* మరో వోల్వో బస్సు బుగ్గి.. డ్రైవర్ సహా ఏడుగురు సజీవ దహనం
* వేగంగా వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టడమే ప్రమాదానికి కారణం
* బెంగళూరు నుంచి ముంబై వెళ్తుండగా కునిమల్లహళ్లి వద్ద ఘటన
* డీజిల్ ట్యాంక్ పగలడంతో అంటుకున్న మంటలు
* మహబూబ్‌నగర్ ఘోర ప్రమాదం మరవకముందే మరో విషాదం
* రెండు ఘటనల్లో 52 మంది సజీవ దహనం.. కళ్లు తెరవని ప్రభుత్వాలు
* వోల్వో బస్సు అంటేనే హడలెత్తిపోతున్న ప్రయాణికులు
* ప్రమాదాలకు కారణం అతి వేగమే.. ఈ బస్సుల వేగం 100 కి.మీ
* మించకుండా ‘లాక్ సిస్టమ్’.. ఆ ‘లాక్’ తెరిచేస్తుండడంతో ప్రమాదాలు
దావణగెరె, న్యూస్‌లైన్/సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: మళ్లీ అదే ఘోరం.. అవే మంటలు.. అదే వోల్వో బస్సు.. పక్షం రోజులు తిరగకుండానే దారుణం.. మహబూబ్‌నగర్ జిల్లాలో కిందటి నెల 30న చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనమైన ఘటన కళ్లముందు కదలాడుతుండగానే కర్ణాటకలో అచ్చం అదే తరహాలో మరో బస్సు భస్మీపటలమైంది! ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
బుధవారం అర్ధరాత్రి సుమారు మూడు గంటల సమయంలో హావేరి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కునిమల్లహళ్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళ్తున్న ఈ బస్సు వరదా నదిపై నిర్మించిన బ్రిడ్జి రెయిలింగ్‌ను బలంగా ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పగిలి క్షణాల్లో మంటలు వ్యాపించాయి. బస్సులో మొత్తం ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సహా 53 మంది ఉండగా.. అందులో ఓ డ్రైవర్‌తోపాటు ఆరుగురు మృతి చెందారు. మిగతావారు గాయాలతో బయటపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కాలిపోయింది జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు కాగా.. ఇప్పుడు నేషనల్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సే కావడం గమనార్హం.
బస్సులో 53 మంది: ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌తోపాటు ప్రయాణికుల్లో 43 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఏడేళ్ల చిన్నారి.. మొత్తం 53 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎనిమిది పికప్ పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకున్న ఈ బస్సు బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు బస్సు ముంబై చేరుకోవాలి. బస్సు తుమకూరు దాటిన తర్వాత రెండో డ్రైవర్ స్టీరింగ్‌ను అందుకున్నారు. అయితే హవేరీ జిల్లాలోని కునిమల్లహళ్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి డ్రైవర్ సహా ఏడుగురు మరణించారు. 44 మంది గాయాలతో, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. నయాజ్(అదనపు డ్రైవర్), రోహన్, జమీర్, సమీరాబాను - కలీం (దంపతులు), కైఫ్, అమాన్‌లు మృతి చెందినట్లు భావిస్తున్నారు.
గందరగోళంగా ప్రయాణికుల జాబితా
ఈ బస్సులో ప్రయాణించినవారు ఎవరెవరన్న విషయంపై గందరగోళం నెలకొంది. బెంగళూరులోని ఆ సంస్థ కార్యాలయంలో ఉన్న రిజర్వేషన్ చార్ట్‌లో ఉన్న పేర్లు.. ప్రమాదంలో గాయపడిన వారి పేర్లకు పొంతన (ఒకరి పేరుతో రిజర్వ్ చేసుకుని.. మరొకరు ఎక్కడం వల్ల) కుదరడం లేదు. ప్రమాదం నుంచి గాయాలతో బయట పడిన వారిలో షహద్ ఇబ్రహీం, జమాలుద్దీన్, సయ్యద్ షా షేర్వానీ, సోహన్ లాల్, ఉమత్ అహ్మద్, ప్రశాంత్ పాండే, జన్నత్, మసీ, వజీర్‌సాబ్, రాజన్ కుమార్, జేరారామ్ తేరా, ముస్రా కాటన్, మహ్మద్ వజీర్, సోనూ, అంబాత్, నరేష్ జైన్, అజయ్ కుమార్, గణేష్ గుప్తా, రంజిత్ కుమార్, సోలియా ఖాన్, విశ్రాంత్, గోకుల్ ఠాక్రే, మహ్మద్ జమీర్, అశ్విని కుమార్ జైన్, రియాజ్ కుమార్ నాయక్, మీరాచౌదరి, మనీఫ్, వజీం, గౌరవ్, మూవీ, ఇలియాజ్‌ఖాన్, షానా, పప్పు, దిలీప్‌కుమార్, శోభాలక్ష్మణ్, వరుణ్, మనోజ్‌కుమార్, నేహాల్, నాగేష్, సలీంఖాన్, మనోజ్‌పాటిల్, మహ్మద్ అస్మా, బ్రైట్, రేవణ సిద్ధయ్య ఉన్నారు. ఈ లెక్కన మతి చెందిన ఏడుగురితో పాటు డ్రైవర్లతో కలిపి బస్సులో 53 మంది ప్రయాణించినట్లు తెలుస్తోంది.
ట్యాంకు పగిలి మంటలంటుకున్నాయి: ఎస్పీ
బస్సు వేగంగా వచ్చి బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీ కొట్టడంతో డీజిల్ ట్యాంకు పగిలి మంటలు అంటుకున్నాయని అంచనాకు వచ్చినట్లు హావేరి ఎస్పీ ఎం. శశికుమార్ తెలిపారు. బస్సు రెయిలింగ్‌ను ఢీకొట్టాక 150 మీటర్ల దూరం దూసుకుపోయిందని, డ్రైవర్ బ్రేకులు వేయగానే మంటలు అంటుకున్నాయని అన్నారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే మరణించగా.. నలుగురు ఆస్పత్రికి తరలించే దారిలో మరణించారని తెలిపారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, క్లీనర్ గాయాలతో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.లక్ష చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు.
కిమ్స్ మార్చురీలో మృతదేహాలు
దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాలను హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ట్రావెల్ ఏజెన్సీ నుంచి ప్రయాణికుల సమాచారం సేకరించిన తర్వాత మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి సంబంధీకులకు అందజేస్తామని హవేరి కలెక్టర్ పాండురంగ నాయక్ తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరుపుతామని తెలిపారు. మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సమీర్‌భాను, కలీం భార్యభర్తలు కాగా మహమ్మద్ కైఫ్(3)ను వారి కుమారుడిగా గుర్తించారు. అయితే మరో ఇద్దరు పిల్లలు కూడా వీరి కుమారులే కావచ్చని భావిస్తున్నారు.
ఆ ఇద్దరి సమయస్ఫూర్తే అందర్ని కాపాడింది
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ఇద్దరు యువకుల సమయస్ఫూర్తి వల్లే ప్రాణ నష్టం తగ్గింది. వారిలో ఒకరు ఢిల్లీకి చెందిన ప్రశాంత్ కాగా.. మరొకరు అఫ్తాబ్. బస్సు ప్రమాదానికి గురైన విషయం వెనువెంటనే గమనించిన ప్రశాంత్(25) అప్రమత్తమయ్యాడు. నిద్రలో ఉన్న తోటి ప్రయాణికులను కేకలు వేస్తూ మేల్కోలిపి బస్సు అద్దాలు పగులగొట్టి వారు బయటకు వెళ్లేందుకు సహకరించాడు. అదేసమయంలో అప్పటికే బస్సులో మెలకువగా ఉన్న అఫ్తాబ్ మంటలు వ్యాపించిన విషయాన్ని గమనించి, బస్సు పైభాగంలో గాలి కోసం అమర్చి ఉన్న చిన్నపాటి డోర్‌ను తెరిచి.. అందర్నీ అటు రావాల్సిందిగా సూచిస్తూ తాను బయటకొచ్చాడు. వెను వెంటనే 22 మంది అతడిని అనుసరించి బయటపడ్డారు. అయితే సజీవ దహనమైన వారిలో ఓ చిన్నారి ఉండడం అందరినీ కలిచి వేసింది.
ప్రమాదాన్ని గుర్తించిన చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తగులబడుతున్న బస్సులో నుంచి ప్రయాణికులను కాపాడేందుకు ప్రాధాన్యతనిచ్చిన ప్రశాంత్, అఫ్తాబ్‌ను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ ప్రశంసించారు.
క్షణాల్లో జరిగిపోయింది
‘‘ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. నాకు నిద్ర పట్టకపోవడంతో మేలుకునే ఉన్నాను. ఇంతలోనే ఉన్నట్లుండి పెద్ద శబ్దం వచ్చింది. తేరుకునేలోపే బయట నుంచి మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా వేడి తగలడంతో తల్లడిల్లిపోయాం. నా వెనుక ఉన్న వ్యక్తి ఎవరో కిటికీ పగులగొట్టాడు. వెంటనే కిటికీలోంచి నా భార్యను బయటికి తోసేసి నేనూ దూకేశాను.’’
- రాజీవ్ కుమార్, ముంబై
మేల్కొని ఉన్నాను కాబట్టే బతికాను..
‘‘ఎందుకో ప్రమాదానికి కాస్త ముందే మెలకువ వచ్చింది. కర్టెన్ పక్కకు జరిపి విండోలోంచి బయటకు చూస్తున్నాను. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి బస్సు రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొని ఆగిపోయింది. ఆ వెంటనే క్షణాల్లో మంటలు వ్యాపించాయి. కిటికీ అద్దం పగులగొట్టడానికి ప్రయత్నించాను. కాలితో పలుమార్లు గట్టిగా తన్నినా పగలలేదు. పైకి చూడగానే కిటికీ కాస్త తెరుచుకుని కనిపించింది. గట్టిగా పైకి తోయడంతో మనిషి దూరేంత ఖాళీ ఏర్పడింది. ఇలా రండి అంటూ గట్టిగా అరిచి.. నేనూ బస్సు పైకి ఎక్కి ఆ వెంటనే కిందకు దూకాను. కాలు బెణికింది. నా వెనుకే చాలా మంది బస్సుపెకైక్కి.. ఆపై కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.’’
- ఆఫ్తాబ్, న్యూఢిల్లీ
బచావ్.. బచావ్.. కేకలు
‘‘నిద్రలో ఉన్నాను. ఒక్కసారిగా గట్టిగా అరుపులు.. బచావ్.. బచావ్..(కాపాడండి.. కాపాడండి..) అంటూ గావు కేకలు వినిపించాయి. ఏం జరిగిందో అర్థం కాలేదు. బస్సు తగలబడిపోతోందని కేకలు వేస్తున్నారు. ఒకరిపై ఒకరు పడుతూ లేస్తున్నారు. ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. ఓ యువకుడు బస్సు పైభాగంలో ఉన్న విండో ఓపెన్ చేసి పెకైక్కాడు. నేనూ అతన్ని అనుసరించి బయటపడ్డాను’’
- దిలీప్ షిండే, సతార, మహారాష్ట్ర
మొన్న పాలమూరులో.. నేడు కర్ణాటకలో అదే ఘోరం
Published Fri, Nov 15 2013 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement