బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హవేరి జిల్లా నేషనల్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఓ మినీవ్యాన్ కొట్టడంతో 13 మంది మృతి చెందారు. వీళ్లంతా ఒకే గ్రామానికి చెందిన వాళ్లని, దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు.
బ్యాడ్గి మండలం పుణేబెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును శుక్రవారం వేకువ జామున ఓ మినీ వ్యాన్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యానులోని 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మరో నలుగురిని ఆస్పత్రికి తరలించారు.
నిద్రమత్తు, అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ప్రమాద తీవ్రతకు ట్రక్కులోకి మినీ వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో అతికష్టం మీద మృతదేహాల్ని పోలీసులు బయటకు తీయగలిగారు. మృతులంతా శివమొగ్గ జిల్లా భద్రావతి మండలం ఎమ్మిహట్టి గ్రామస్తులుగా పోలీసులు నిర్ధారించారు. బెలగావి సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తుండగా గుండెనహళ్లి సమీపంలో శుక్రవారం పొద్దున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment