకాశం ఉన్నప్పుడే మృతులను గుర్తించడం సాధ్యమవుతుంది. కానీ ఈ ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయి కనిపిస్తున్నాయి.
 
 అందువల్ల డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మాత్రమే మృతులు ఎవరనేదీ గుర్తించే అవకాశం ఉంది. డీఎన్‌ఏ నమూనాల సేకరణ, ప్రమాదం జరిగిన తీరుపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ఫొరెన్సిక్ లాబొరేటరీ(ఏపీఎఫ్‌ఎస్‌ఎల్) నిపుణుల బృందం ఘటనాస్థలికి వెళ్లింది. డీఎన్‌ఏ నిపుణులు, ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ అసిస్టెంట్ డెరైక్టర్ ఫణిభూషణ్, క్లూస్‌టీం నిపుణులు  వెంకన్న, సైంటిఫిక్ ఆఫీసర్ గోపినాథ్‌లను అక్కడికి పంపినట్లు ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ డెరైక్టర్ శారద తెలిపారు. వారు ప్రమాద స్థలానికి వెళ్లి నమూనాలు సేకరించారు.
 
 వారం పట్టొచ్చు: డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతులను గుర్తించేందుకు  ఐదు నుంచి వారంరోజుల సమయం పట్టొచ్చని ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు ప్రొఫెసర్ నారాయణరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. బస్సులో నుంచి మృతదేహాల కాలర్ బోన్, దవడ ఎముకలు తదితర నమూనాలను సేకరించి ఆసుపత్రిలో భద్రపరిచి, అనంతరం వాటి డీఎన్‌ఏలను రక్తసంబంధీకుల డీఎన్‌ఏతో సరిపోలుస్తారని ఆయన వివరించారు.
 
 విషాదం.. వివాదం
  బస్సు ప్రమాదంలో తమ వారు మరణించడంతో ఆ రెండు కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. ఇప్పుడు వారికి తమ వారి మృతదేహాన్ని గుర్తించడం ఇబ్బందిగా మారింది. రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన వేదపతి (27) మృతదేహం కోసం ఆయన తండ్రి విఠల్ బుధవారం ఉదయమే ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించడంతో అక్కడి నుంచి ఉస్మానియాకు వచ్చారు. అక్క డ ఆనవాళ్ల ఆధారంగా తన కుమారుడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఆ మృతదేహం తమ వారిదని హైదరాబాద్‌కు చెందిన ఓ మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొనడంతో పోలీసులు మృతదేహాన్ని ఎవరికీ ఇవ్వలేదు.
  అక్షయ్‌సింగ్ భౌతికకాయుంపైనా..: బస్సు ఘటనలో వుృతి చెందిన చిక్కడపల్లికి చెందిన అక్షయ్‌సింగ్ వుృతదేహం విషయుంలోనూ వివాదం నెలకొంది. బుధవారం అక్షయ్ కుటుంబ సభ్యులు వుృతదేహాన్ని వాహనంలో తీసుకువస్తుండగా జడ్చర్ల వద్ద పోలీసులు ఆపారు. ఇదే ప్రమాదంలో దుర్మరణం పాలైన చిక్కడపల్లిలోని రైట్‌స్పాట్ యూడ్ ఏజెన్సీ యుజవూని వుంజునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆ వుృతదేహం తవుదని అంటున్నారని వారు పేర్కొన్నారు. దీంతో వుృతదేహాన్ని పోలీసులు ఉస్మానియూ వూర్చురీకి తరలించారు. డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే అప్పగిస్తామని ప్రకటించారు.
 
 ఈ ఫోన్ నంబర్లెవరివి?
 సాక్షి, మహబూబ్‌నగర్: టికెట్ బుకింగ్ సందర్భంగా చాలామంది ప్రయాణికులు చిరునామా ఇవ్వకుండా కేవలం సెల్ నంబర్‌తో సరిపెట్టారని మహబూబ్‌నగర్ ఎస్‌పీ నాగేంద్రకుమార్ తెలిపారు. ఈ నంబర్లలో ఎక్కువగా కర్ణాటక రాష్ట్రానివే ఉన్నాయని చెప్పారు. 93412 85804, 72049 74748, 74062 14742, 9164 75305, 78934 51498, 99897 89652, 91779 20128, 91773 694961, 96201 82997, 97394 97377, 97431 23467 నంబర్ల వారి బంధుమిత్రులు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కంట్రోల్ రూంను సంప్రదించాలని కోరారు.
 
 తప్పుల తడకగా జాబితా...
 సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ప్రయాణికుల పేర్లతో జబ్బార్ ట్రావెల్స్ విడుదల చేసిన జాబితాను ప్రమాదం అనంతరం హడావుడిగా రూపొందించినట్టు తెలుస్తోంది. అందులోని ఫోన్ నంబర్లే దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఫోన్ చేస్తే చాలా నంబర్లకు ‘ఇది వాడుకలో లేదు.. నంబరు సరిచూసుకోండి’ అని సమాధానం వస్తోంది. అంతేగాకుండా ప్రయాణికులకు కేటాయించిన సీట్ల నెంబర్లు కూడా తికమకగా ఒకే నంబర్‌ను రెండుమూడుసార్లు పేర్కొన్నారు. అందులో ప్రయాణించినట్లుగా చెబుతున్న వారికి జాబితాలోని కొందరి పేర్లకు అసలు పొంతనలేకుండా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement