Volvo bus catches fire
-
వోల్వో బస్సులో చెలరేగిన మంటలు
మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు దుర్ఘటన మరవక ముందే మరో వోల్వో బస్సులో మంటల చెలరేగాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సులో మంటలు వచ్చాయి. అడ్డాకుల మండలం టోల్గేట్ వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు రావటంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘పాలెం’ దుర్ఘటనకు ఆ నలుగురే బాధ్యులు
సాక్షి, హైదరాబాద్: పాలెంలో వోల్వో బస్సు దుర్ఘటనకు బెంగళూరులో అరెస్ట్ చేసిన షబ్బీర్, అక్రం, రఫీక్, అమానుల్లాలే కారణమని సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద గత అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు అగ్నిమాదానికి గురై 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే జబ్బార్ ట్రావెల్స్ యజమానితోపాటు బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేయగా.. గురువారం రాత్రి బెంగళూరులో షబ్బీర్, అక్రం, రఫీక్, అమానుల్లాలను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ డీఎస్పీ నోముల మురళీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం వీరిని బెంగళూరులో అదుపులోకి తీసుకుంది. వీరిలో అక్రం వోల్వో బస్సుకు మె యింటెనెన్స్, షబ్బీర్ కార్గో పనులు చూస్తుండగా, అమానుల్లా, రజాక్ టికెట్లు ఇచ్చే వారని తేలింది. వీరిపై సీఆర్పీసీలోని సెక్షన్ 336 కింద కేసులు నమోదు చేశారు. బస్సులో 39 మంది ప్రయాణికులను ఎక్కించాల్సి ఉండగా.. వీరు అత్యాశకు పోయి 52 మందిని ఎక్కించారని సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ శుక్రవారం ‘సాక్షి’తో చెప్పారు. షబ్బీర్ నిబంధనలకు విరుద్ధంగా మండే గుణం ఉన్న వస్తువులను కూడా బస్సులో చేర్చినట్లు తేలిందన్నారు. మెయింటెనెన్స్ చూసే అక్రం, బస్సులో ఎమర్జెన్సీ డోర్ సక్రమంగా పని చేస్తుందా లేదా అనేది తనిఖీ చేయలేదన్నారు. అలాగే బస్సులో ఉండాల్సిన ఎమర్జెన్సీ హ్యామర్స్ను ఉంచలేదని, ప్రమాదం జరిగితే బస్సు అద్దాలను పగులగొట్టి వెలుపలికి ఎలా రావాలో జాగ్రత్తలను ప్రయాణికులకు సూచించలేదని ఆయన వివరించారు. బస్సు ప్రమాదానికి వీరు నేరుగా బాధ్యులు కాకపోయినా.. నిబంధనలు పాటించకపోవడంతో ఈ దుర్ఘటనకు వీరు సహకరించినట్లు అయ్యిందన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తామని కృష్ణప్రసాద్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు ముగియలేదని, ఎవరెవరు బాధ్యులనే దానిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. -
అనంతపురం జిల్లాలో వోల్వో బస్సులో మంటలు
అనంతపురం : మహబూబ్‌నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాద ఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో కొండికొండ చెక్‌పోస్ట్ వద్ద శనివారం ఓ వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తం అయిన ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా బయటపడ్డారు. బస్సు పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. -
మొన్న పాలమూరులో.. నేడు కర్ణాటకలో అదే ఘోరం
* మరో వోల్వో బస్సు బుగ్గి.. డ్రైవర్ సహా ఏడుగురు సజీవ దహనం * వేగంగా వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టడమే ప్రమాదానికి కారణం * బెంగళూరు నుంచి ముంబై వెళ్తుండగా కునిమల్లహళ్లి వద్ద ఘటన * డీజిల్ ట్యాంక్ పగలడంతో అంటుకున్న మంటలు * మహబూబ్‌నగర్ ఘోర ప్రమాదం మరవకముందే మరో విషాదం * రెండు ఘటనల్లో 52 మంది సజీవ దహనం.. కళ్లు తెరవని ప్రభుత్వాలు * వోల్వో బస్సు అంటేనే హడలెత్తిపోతున్న ప్రయాణికులు * ప్రమాదాలకు కారణం అతి వేగమే.. ఈ బస్సుల వేగం 100 కి.మీ * మించకుండా ‘లాక్ సిస్టమ్’.. ఆ ‘లాక్’ తెరిచేస్తుండడంతో ప్రమాదాలు దావణగెరె, న్యూస్‌లైన్/సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: మళ్లీ అదే ఘోరం.. అవే మంటలు.. అదే వోల్వో బస్సు.. పక్షం రోజులు తిరగకుండానే దారుణం.. మహబూబ్‌నగర్ జిల్లాలో కిందటి నెల 30న చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనమైన ఘటన కళ్లముందు కదలాడుతుండగానే కర్ణాటకలో అచ్చం అదే తరహాలో మరో బస్సు భస్మీపటలమైంది! ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బుధవారం అర్ధరాత్రి సుమారు మూడు గంటల సమయంలో హావేరి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కునిమల్లహళ్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళ్తున్న ఈ బస్సు వరదా నదిపై నిర్మించిన బ్రిడ్జి రెయిలింగ్‌ను బలంగా ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పగిలి క్షణాల్లో మంటలు వ్యాపించాయి. బస్సులో మొత్తం ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సహా 53 మంది ఉండగా.. అందులో ఓ డ్రైవర్‌తోపాటు ఆరుగురు మృతి చెందారు. మిగతావారు గాయాలతో బయటపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కాలిపోయింది జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు కాగా.. ఇప్పుడు నేషనల్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సే కావడం గమనార్హం. బస్సులో 53 మంది: ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌తోపాటు ప్రయాణికుల్లో 43 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఏడేళ్ల చిన్నారి.. మొత్తం 53 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎనిమిది పికప్ పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకున్న ఈ బస్సు బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు బస్సు ముంబై చేరుకోవాలి. బస్సు తుమకూరు దాటిన తర్వాత రెండో డ్రైవర్ స్టీరింగ్‌ను అందుకున్నారు. అయితే హవేరీ జిల్లాలోని కునిమల్లహళ్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి డ్రైవర్ సహా ఏడుగురు మరణించారు. 44 మంది గాయాలతో, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. నయాజ్(అదనపు డ్రైవర్), రోహన్, జమీర్, సమీరాబాను - కలీం (దంపతులు), కైఫ్, అమాన్లు మృతి చెందినట్లు భావిస్తున్నారు. గందరగోళంగా ప్రయాణికుల జాబితా ఈ బస్సులో ప్రయాణించినవారు ఎవరెవరన్న విషయంపై గందరగోళం నెలకొంది. బెంగళూరులోని ఆ సంస్థ కార్యాలయంలో ఉన్న రిజర్వేషన్ చార్ట్‌లో ఉన్న పేర్లు.. ప్రమాదంలో గాయపడిన వారి పేర్లకు పొంతన (ఒకరి పేరుతో రిజర్వ్ చేసుకుని.. మరొకరు ఎక్కడం వల్ల) కుదరడం లేదు. ప్రమాదం నుంచి గాయాలతో బయట పడిన వారిలో షహద్ ఇబ్రహీం, జమాలుద్దీన్, సయ్యద్ షా షేర్వానీ, సోహన్ లాల్, ఉమత్ అహ్మద్, ప్రశాంత్ పాండే, జన్నత్, మసీ, వజీర్సాబ్, రాజన్ కుమార్, జేరారామ్ తేరా, ముస్రా కాటన్, మహ్మద్ వజీర్, సోనూ, అంబాత్, నరేష్ జైన్, అజయ్ కుమార్, గణేష్ గుప్తా, రంజిత్ కుమార్, సోలియా ఖాన్, విశ్రాంత్, గోకుల్ ఠాక్రే, మహ్మద్ జమీర్, అశ్విని కుమార్ జైన్, రియాజ్ కుమార్ నాయక్, మీరాచౌదరి, మనీఫ్, వజీం, గౌరవ్, మూవీ, ఇలియాజ్‌ఖాన్, షానా, పప్పు, దిలీప్‌కుమార్, శోభాలక్ష్మణ్, వరుణ్, మనోజ్‌కుమార్, నేహాల్, నాగేష్, సలీంఖాన్, మనోజ్‌పాటిల్, మహ్మద్ అస్మా, బ్రైట్, రేవణ సిద్ధయ్య ఉన్నారు. ఈ లెక్కన మతి చెందిన ఏడుగురితో పాటు డ్రైవర్లతో కలిపి బస్సులో 53 మంది ప్రయాణించినట్లు తెలుస్తోంది. ట్యాంకు పగిలి మంటలంటుకున్నాయి: ఎస్పీ బస్సు వేగంగా వచ్చి బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీ కొట్టడంతో డీజిల్ ట్యాంకు పగిలి మంటలు అంటుకున్నాయని అంచనాకు వచ్చినట్లు హావేరి ఎస్పీ ఎం. శశికుమార్ తెలిపారు. బస్సు రెయిలింగ్‌ను ఢీకొట్టాక 150 మీటర్ల దూరం దూసుకుపోయిందని, డ్రైవర్ బ్రేకులు వేయగానే మంటలు అంటుకున్నాయని అన్నారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే మరణించగా.. నలుగురు ఆస్పత్రికి తరలించే దారిలో మరణించారని తెలిపారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, క్లీనర్ గాయాలతో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.లక్ష చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు. కిమ్స్ మార్చురీలో మృతదేహాలు దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాలను హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ట్రావెల్ ఏజెన్సీ నుంచి ప్రయాణికుల సమాచారం సేకరించిన తర్వాత మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి సంబంధీకులకు అందజేస్తామని హవేరి కలెక్టర్ పాండురంగ నాయక్ తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరుపుతామని తెలిపారు. మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సమీర్భాను, కలీం భార్యభర్తలు కాగా మహమ్మద్ కైఫ్(3)ను వారి కుమారుడిగా గుర్తించారు. అయితే మరో ఇద్దరు పిల్లలు కూడా వీరి కుమారులే కావచ్చని భావిస్తున్నారు. ఆ ఇద్దరి సమయస్ఫూర్తే అందర్ని కాపాడింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ఇద్దరు యువకుల సమయస్ఫూర్తి వల్లే ప్రాణ నష్టం తగ్గింది. వారిలో ఒకరు ఢిల్లీకి చెందిన ప్రశాంత్ కాగా.. మరొకరు అఫ్తాబ్. బస్సు ప్రమాదానికి గురైన విషయం వెనువెంటనే గమనించిన ప్రశాంత్(25) అప్రమత్తమయ్యాడు. నిద్రలో ఉన్న తోటి ప్రయాణికులను కేకలు వేస్తూ మేల్కోలిపి బస్సు అద్దాలు పగులగొట్టి వారు బయటకు వెళ్లేందుకు సహకరించాడు. అదేసమయంలో అప్పటికే బస్సులో మెలకువగా ఉన్న అఫ్తాబ్ మంటలు వ్యాపించిన విషయాన్ని గమనించి, బస్సు పైభాగంలో గాలి కోసం అమర్చి ఉన్న చిన్నపాటి డోర్‌ను తెరిచి.. అందర్నీ అటు రావాల్సిందిగా సూచిస్తూ తాను బయటకొచ్చాడు. వెను వెంటనే 22 మంది అతడిని అనుసరించి బయటపడ్డారు. అయితే సజీవ దహనమైన వారిలో ఓ చిన్నారి ఉండడం అందరినీ కలిచి వేసింది. ప్రమాదాన్ని గుర్తించిన చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తగులబడుతున్న బస్సులో నుంచి ప్రయాణికులను కాపాడేందుకు ప్రాధాన్యతనిచ్చిన ప్రశాంత్, అఫ్తాబ్‌ను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ ప్రశంసించారు. క్షణాల్లో జరిగిపోయింది ‘‘ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. నాకు నిద్ర పట్టకపోవడంతో మేలుకునే ఉన్నాను. ఇంతలోనే ఉన్నట్లుండి పెద్ద శబ్దం వచ్చింది. తేరుకునేలోపే బయట నుంచి మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా వేడి తగలడంతో తల్లడిల్లిపోయాం. నా వెనుక ఉన్న వ్యక్తి ఎవరో కిటికీ పగులగొట్టాడు. వెంటనే కిటికీలోంచి నా భార్యను బయటికి తోసేసి నేనూ దూకేశాను.’’ - రాజీవ్ కుమార్, ముంబై మేల్కొని ఉన్నాను కాబట్టే బతికాను.. ‘‘ఎందుకో ప్రమాదానికి కాస్త ముందే మెలకువ వచ్చింది. కర్టెన్ పక్కకు జరిపి విండోలోంచి బయటకు చూస్తున్నాను. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి బస్సు రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొని ఆగిపోయింది. ఆ వెంటనే క్షణాల్లో మంటలు వ్యాపించాయి. కిటికీ అద్దం పగులగొట్టడానికి ప్రయత్నించాను. కాలితో పలుమార్లు గట్టిగా తన్నినా పగలలేదు. పైకి చూడగానే కిటికీ కాస్త తెరుచుకుని కనిపించింది. గట్టిగా పైకి తోయడంతో మనిషి దూరేంత ఖాళీ ఏర్పడింది. ఇలా రండి అంటూ గట్టిగా అరిచి.. నేనూ బస్సు పైకి ఎక్కి ఆ వెంటనే కిందకు దూకాను. కాలు బెణికింది. నా వెనుకే చాలా మంది బస్సుపెకైక్కి.. ఆపై కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.’’ - ఆఫ్తాబ్, న్యూఢిల్లీ బచావ్.. బచావ్.. కేకలు ‘‘నిద్రలో ఉన్నాను. ఒక్కసారిగా గట్టిగా అరుపులు.. బచావ్.. బచావ్..(కాపాడండి.. కాపాడండి..) అంటూ గావు కేకలు వినిపించాయి. ఏం జరిగిందో అర్థం కాలేదు. బస్సు తగలబడిపోతోందని కేకలు వేస్తున్నారు. ఒకరిపై ఒకరు పడుతూ లేస్తున్నారు. ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. ఓ యువకుడు బస్సు పైభాగంలో ఉన్న విండో ఓపెన్ చేసి పెకైక్కాడు. నేనూ అతన్ని అనుసరించి బయటపడ్డాను’’ - దిలీప్ షిండే, సతార, మహారాష్ట్ర -
కర్నాటక హవేరిలో ఘోర బస్సు ప్రమాదం
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్‌కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హవేరీ జిల్లాలోని కునిమల్లళ్లిలో ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. 25 మంది గాయపడ్డారు. వీరిని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. -
కర్ణాటకలో బస్సు ప్రమాదం, ఏడుగురు సజీవ దహనం
బెంగళూరు: మహబూబ్‌నగర్ జిల్లాలో వోల్వో బస్సు దుర్ఘటన మరువక ముందే కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్‌కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హవేలీ జిల్లాలోని కునిమల్లళ్లిలో ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. 25 మంది గాయపడ్డారు. వీరిని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. నిన్న సాయంత్రం 6.30 గంటలకు బెంగళూరు నుంచి ముంబైకి ఈ బస్సు బయలు దేరింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు ప్రమాదానికి గురయినట్టు తెలుస్తోంది. బస్సు డివైడర్‌ను ఢీకొని టైరు పేలడంతో మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక సమాచారం. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే లోపే మంటల్లో బస్సు పూర్తిగా తగలబడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ నెల 7న కర్ణాటకలో జరిగిన మరో బస్సు ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. బెంగళూరు-తుమకూరు రోడ్డులోని గురగుంటపాళ్య సిగ్నల్ సమీపంలో కర్ణాటక రాష్ట్ర(కేఎస్) ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. మంటలను ముందే గుర్తించి ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపేశాడు. తర్వాత వారు బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. -
‘వోల్వో’ డ్రైవర్లకు ప్రత్యేక లెసైన్స్..?
రవాణాశాఖ యోచన సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో అతివేగంగా ప్రయాణించే బస్సులకు సంబంధించి డ్రైవింగ్ నిబంధనల్లో మార్పు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ప్రస్తుతం బస్సులన్నింటికీ ఒకే తరహా డ్రైవింగ్ లెసైన్స్ విధానం అమలు చేస్తున్నారు. కానీ, గతే డాది 32 మందిని బలిగొన్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు, ఇప్పుడు 45 మంది మృతికి కారణమైన బస్సు.. రెండూ ‘వోల్వో’ బస్సులే. అత్యంత వేగంగా ప్రయాణించగలిగే ఈ తరహా బస్సుల్ని ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారే అదుపు చేసే అవకాశముంటుంది. కానీ సరైన శిక్షణ లేనివారు కూడా వాటిని నడుపుతూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలాంటి వాటి డ్రైవర్లకు ప్రమాదకర పదార్థాలను తరలించే వాహనాలకు జారీ చేసే లెసైన్స్ విధానం వర్తింప చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ఈ లెసైన్స్‌లను ఏడాదికోసారి రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో డ్రైవర్లకు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తా రు. అందులో సఫలమైతేనే రెన్యువల్ చేస్తారు. మరోవైపు ‘వోల్వో’ తరహా బస్సుల్లో.. ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తే ముందస్తుగా హెచ్చరించే పరిజ్ఞానమూ కొత్త బస్సుల్లో ఉం టోంది. వాటిపై డ్రైవర్లకు అవగాహన ఉందని ధ్రువీకరించుకున్నాకే లెసైన్సులు రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. కాగా.. ఆర్టీసీలో ‘వోల్వో’ తరహా బస్సులు నడిపే డ్రైవర్లకు ఇస్తున్న తరహాలోనే ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లకు శిక్షణ ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సిఫారసు చేయాలని ఆలోచిస్తున్నారు. -
ఈ దుఃఖం ఆగేదెప్పుడు?
* కాలిన మృతదేహాల గుర్తింపు కష్టమే * వెంటాడుతున్న ఐదేళ్లనాటి ‘గౌతమి’ దుర్ఘటన * నేటికీ గుర్తించని 11 మృతదేహాలు ఎవరివో..? * తమిళనాడు రైలు ప్రమాదంలోనూ ఇదే దుస్థితి * మ.నగర్ ఘటనలోనూ అదే అయోమయం సాక్షి, హన్మకొండ/అమలాపురం: ‘ఒక్కగానొక్క కొడుకని అల్లారు ముద్దుగా పెంచి చెట్టంతవాన్ని చేస్తిమి కొడుకా.. 15 నెలలైతాంది నీ జాడేది..? మాకు ఈ దుఃఖం ఆగేదెప్పుడు.. బిడ్డా..?’ అంటూ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో ఆచూకీ లేకుండాపోయిన వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదారపు అవినాష్ తల్లి గీతాదేవి కన్నీళ్లు పెట్టుకుంటోంది. 2012 జులై 30న నెల్లూరు వద్ద జరిగిన ఈ ఘటన మాదిరిగానే.. ఐదేళ్ల క్రితం జరిగిన గౌతమి రైలు ప్రమాదంలో మృతి చెందిన 11 మంది ఆనవాళ్లు నేటికీ గుర్తించలేకపోయారు. 2008 జూలై 31 రాత్రి సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన గౌతమి ఎక్స్‌ప్రెస్ అర్ధరాత్రి 1 గంటకు వరంగల్ జిల్లా కేసముద్రం మండలం తాడ్లపూసపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ రైలు ఎస్-10 బోగీలో అకస్మాత్తుగా అగ్నికీలలు లేచి.. మొత్తం 31 మంది మరణించగా, వారిలో నలుగురిని వెంటనే గుర్తించారు. అసలే గుర్తించ లేనివిధంగా కాలిపోయి 27 మంది మృతిచెందినట్లు రైల్వే అధికారులు ధ్రువీకరించారు. కాలి బూడిదయ్యే స్థితిలో ఉన్న అవయవాలు మాత్రమే మిగలడంతో.. డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతి చెందిన వ్యక్తులను గుర్తించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే ఆ డీఎన్ఏ పరీక్షల్లో కేవలం 16 మందిని మాత్రమే గుర్తించగలిగారు. ఈ దుర్ఘటనలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రిటైర్డు సీటీఓ బేజుపూరి చెంచయ్య కుమారుడు, కోడలు డాక్టర్ బి.రవికుమార్, డాక్టర్ సరిత (ఏడు నెలల గర్భిణీ) బుగ్గి అయ్యారు. ఇలా మిగిలిన 11 శాంపిల్స్ ఎవరివో డీఎన్ఏ పరీక్షల ద్వారా తెలుసుకునేందుకు వీలుకాక వరంగల్ కేఎంసీలోనే ఉండిపోయాయి. వీటికి అంత్యక్రియలు నిర్వహిద్దామనుకున్నా.. చట్టపరంగా ఏవైనా అభ్యంతరాలెదురు కావచ్చనే భయం వెంటాడుతోంది. దీంతో ఈ విషయమై తమకు సలహా ఇవ్వాల్సిందిగా జిల్లా ఉన్నతాధికారులు న్యాయశాఖకు లేఖ రాశారు. ఇలా ఇప్పటికీ తమ వాళ్లు బతికే ఉన్నారా.. చనిపోయారా..? అని వారి కుటుంబీకులు కన్నీళ్లతో కుమిలిపోతున్నారు. ఇలాంటి ఘోర అగ్నిప్రమాదాల్లో మృతదేహాలు బుగ్గి అవడం వల్ల కొన్ని డీఎన్ఏ పరీక్షలకూ దొరకవని రిటైర్డు సీటీఓ చెంచయ్య తెలి పారు. తమ కొడుకు, కోడలు మృతి విషయంలో తెలిసివచ్చిందన్నారు. ఇలాంటపుడు ఇతర ఆధారాలతో మృతులను నిర్ధారించాలని కోరారు. ఉద్యోగం ఇవ్వలేదు.. హైకోర్టు జోక్యంతో డెత్ సర్టిఫికెట్ గౌతమి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కిర్లంపూడికి చెందిన పిరాట్ల గొల్లబ్బాయి, సత్యప్రభావతి మృతదేహాలూ డీఎన్ఏ పరీక్షలకు వీల్లేని రీతిలో బూడిదయ్యాయి. దీంతో రైల్వే శాఖ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాతోపాటు వారి డెత్ సర్టిఫికెట్ల కోసం కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడ్డారు. చివరికి హైకోర్టును ఆశ్రయించి సర్టిఫికెట్లు పొందగలిగారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని రైల్వేశాఖ ప్రకటించినా.. ఇప్పటికీ రాలేదని గొల్లబ్బాయి కుమారుడు రామకృష్ణ తెలిపాడు. ఉద్యోగం కోసం రెండేళ్లుగా హైకోర్టు చుట్టూ తిరుగుతున్నానన్నాడు. ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో వోల్వో బస్సు దగ్ధం ఘటనలో బుగ్గి అయిన 45 మందిలో.. గురువారం నాటికి 41 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. డీఎన్ఏ పరీక్షల సమస్యలే ఎదురు కావచ్చని బాధిత కుటుంబాలవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మృతదేహాల విషయంలో ప్రభుత్వం కొన్ని మినహాయింపులివ్వాలని, ప్రయాణికుల జాబితా, కుటుంబ సభ్యుల సమాచారం ఆధారంగా వారు మృతిచెందినట్లు నిర్ధారించి, న్యా యం చేయాలని బాధిత కుటుంబాల వారు కోరుతున్నారు. -
మృతుల గుర్తింపుకు పది రోజులు!
* దేహాలు బాగా కాలిపోయినందున డీఎన్ఏ పరీక్షల్లో ఆలస్యమవుతుందని ఫోరెన్సిక్ నిపుణుల వెల్లడి * ఒక్కరు మినహా మిగతావారి బంధువుల నుంచి నమూనాల సేకరణ * నగలు, వాచీ, సిమ్‌కార్డుల ఆధారాలతో కొన్ని మృతదేహాల గుర్తింపు * అయినా డీఎన్ఏ రిపోర్టు వచ్చేవరకూ ఇవ్వలేమన్న ఉస్మానియా వైద్యులు, పోలీసులు * ఫోరెన్సిక్ అధికారులు, పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డ మృతుల బంధువులు సాక్షి, హైదరాబాద్: బస్సు దగ్ధం ఘటనలో మృతులను గుర్తించేందుకు ఎనిమిది నుంచి పది రోజుల వరకూ పట్టవచ్చని అధికారులు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున బస్సు దగ్ధమై 45 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన అనంతరం మృతదేహాలను హైదరాబాద్‌లోని ఉస్మానియా మార్చురీకి తరలించారు. దీంతో మృతుల బంధువులంతా గురువారం ఉదయం 8 గంటలకే ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ దుర్ఘటనలో దేహాలూ పూర్తిగా కాలిపోవడంతో.. డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వచ్చింది. మృతుల వివరాలకు అనుగుణంగా రక్త సంబంధీకుల నుంచి రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఏపీఎఫ్ఎస్ఎల్) నిపుణులు డీఎన్ఏ నమూనాలను సేకరించారు. గుజరాత్‌కు చెందిన ఒక మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం శుక్రవారం ఇక్కడకు చేరుకుని నమూనాలు ఇవ్వనున్నారు. మృతదేహాల నుంచి కాలర్ బోన్, దవడ ఎముకలను సేకరించామని, వారి రక్త సంబంధీకుల నమూనాలతో పోల్చి మృతులు ఎవరనేదీ నిర్ధారిస్తామని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. ప్రమాదంలో ఎముకలు కూడా బాగా కాలిపోవడంతో డీఎన్ఏ సేకరణ కూడా కష్టంగా మారిందని, అందువల్ల డీఎన్ఏ పరీక్షల ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సాధారణంగా 15 రోజుల వరకూ పడుతుందని, బస్సు దుర్ఘటన కేసును ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని రోజూ మూడు బృందాలు 24 గంటలూ పరిశోధన చేసేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. అయినప్పటికీ డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యేందుకు 8 నుంచి 10 రోజుల వరకూ సమయం పట్టవచ్చని వివరించారు. అయితే, డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన తరువాత మాత్రమే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. కానీ, తమ ఆప్తులు మరణించారనే వేదనతో ఉన్న తమను... అంత్యక్రియలు కూడా సకాలంలో నిర్వహించుకోలేకపోతున్నామనే బాధ మరింత ఆవేదనకు గురిచేస్తోందని మృతుల బంధువులు పేర్కొంటున్నారు. ఆధారాలున్నా ఇవ్వలేం బస్సు దుర్ఘటన మృతదేహాలను గుర్తించేందుకు నగలు, వాచీలు, సెల్‌ఫోన్ సిమ్కార్డులూ వంటి ఆధారాలు దొరికినా.. డీఎన్ఏ రిపోర్టు వచ్చే వరకూ బంధువులకు అప్పగించలేమని అధికారులు తేల్చిచెప్పారు. దాంతో ఆధారాలు దొరికితే తమవారి భౌతికకాయాలను అప్పగిస్తారేమోనని వచ్చిన బంధువులు ఆవేదనలో మునిగి పోయారు. అయితే, బస్సు ప్రమాదంలో సజీవ దహ నమైన ఘటనలో 42 మృతదేహాలకు శవపరీక్షలు పూర్తయ్యాయని ఉస్మానియా ఫోరెన్సిక్ విభాగాధిపతి టకీయుద్దీన్ తెలిపారు. శాంపిళ్లను ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించామని చెప్పారు. ఈ విషయంలో తాము చేయాల్సిన పని పూర్తయిందని, ఇక చేయాల్సిందంతా పోలీసులేనని స్పష్టం చేశారు. పోలీసులు చెప్పాకే మృతదేహాలను అప్పగిస్తామన్నారు. మరోవైపు.. పోలీసులు మృతుల డీఎన్ఏ రిపోర్టు వచ్చాకే భౌతికకాయాలు అప్పగిస్తామని, అంతవరకూ ఆగాల్సిందేనన్నారు. దీంతో కొందరు మృతుల బంధువులు.. గుర్తించిన మృతదేహాలనైనా ఇవ్వాలని అధికారులను నిలదీశారు. అయితే, అధికారులు వారిగోడు పట్టించుకోకుండా.. నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని ఫోరెన్సిక్ లేబొరేటరీకి వెళ్లి, శాంపిళ్లు ఇవ్వాలని మృతుల బంధువులకు సూచించారు. అయితే, మృతుల బంధువుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారున్నారు. వారికి ఫోరెన్సిక్ లేబొరేటరీ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడికెళ్లాలో, ఎలా వెళ్లాలో తెలియక కొంతమంది బాధితులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి బంధువులంతా ఫోరెన్సిక్ ల్యాబ్ వెళ్లినా... నమూనాలు ఇవ్వడానికి గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చింది. కొన్ని ఆధారాలు లభ్యమైనా ప్రమాదానికి గురైన బస్సులో మృతదేహాల వద్ద దొరికిన కొన్ని వస్తువులు, నగలు, సెల్ఫోన్లను ఉస్మానియా ఆస్పత్రిలో ఆయా మృతదేహాలతో పాటే భద్రపరిచారు. ఆ వస్తువులను కొందరి బంధువులు గుర్తించారు కూడా. వెంకటేష్ యాదవ్ అనే ప్రయాణికుడికి చెందిన వెండి మొలతాడు, ఆయన సోదరి అనిత నగల ఆధారంగా బంధువులు అన్నాచెల్లెళ్ల మృతదేహాలను గుర్తించారు. కానీ, అవే నగలు తమ బంధువు ధరించినవిగా మరో కుటుంబం చెప్పడంతో ఆ మృతదేహాలను ఎవరికీ అప్పగించలేదు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన శివకిరణ్ మృతదేహాన్ని.. బెల్టు, సెల్‌ఫోన్‌లోని మెమొరీకార్డు, చేతి వాచీ ఆధారంగా బంధువులు గుర్తుపట్టారు. కానీ, ఆ మృతదేహాన్ని బుధవారమే ఎవరో తమవారిదని చెప్పారని పేర్కొంటూ అధికారులు అప్పగించలేదు. మరో మృతుడు వేదపతి ధరించిన జీన్స్‌ప్యాంట్, సాక్స్, బనియన్ల ఆధారంగా బంధువులు మృతదేహాన్ని గుర్తించినా, అధికారులు అప్పగించలేదు. ఇలా మరో ఇద్దరికి సంబంధించి కూడా ఆధారాలను గుర్తించినా మృతదేహాలను ఇవ్వలేదు. ఆధారాలు ఉంటే మృతదేహాన్ని అప్పగించాలని మంత్రులు కూడా చెబుతున్నారని, అయినా ఇవ్వడం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకునే దిక్కులేదు ఘటన మృతదేహాలను బుధవారం సాయంత్రం ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు. కానీ, బంధువులు, బాధితుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. నమూనాల సేకరణ ఎలా జరుగుతోంది? మృతుల బంధువులకు దిశానిర్దేశం చేయడం తదితర అంశాలపై ఒక్క ఉన్నతాధికారి కూడా వచ్చి పర్యవేక్షణ చెయ్యలేదు. మరోవైపు ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు కూడా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. ఒక్కరంటే ఒక్క రాష్ట్రస్థాయి అధికారి కూడా రాలేదు. కనీసం మృతుల బంధువులకు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. చివరకు బంధువులు గొడవ చేస్తే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అధికారి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్ ఘటన సమయంలోనూ ఇదే తంతు.. ఉత్తరాఖండ్‌లో వరదలు ముంచెత్తినప్పుడు కూడా రాష్ట్రప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. వందలాది మంది జాడ తెలియక ఆందోళన చెందిన బంధువులకు ప్రభుత్వం కనీస భరోసా ఇవ్వలేకపోయింది. కొన్ని మృతదేహాలు లభ్యమైన తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ మృతదేహాలు కావాలంటే డెహ్రాడూన్‌కు వచ్చి నమూనాలు ఇవ్వాలని, డీఎన్ఏ పరీక్షలు చేసి వాటిని అప్పగిస్తామని చెప్పింది. డెహ్రాడూన్‌కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణ సౌకర్యం కల్పించలేదు. ప్రస్తుతం బస్సు దుర్ఘటనలోనూ రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆరు విధాలుగా గుర్తించొచ్చు! సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది మరణించగా.. వారికి సంబంధించి 42 మృతదేహాలను ఇంకా గుర్తించలేకపోయారు. అగ్నికీలలకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడమే దానికి కారణం. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాల సమయంలో మృతులను ముఖ్యంగా ఆరు విధాలుగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవి.. 1. సీటు నెంబర్: మృతదేహమున్న సీటు నంబర్‌ను బస్సు బయల్దేరే ముందు రూపొందించిన ప్రయాణికుల జాబితాతో పోల్చిగుర్తిస్తారు. అయితే మార్గమధ్యలో సీట్లు మారే అవకాశమున్నందున ఈ విధానంతో కచ్చితంగా గుర్తించలేం. 2. ఆభరణాలు: మృతదేహాలను స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తారు. అందులో మృతదేహం ఉన్న ప్రాంతం (సీటు లేదా మధ్య ఖాళీ స్థలంలో) నుంచి తీశారు? దానిపై లభించిన నగలు, ఆభరణాల వివరాలను పొందుపరుస్తారు. వాటి ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించవచ్చు. ఈ తరహాలోనే ప్రస్తుత ఘటనలోనూ నగల ఆధారంగా ఇద్దరి మృతదేహాలను బంధువులు గుర్తించారు. 3. వస్త్రాలు, వస్తువులు: ప్రయాణిస్తున్న సమయంలో ధరించిన వస్త్రాలు, వెంట తీసుకువెళ్తున్న వస్తువులు సైతం కీలక ఆధారాలే. అవి లభించకపోతే సూట్‌కేసులు, బ్యాగులు, సెల్ఫోన్లు, లైటర్లు వంటి వాటిని సేకరిస్తారు. వాటి ఆధారంగానూ గుర్తించవచ్చు. 4. శరీరం, గాయాలు: మృతుల ఒడ్డు, పొడుగు వంటి శరీరాకృతులను ఎముకల ద్వారా తెలుసుకోవడంతో పాటు గాయా లు, అంగవైకల్యాలు తదితరాలు సైతం గుర్తింపునకు ఉపకరిస్తాయి. దంతాలతో గానీ, గతంలో ఆపరేషన్లు జరగడం, కాళ్లు-చేతులు విరగడం వంటి ఆధారాలూ గుర్తింపునకు పనికొస్తాయి. 5. రక్తం, డీఎన్ఏ: శరీరం పూర్తిగా కాలిపోయినా.. అంతర్గత అవయవాల్లో కొంత వరకు రక్త నమూనాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. అదీ సాధ్యం కానప్పుడు బోన్ మ్యారోను సేకరించి విశ్లేషిస్తారు. అవీ లభ్యమయ్యే పరిస్థితి లేకపోతే డీఎన్ఏ పరీక్షలే శరణ్యం. మృతదేహానికి సంబంధించి, ఏ చిన్న ఆధారం నుంచైనా దీనిని గుర్తించొచ్చు. 6. సూపర్ ఇంపోషన్: మృతదేహం నుంచి డీఎన్ఏ, రక్తనమూనాలను కూడా సేకరించే అవకాశం లేనప్పుడే ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఇందులో మృతదేహం పుర్రెను ఆధునిక పరికరాలు, కంప్యూటర్ సాయం తో విశ్లేషించి, ముఖాకృతిని ఇస్తారు. దాన్ని అనుమానితుల ఫొటోతో సరిపోల్చడం ద్వారా నిర్ధారిస్తారు. -
బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు దగ్ధం ఘటన పట్ల ప్రధాని మన్మోహన్సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంపై విచారం వెలిబుచ్చారు. బుధవారం ఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. గాయపడ్డవారు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు. విచారణ జరిపిస్తున్నాం: సీఎం శ్రీకాకుళం, న్యూస్‌లైన్: బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ముంపు ప్రాంతాల్లో పర్యటనకు శ్రీకాకుళం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దారుణమైన ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన వెనుక సంఘ విద్రోహ శక్తుల హస్తం ఉందా? లేక నిర్లక్ష్యమే కారణమా? అనే విషయమై విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అండగా నిలవండి మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నాయకులకు జగన్ సూచన సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అగ్నికీలల్లో చిక్కుకొని 45 మంది మృతి చెందడం పట్ల వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రయాణికులు మాడిమసై పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన బుధవారం సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే.. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు వీలైనంతగా సహాయపడాలని ఆయన మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నాయకులను కోరారు. కోర్టు ఆంక్షల మూలంగా ఆయన సంఘటనా స్థలానికి వెళ్లలేకపోయారు. హైదరాబాద్‌ను విడిచి వెళ్లరాదనే ఆంక్షలను సడలిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు బుధవారం సాయంత్రం 5గంటల తర్వాత వెలువడ్డాయి. మృతుల కుటుంబాలకు ప్రముఖుల సంతాపం సాక్షి, నెట్వర్క్: బస్సు ప్రమాదంపై తమిళనాడు గవర్నర్ రోశయ్య విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాదంలో అంత మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. తణుకులో మాట్లాడుతూ.. ప్రభుత్వ విభాగాలు సరైన రీతిలో పని చేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదంపై అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.నారాయణ, బీవీ రాఘవులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ మార్గంలో నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై కొరడా ఝుళిపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం బస్సు ప్రమాదస్థలాన్ని ఆయన సందర్శించారు. దుర్ఘటనపై లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అక్రమ వాహనాలను నియంత్రిస్తేనే భద్రత’ సాక్షి, హైదరాబాద్: అక్రమ వాహనాలను నియంత్రించడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆర్టీసీ ఈయూ అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పద్మాకర్ అన్నారు. రవాణా శాఖ ప్రైవేటు వాహనాలను నియంత్రించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్ అన్నారు. -
తేరుకులోనే లోపే.. మృతుఒడిలోకి
మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలోఐదుగురు ప్రయాణికులు, బస్సు డ్రైవర్, క్లీనర్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో బెంగళూరుకు చెందిన యోగేష్‌గౌడ అనే ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారికి తొలుత మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మినహా ఆరుగురు క్షతగాత్రులు 12-25 శాతం గాయాలతో బాధపడుతున్నట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ సమి స్పష్టం చేశారు. దట్టమైన పొగ, మంట కారణంగా వ చ్చిన వేడిగాలి లోపలికి వెళ్లడం వల్ల (రెస్పిరేటరీ బర్నింగ్స్) గుండె, ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే నాళాలు దెబ్బతిని ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. గాయపడ్డవారందరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం గురించి బాధితులు వెల్లడించిన వివరాలు.. - సాక్షి, సిటీబ్యూరో కళ్లు తెరిచి చూసే సరికి... ‘‘సైబర్ టవర్స్‌లోని ఐఐఐ లోటస్ ఇన్ఫోటెక్లో పని చేస్తున్నాను. ప్రాజెక్టు పనిమీద బెంగళూరు వెళ్లి, తిరిగి వస్తున్నాను. డ్రైవర్ వెనకాలే ఉన్న సీటులో విండో పక్కన మరోవ్యక్తి, ఇటువైపు నేను కూర్చున్నాం. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఒక్కసారిగా ఒంటికి మంటలు అంటుకోవడంతో కళ్లు తెరిచి చూశాను. అప్పటికే బస్సులో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వెంటనే నా పక్కన ఉన్న ఆయనను లేపేందుకు ప్రయత్నించాను. కానీ, ఆయన లేవలేదు. నేను కిటికీ అద్దాలు పగలగొట్టి బయటికి దూకాను. అప్పటికే ఒళ్లంతా మంటలు అంటుకున్నాయి. తేరుకుని చూసేలోపే నా పక్కన కూర్చున్న వ్యక్తి మంటల్లో కాలిపోయాడు. నాకు అయిన గాయాల కన్నా.. పక్కన కూర్చున్న వ్యక్తిని కాపాడుకోలేకపోయాననే బాధే నన్ను ఎక్కువగా వేధిస్తోంది. ఒక నిమిషం ముందు మేల్కొన్నా.. అతడిని కాపాడే వాడిని’’ - రాజేష్ (28) స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. ఆయన భార్య శైలజ. ఉద్యోగరీత్యా వారు హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్లో ఉంటున్నారు. సైబర్‌టవర్స్‌లోని లోటస్ ఐఐఐ ఇన్ఫోటెక్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రమాదంలో కుడి చేతికి, వీపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ఒంటిపై 12 శాతం కాలిపోయింది. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వ్యాపారం కోసం వచ్చి... మజర్ పాషా(30) స్వస్థలం బెంగళూరు. రెడీమేడ్ వస్త్రాలు సరఫరా చేస్తుంటారు. వారానికి ఒకసారి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. ఇక్కడి దుకాణాల యజమానుల నుంచి ఆర్డర్లు తీసుకువెళతారు. అనంతరం వస్త్రాలు సరఫరా చేస్తారు. మంగళవారం కూడా అదే తరహాలో హైదరాబాద్‌కు బయలుదేరి ప్రమాదంలో గాయపడ్డారు. తల, ఛాతీ, వీపు భాగాలతో పాటు 25 శాతం శరీరం కాలిపోయింది. ప్రధాన ద్వారం తెరుచుకోకనే.. ‘‘రెండేళ్ల కింద బెంగళూరులోని హెచ్‌పీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా చేరాను. దీపావళి పండుగ కోసం మంగళవారం ఇంటికి బయలుదేరాను. నేను స్టాప్‌కు వచ్చేసరికి బస్సు బయలుదేరింది. దాంతో ఆటోలో వెళ్లి మరీ బస్సు ఎక్కాను. ప్రయాణంలో ఉండగా తెల్లవారుజామున బస్సు దేన్నో ఢీ కొట్టినట్లు భారీ శబ్దం విన్పించింది. కళ్లు తెరిచి చూసే సరికి బస్సులో దట్టమైన పొగ వ్యాపించింది. నాలుగు వైపుల నుంచి మంటలు బస్సు లోపలికి వ్యాపించాయి. ఓ ప్రయాణికుడు ప్రధాన ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు. కానీ, అవి తెరుచుకోకపోవడం వల్లే అంతా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో నేను చేతులతో కిటికీ అద్దాలు పగలగొట్టి బయటికి దూకాను. అప్పటికే ఛాతీ ఎడమ భాగానికి, వీపుపై మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న మరో వ్యక్తిని బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించాను. కానీ, అతని కుడి కాలు కిటికీ ల మధ్య ఇరుక్కుపోవడంతో కాపాడలేకపోయాను.’’ - చేనం సాయి శ్రీకర్(32), హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో నివస్తున్నారు. హెచ్‌పీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రమాదంలో ముఖం, కాళ్లు, చేతులు, వీపు భాగంలో 12 శాతం గాయాలయ్యాయి. డ్రైవర్ వెంటే దూకిన క్లీనర్ ప్రమాదంలో బయటపడిన వారిలో ఒకరైన ఇజాజ్‌పాషా (25)ది బెంగళూరు. ప్రమాదానికి గురైన బస్సు క్లీనర్. ఆయన రెండేళ్లుగా ఈ బస్సులో క్లీనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రమాద సమయంలో డ్రైవర్ క్యాబిన్లో కూర్చున్న ఇజాజ్‌పాషా.. డ్రైవర్ బస్ నుంచి దూకిన వెంటనే దూకేశాడు. ఆయనకు వనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండటంతో.. బుధవారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్డీవో ఆసుపత్రికి తరలించారు. ఇజాజ్‌పాషా 15 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నారు. గుర్తొస్తే.. భయమేస్తోంది... ‘‘నేను. హిందూవర్ ఇన్నోవేషన్ సంస్థలో లిఫ్ట్‌లకు అద్దాలు అమర్చేపని చేస్తున్నాను. ఇదే పనిమీద వారం క్రితం బెంగళూరుకు వెళ్లి, తిరిగి వస్తున్నాను. ఆ బస్సులో నాతో పాటు 50 మంది దాకా ప్రయాణికులున్నారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. నేను మేల్కొని చూసేసరికి మంటలు వ్యాపించాయి. బస్సులో కనిపించిన ఎమర్జెన్సీ ద్వారం నుంచి బయటకు దూకేశా. నాతోపాటు మరికొందరూ దూకేశారు. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది.’’ - జైసింగ్(40) ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఉపాధి కోసం ఐదేళ్ల కింద కోసం హైదరాబాద్‌కు వచ్చి, తుర్కపల్లిలో నివాసం ఉంటున్నారు. హిందూవర్ ఇన్నోవేషన్ సంస్థలో లిఫ్ట్‌లకు అద్దాలు అమర్చే పనిచేస్తున్నారు. అదే పనిమీద ఇటీవల బెంగళూరు వెళ్లి వస్తూ ప్రమాదంలో గాయపడ్డాడు. కాళ్లు, చేతులు సహా శరీరంపై 10-12 శాతం కాలినగాయాలయ్యాయి. వద్దన్నా వినకుండా వచ్చా... ‘‘మాది బెంగళూరు. మాదాపూర్ గోల్ఫ్‌కోర్టులో పది నెలల నుంచి కోచ్‌గా పని చేస్తున్నాను. టోలీచౌకి సమీపంలో నివాసం. కొద్ది రోజుల కింద అనారోగ్యంగా ఉండడంతో విశ్రాంతి కోసం బెంగళూరులోని ఇంటికి వెళ్లాను. దీపావళి పండుగ అనంతరం వెళ్లాల్సిందిగా సోదరులు చెప్పినా వినిపించుకోకుండా హైదరాబాద్‌కు బయలుదేరాను. తెల్లవారు జామున ఒక్కసారిగా వెనుక నుంచి మంట శరీరానికి తాకింది. దాంతో ఒక్క ఉదుటున బయటికి దూకేశా. అయినా మంటలు నన్ను వదిలి పెట్టలేదు. తర్వాత ఏం జరిగిందో తెలియదు.’’ - యోగేష్ గౌడ(29) స్వస్థలం బెంగళూరు. మాదాపూర్‌లోని గోల్ఫ్‌కోర్స్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడు. ప్రమాదానికి గురైన బస్సులో డ్రైవర్‌కు వెనుక బి-3 సీటులో కూర్చున్నాడు. ముఖం, తల, ఛాతీ, కాళ్లు, చేతులపై తీవ్రగాయాలయ్యాయి. శరీరం 45 శాతం కాలిపోయింది. వైద్యులు వెంటిలేటర్ అమర్చి, చికిత్స అందిస్తున్నారు. ‘డీఎన్ఏ’తోనే గుర్తింపు.. బస్సు ప్రమాద ఘటనలో మృతులను గుర్తించడం ప్రధాన సమస్యగా మారింది. ట్రావెల్స్ నిర్వాహకుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా మృతుల సంఖ్యను అంచనా వేయగలుగుతున్నారు కానీ ఏ మృతదేహం ఎవరిదనేది గుర్తించడం కష్టమవుతోంది. కొన్ని మృతదేహాలకు కొన్ని ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. మరికొన్ని మృతదేహాలు అస్తిపంజరంలా ఎముకల గూడులా కనిపిస్తున్నాయి. ముఖం, బట్టలు, ఆభరణాలను గుర్తించే అవకాశం ఉన్నప్పుడే మృతులను గుర్తించడం సాధ్యమవుతుంది. కానీ ఈ ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయి కనిపిస్తున్నాయి. అందువల్ల డీఎన్ఏ పరీక్ష ద్వారా మాత్రమే మృతులు ఎవరనేదీ గుర్తించే అవకాశం ఉంది. డీఎన్ఏ నమూనాల సేకరణ, ప్రమాదం జరిగిన తీరుపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ఫొరెన్సిక్ లాబొరేటరీ(ఏపీఎఫ్ఎస్ఎల్) నిపుణుల బృందం ఘటనాస్థలికి వెళ్లింది. డీఎన్ఏ నిపుణులు, ఏపీఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డెరైక్టర్ ఫణిభూషణ్, క్లూస్‌టీం నిపుణులు వెంకన్న, సైంటిఫిక్ ఆఫీసర్ గోపినాథ్‌లను అక్కడికి పంపినట్లు ఏపీఎఫ్ఎస్ఎల్ డెరైక్టర్ శారద తెలిపారు. వారు ప్రమాద స్థలానికి వెళ్లి నమూనాలు సేకరించారు. వారం పట్టొచ్చు: డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతులను గుర్తించేందుకు ఐదు నుంచి వారంరోజుల సమయం పట్టొచ్చని ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు ప్రొఫెసర్ నారాయణరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. బస్సులో నుంచి మృతదేహాల కాలర్ బోన్, దవడ ఎముకలు తదితర నమూనాలను సేకరించి ఆసుపత్రిలో భద్రపరిచి, అనంతరం వాటి డీఎన్ఏలను రక్తసంబంధీకుల డీఎన్ఏతో సరిపోలుస్తారని ఆయన వివరించారు. విషాదం.. వివాదం బస్సు ప్రమాదంలో తమ వారు మరణించడంతో ఆ రెండు కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. ఇప్పుడు వారికి తమ వారి మృతదేహాన్ని గుర్తించడం ఇబ్బందిగా మారింది. రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన వేదపతి (27) మృతదేహం కోసం ఆయన తండ్రి విఠల్ బుధవారం ఉదయమే ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించడంతో అక్కడి నుంచి ఉస్మానియాకు వచ్చారు. అక్క డ ఆనవాళ్ల ఆధారంగా తన కుమారుడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఆ మృతదేహం తమ వారిదని హైదరాబాద్‌కు చెందిన ఓ మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొనడంతో పోలీసులు మృతదేహాన్ని ఎవరికీ ఇవ్వలేదు. అక్షయ్‌సింగ్ భౌతికకాయుంపైనా..: బస్సు ఘటనలో వుృతి చెందిన చిక్కడపల్లికి చెందిన అక్షయ్‌సింగ్ వుృతదేహం విషయుంలోనూ వివాదం నెలకొంది. బుధవారం అక్షయ్ కుటుంబ సభ్యులు వుృతదేహాన్ని వాహనంలో తీసుకువస్తుండగా జడ్చర్ల వద్ద పోలీసులు ఆపారు. ఇదే ప్రమాదంలో దుర్మరణం పాలైన చిక్కడపల్లిలోని రైట్స్పాట్ యూడ్ ఏజెన్సీ యుజవూని వుంజునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆ వుృతదేహం తవుదని అంటున్నారని వారు పేర్కొన్నారు. దీంతో వుృతదేహాన్ని పోలీసులు ఉస్మానియూ వూర్చురీకి తరలించారు. డీఎన్ఏ పరీక్షల తర్వాతే అప్పగిస్తామని ప్రకటించారు. ఈ ఫోన్ నంబర్లెవరివి? సాక్షి, మహబూబ్‌నగర్: టికెట్ బుకింగ్ సందర్భంగా చాలామంది ప్రయాణికులు చిరునామా ఇవ్వకుండా కేవలం సెల్ నంబర్‌తో సరిపెట్టారని మహబూబ్‌నగర్ ఎస్పీ నాగేంద్రకుమార్ తెలిపారు. ఈ నంబర్లలో ఎక్కువగా కర్ణాటక రాష్ట్రానివే ఉన్నాయని చెప్పారు. 93412 85804, 72049 74748, 74062 14742, 9164 75305, 78934 51498, 99897 89652, 91779 20128, 91773 694961, 96201 82997, 97394 97377, 97431 23467 నంబర్ల వారి బంధుమిత్రులు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కంట్రోల్ రూంను సంప్రదించాలని కోరారు. తప్పుల తడకగా జాబితా... సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ప్రయాణికుల పేర్లతో జబ్బార్ ట్రావెల్స్ విడుదల చేసిన జాబితాను ప్రమాదం అనంతరం హడావుడిగా రూపొందించినట్టు తెలుస్తోంది. అందులోని ఫోన్ నంబర్లే దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఫోన్ చేస్తే చాలా నంబర్లకు ‘ఇది వాడుకలో లేదు.. నంబరు సరిచూసుకోండి’ అని సమాధానం వస్తోంది. అంతేగాకుండా ప్రయాణికులకు కేటాయించిన సీట్ల నెంబర్లు కూడా తికమకగా ఒకే నంబర్‌ను రెండుమూడుసార్లు పేర్కొన్నారు. అందులో ప్రయాణించినట్లుగా చెబుతున్న వారికి జాబితాలోని కొందరి పేర్లకు అసలు పొంతనలేకుండా ఉంది. -
మంటల్లో వోల్వో బస్సు
మంగళవారం రాత్రి 10 గంటలకు బెంగళూరులో బయల్దేరింది. ఇది బుధవారం ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవాలి. ఇంకో రెండు గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవాల్సి ఉండగా ఘోరం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలంలో ఉన్న పాలెం అనే గ్రామానికి సమీపానికి రాగానే మృత్యుదేవత బస్సును ఆవహించింది. ఈ రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు. బస్సు కింద భాగం నుంచి కట్టర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. 49 మంది ప్రయాణీకులున్న ఈ బస్సులో కేవలం ఐదురుగు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉండటంతో అగ్నికి ఆహూతి అయ్యారు. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నుంచి ఇప్పటివరకూ 45 మృతదేహాలను వెలికి తీశారు.బస్సులో మృతిచెందిన ప్రయాణికుల వస్తువులను పరిశీలిస్తున్న పోలీసులు ప్రమాదానికి గురైన వోల్వో బస్సును పరిశీలిస్తున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు