Mini Van
-
దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి 13 మంది..
బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హవేరి జిల్లా నేషనల్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఓ మినీవ్యాన్ కొట్టడంతో 13 మంది మృతి చెందారు. వీళ్లంతా ఒకే గ్రామానికి చెందిన వాళ్లని, దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు.బ్యాడ్గి మండలం పుణేబెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును శుక్రవారం వేకువ జామున ఓ మినీ వ్యాన్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యానులోని 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మరో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తు, అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ప్రమాద తీవ్రతకు ట్రక్కులోకి మినీ వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో అతికష్టం మీద మృతదేహాల్ని పోలీసులు బయటకు తీయగలిగారు. మృతులంతా శివమొగ్గ జిల్లా భద్రావతి మండలం ఎమ్మిహట్టి గ్రామస్తులుగా పోలీసులు నిర్ధారించారు. బెలగావి సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తుండగా గుండెనహళ్లి సమీపంలో శుక్రవారం పొద్దున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొన్న వ్యాన్
అనకాపల్లి టౌన్: ఆగి ఉన్న కంటైనర్‌ను మినీవ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్, క్లీనర్ మృతిచెందారు. ట్రాఫిక్ సీఐ సీహెచ్.ప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. మరమ్మతులకు గురవడంతో అనకాపల్లి జాతీయ రహదారిపై శారదానది బ్రిడ్జి సమీపంలో ఓ కంటైనర్ సోమవారం నిలిచిపోయింది. కంటైనర్ డ్రైవర్ కిందకు దిగి పరిశీలిస్తున్న సమయంలో అదే రహదారిలో బెంగళూరు నుంచి ద్రాక్షపళ్ల లోడుతో కోల్‌కత్తాకు వెళ్తున్న వ్యాన్.. కంటైనర్ వెనుకభాగంలో ఢీకొంది. వ్యాన్ డ్రైవర్ దినేష్‌రెడ్డి(25) అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ వెంకటేష్(25) తీవ్రంగా గాయపడడంతో ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేష్ మరణించాడు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేసినట్టు సీఐ చెప్పారు. పొక్లెయిన్ సాయంతో రెండు వాహనాలను వేరుచేశారు. -
మినీ వ్యాన్లు వచ్చేశాయ్!
సాక్షి, గుంటూరు: రేషన్ సరకులు డోర్ డెలివరీకి రంగం సిద్ధమవుతోంది. కొత్త సంవత్సరం నుంచి సరికొత్తగా ప్రభుత్వం రేషన్ సరకులను మినీ వ్యాన్ ద్వారా లబ్ధిదారు ఇంటి ముంగిటకే సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. అందుకు అవసరమైన మినీ వ్యాన్లు సిద్ధం చేస్తోంది. వ్యాన్లు తోలేందుకు డ్రైవర్లను కూడా త్వరలో నియామకం చేయనుంది. జిల్లాకు తొలి విడతగా 120 మినీ వ్యాన్లు జైపూర్ నుంచి గూడ్స్ రైలు ద్వారా మంగళవారం న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాయి. చదవండి: (బాబుపై భగ్గుమన్న ముస్లింలు) కాగా, జనవరి ఒకటి నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకవసరమైన మినీ ట్రక్కులను అన్ని వర్గాల యువతకు మంజూరు చేసి ఉపాధి కల్పించనుంది. ఈ ట్రక్కులను రాయితీపై అందజేయనుంది. జిల్లాలో 817 మినీ ట్రక్కులు (వ్యాన్లు) అవసరమని జిల్లా అధికారులు గుర్తించారు. ఇందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. మినీ ట్రక్కుల కోసం అనూహ్య స్పందన లభించింది. ఈ 817 మినీ ట్రక్కులకు 8,179 మంది దరఖాస్తు చేశారు. అంటే ఒక్కో ట్రక్కుకు సగటున పది చొప్పున పది రెట్టు అధికంగా వచ్చాయన్నమాట! -
బ్రిడ్జి పైన మినీ వ్యాన్ దగ్ధం
-
టైరు పేలి మినీవ్యాన్ బోల్తా
వాజేడు/ఏటూరునాగారం: సామర్థ్యానికి మించి కూలీలతో వెళ్తున్న మినీవ్యాన్ టైరు పేలి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో 43 మంది గాయపడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం మండపాక వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగింది. ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన 50 మంది కూలీలు వాజేడు మండలం పెద్దగొల్లగూడెంలోని ఓ రైతు పొలంలో మిర్చి ఏరేందుకు తెల్లవారుజామున మినీ వ్యాన్‌లో బయల్దేరారు. ఈ క్రమంలో వాజేడు మండలం మండపాక గ్రామం దాటగానే వాహనం ముందు టైరు పంక్చర్ అయి అదుపు తప్పింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేసేందుకు విఫలయత్నం చేయగా.. చివరకు హ్యాండ్ బ్రేక్‌ను ఉపయోగించాడు. దీంతో ఒక్కసారిగా వాహనం నిలిచిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. కూలీలు జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. మండపాక గ్రామస్తులు క్షతగాత్రులను ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూనెం చంద్రమ్మ (50) ఘటన స్థలంలోనే మృతిచెందగా, చికిత్స పొందుతూ ఐలయ్య(40) తుదిశ్వాస విడిచాడు. తీవ్రంగా గాయపడిన 20 మందిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి, మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. మిగతా 23 మంది ఏటూరునాగారం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రులంతా ఒకే గ్రామానికి చెందిన ఆదివాసీలు కావడంతో వారి స్వగ్రామం శివాపురంతోపాటు ఇతర ఆదివాసీగూడెల్లో విషాదం అలుముకుంది. క్షతగాత్రులను చూసి కుటుంబ సభ్యులు కన్నీళ్లపర్యంతమయ్యారు. -
మహీంద్రా నుంచి జీతో మినీ వ్యాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారం హైదరాబాద్ మార్కెట్లో జీతో మినీ వ్యాన్‌ను ప్రవేశపెట్టింది. బీఎస్–4 ప్రమాణాలతో 625 సీసీ సింగిల్ సిలిండర్, వాటర్ కూల్డ్ ఎం–డ్యూరా ఇంజన్‌ను పొందుపరిచారు. 16 హెచ్‌పీ ఇంజన్ ఔట్పుట్, 38 ఎన్ఎం టార్క్, 1,190 కిలోల బరువు, అయిదు గేర్లు, మాన్యువల్ స్టీరింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. డ్రైవర్‌తో సహా అయిదుగురు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 10.5 లీటర్లు. మూడు రంగుల్లో లభిస్తోంది. వారంటీ రెండేళ్లు లేదా 40,000 కిలోమీటర్లు. మైలేజీ లీటరుకు 26 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. పెట్రోలు, సీఎన్జీ వర్షన్లోనూ ఇది లభిస్తుందని మహీంద్రా ఆటోమోటివ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అరవపల్లి తెలిపారు. మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ కులకర్ణితో కలిసి మీడియాతో మాట్లాడుతూ... ప్యాసింజర్ క్యారియర్ వాహన విభాగంలో పనితీరు, భద్రత, సౌకర్యం విషయంలో జీతో మినీ వ్యాన్ సంచలనం సృష్టిస్తుందని చెప్పారాయన. త్రిచక్ర వాహన యజమానులు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఇది చక్కని వాహనమని అభిప్రాయపడ్డారు. జహీరాబాద్ ప్లాంటులో దీన్ని తయారు చేస్తున్నారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో వాహనం ధర రూ.3.34 లక్షలు. -
మహీంద్రా ‘జీతో మినీవ్యాన్’
@రూ.3.45 లక్షలు ముంబై: ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ తాజా గా ‘జీతో’ సిరీస్‌లో ‘మినీవ్యాన్’ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది ప్రయాణికులను తీసుకెళ్లే ఒక చిన్నతరహా వాణిజ్య వాహనం. దీని ధర రూ.3.45 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ముంబై) ఉంది. జీతో మినీవ్యాన్‌లో 625 సీసీ డీజిల్ ఇంజిన్ అమర్చామని, ఇది లీటరుకు 26 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. పెట్రోల్, సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లను త్వరలోనే మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది. -
బస్సు–వ్యాన్ ఢీకొని ఆరుగురి మృతి
తిరువణ్ణామలై: తిరువణ్ణామలై జిల్లాలో మినీ వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సెయ్యారుకు చెందిన ఒక కుటుంబ సభ్యులు కళశపాక్కం సమీపంలోని పయంకోయిల్ గ్రామంలో జరిగే నిశ్చితార్థ కార్యక్రమానికి 22 మందితో మినీ వ్యాన్‌లో బుధవారం ఉదయం బయల్దేరారు. పోలూరులో నిశ్చితార్థం ముగించుకొని మధ్యాహ్నం 3 గంటల సమయంలో మినీ వ్యాన్ బయల్దేరింది. మినీ వ్యాన్ ఆరణి రోడ్డులోని ఎట్టివాడి కూట్‌రోడ్డు వద్ద వెలుతున్న సమయంలో వేలూరు నుంచి తిరువణ్ణామలై వైపు ప్రయాణికులను ఎక్కించుకొని వెళుతున్న ప్రవే టు బస్సు అతి వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో సెయ్యారుకు చెందిన మణి(55),సరోజ(48),తిరునావుక్కరసు(55), సెల్వరాజ్(60), తిమిరికి చెందిన కమల(70) అక్కడికక్కడే మృతి చెందారు. అదే విధంగా ప్రమాదంలో మరో 12 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి, పోలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు అడుక్కంబరైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మరో మహిళ మృతి చెందింది. అయితే మృతి చెందిన మహిళ ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో 11 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని తిరువణ్ణామలై ఎస్పీ పొన్ని నేరుగా వెళ్లి పరిశీలించారు. ప్రమాదంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. -
షార్టు సర్క్యూట్‌తో మినీ వ్యాన్ దగ్ధం
కంకిపాడు : ఇంజన్లో షార్టు సర్క్యూట్‌తో మంటలు చెలరేగి మినీ వ్యాన్ దగ్ధమైన సంఘటన మండలంలోని ఉప్పులూరు వంతెన సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చెందిన అరవపల్లి దుర్గారావుకు మినీ వ్యాన్ ఉంది. గోసాలకు కంకరు అన్లోడ్ చేసి వ్యాన్‌లో నిడమానూరు వెళ్లేందుకు ఉప్పులూరు మీదుగా బయలుదేరాడు. వ్యాన్ ఉప్పులూరు వంతెన వద్దకు చేరుకునే క్రమంలో ఇంజను వైర్లు షార్టు సర్క్యూట్‌కు గురై మంటలు రేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో వ్యాన్ నడుపుతున్న దుర్గారావు ఒక్కసారిగా వ్యాన్ని నిలిపివేసి వాహనం దిగేశాడు. మంటలు ఆర్పే ప్రయత్నంలో ప్రధాన గ్రామంలోకి వెళ్లాడు. అప్పటికే మంటలు వ్యాన్‌ను చుట్టుముట్టడంతో అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గన్నవరం అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కుటుంబానికి జీవనాధారమైన వ్యాన్ మంటల్లో కాలిపోవటంతో దుర్గారావు బోరున విలపించాడు. -
సన్నబియ్యం పేరుతో ఘరానా మోసం
గుడివాడ : ‘మేం నాగాయలంక, అవనిగడ్డకు చెందిన రైతులం’ అంటూ మీవద్దకు వస్తున్నారా..? మోపెడ్లపై బియ్యం మూటలతో వచ్చి తక్కువ ధరకు సన్నబియ్యం ఇచ్చేస్తున్నామని చెప్పారా..? వారి మాటాలు నమ్మి ఆ బియ్యం కొన్నారంటే మోసపోయినట్లే.. జిల్లాలోని కొందరు వ్యాపారులు ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇలా అంటగట్టేస్తున్నారు. తీరా ఆ బియ్యం వండి చూస్తే రేషన్ సరుకని తేలి లబోదిబోమనాల్సిందే. గత వారం రోజులుగా గుడివాడ ప్రాంతంలో ఇటువంటి వారు నకిలీ బియ్యాన్ని అమ్మటంతో అనేక మంది మోసపోయారు. కంకిపాడు ప్రాంతంలో ఆ వ్యక్తుల్ని గుర్తించిన సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంకిపాడు పోలీసులు కూపీ లాగకుండానే పెట్టీ కేసు నమోదు చేసి వదిలేశారు. గుడివాడలో వీరి బారినపడి మోసపోయిన వారు ‘సాక్షి’కి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి... విత్తనాలకు డబ్బులేక దాచుకున్నవి అమ్ముకుంటున్నాం... జిల్లాలోని నాగాయలంక, అవనిగడ్డ ప్రాంతాల్లో పండే బీపీటీ సన్నబియ్యం బాగుంటాయని పేరుంది. ఈ బియ్యానికి మంచి గిరాకీ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఘరానా మోసగాళ్లు ఆప్రాంత రైతులమని చెప్పి సామాన్య, మధ్య తరగతి ప్రజల్ని నిలువునా ముంచేస్తున్నారు. గుడివాడలోని శ్రీరామ్పురంలోకి నాలుగు రోజుల కిందట ఇద్దరు వ్యక్తులు మోపెడ్లపై బియ్యం మూటలతో వచ్చారు. తాము అవనిగడ్డ ప్రాంతానికి చెందిన రైతులమని, విత్తనాలకు డబ్బులేక, తినటానికి దాచుకున్న బియ్యాన్ని అమ్ముకుంటున్నామని తెలిపారు. సన్నబియ్యం తక్కువ రేటుకు అందిస్తున్నామని చెప్పారు. శాంపిల్‌గా వారి వద్ద ఉన్న ఒక సంచిలో ఉంచిన మంచి బియ్యాన్ని చూపించారు. ఇవన్నీ ఒకే పొలంలోవని చెప్పారు. బహిరంగ మార్కెట్లో 25 కేజీల బస్తా ధర రూ.1,300 ఉందని, రూ.900కే అమ్ముకుంటున్నామని దీనంగా చెప్పారు. ఇళ్లవద్ద ఉండే మధ్యతరగతి మహిళలు వీరి మాటలు నమ్మి, తక్కువ ధరకు బియ్యం వస్తున్నాయని కొన్నారు. తీరా వండిన తరువాత అవి రేషన్‌బియ్యం అని తేలింది. ఈనెల 13న సత్యనారాయణపురంలో కూడా ఇదే తరహాలో బియ్యం అమ్మారు. ఇలా గుడివాడలోనూ, పరిసరాల్లోని పల్లెల్లో మధ్యతరగతి వర్గాలు ఉండే ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిసింది. మినీ వ్యాన్‌లో తీసుకొచ్చి.. మోపెడ్లపై అమ్ముతూ.. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్‌చేసి అమ్ముతున్నట్లు సమాచారం. నలుగురైదుగురు మోపెడ్‌లతో వస్తారు. వీరితోపాటు బియ్యం బస్తాలు మినీ వ్యాన్‌లో వస్తాయి. వ్యాన్‌ను గ్రామం చివర్లో ఉంచి బస్తాలను మోపెడ్లపై ఇళ్లవద్దకు తీసుకెళతారు. అమ్మకం పూర్తి కాగానే ఆ ప్రాంతం నుంచి మాయమవుతారు. ఇలా జిల్లాలో కొందరు రేషన్, ముతక బియ్యాన్ని రీసైక్లింగ్‌చేసి అమాయకులకు అంటగట్టి మోసం చేస్తున్నట్లు తెలిసింది. పట్టిస్తే పెట్టీ కేసు పెట్టారు... గుడివాడలో పలువురిని మోసం చేసిన వారిలో ఇద్దరు కంకిపాడు మండలం కోమటిగుంట లాకుల సమీపంలో మోపెడ్‌పై బియ్యం పెట్టుకుని ప్రధాన రహదారిపై వెళ్లే వారికి అమ్ముతున్నారు. వీరి మోసానికి బలైన గుడివాడ వాసి వీరిని గుర్తించి కంకిపాడు పోలీసులకు ఉప్పందించారు. వారు వెంటనే స్పందించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వీరు కంకిపాడు మండలం కోలవెన్ను శివారు మాదాసువారి పాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, సూరిబాబుగా గుర్తించారు. వారి వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పెట్టీ కేసు నమోదు చేశారు. వీరిని పూర్తిస్థాయిలో విచారణ చేసి ఉంటే నకిలీ బియ్యం ముఠా గుట్టు రట్టయ్యేదని పలువురు చెబుతున్నారు. కాగా గుడివాడలో వీరి మోసానికి బలైన వ్యక్తి కంకిపాడు పోలీసు స్టేషన్లో ఉన్న వారివద్దకు వెళ్లారు. నకిలీ బియ్యం అంటగట్టి తీసుకున్న రూ.3,500ను నిందితులు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి అమ్మే ముఠా గుట్టు రట్టు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి వ్యాపారుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. -
విజయవాడలో కిడ్నాప్ కలకలం
విజయవాడ : నగర శివారులోని ఎనికేపాడులో ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేశారంటూ శనివారం గ్రామంలో కలకలం రేగింది. బాలిక మేనమామ తెలిపిన వివరాల ప్రకారం.. ఎనికేపాడులో శివప్రసాద్, చాముండేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారై వాసవి ఆరో తరగతి చదువుతోంది. బాలిక శనివారం ఉదయం పాఠశాలకు వెళుతున్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు మినీ వ్యాన్‌లో బలవంతంగా ఎక్కించుకున్నారు. వాసవి అరవకుండా నోటికి చేతులు అడ్డుపెట్టి మత్తు ఇంజక్షన్ చేశారు. అపస్మారకస్థితికి చేరుకున్న బాలికను ప్రసాదంపాడులోని సాయిబాబా ఆలయం వెనుక వీధిలోని ఓ ఇంట్లో బంధించారు. మెళకువ వచ్చి చూసేసరికి గదిలో ఎవరూ లేరు. బయట నుండి గడియ పెట్టి ఉంది. దీంతో బాలిక గది వెనుక ఉన్న చిన్న రంధ్రం నుంచి బయట పడింది. ఏడుస్తూ రోడ్డు మీద వెళుతుండగా ఓ మహిళ చూసి వివరాలు అడిగి తెలుసుకుంది. చేతులకు గాయలై రక్తం కారుతుండడంతో శుభ్రం చేసి ప్రాథమిక చికిత్స చేసింది. అనంతరం వాసవి తల్లి ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేసి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. జరిగిన సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వగా బాలికను పోలీసులు వాహనంలో ఎక్కించుకుని కిడ్నాపర్లను గుర్తుపట్టేందుకు ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల్లో వెదికారు. తనను బంధించిన గదిని ఎక్కడనేది గుర్తించలేకపోవడం తో బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు కోమరవల్లి కిషోర్.. వాసవి తల్లిదండ్రులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
లారీ ఢీకొని సాక్షి టీవీ సిబ్బందికి గాయాలు
రణస్థలం: జేఆర్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై రణస్థలం ఎస్బీఐ ఎదురుగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీ సిబ్బంది ముగ్గురు గాయపడ్డారు. సాక్షి మినీ వ్యాన్ విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వస్తోంది. రణస్థలం మండల కేంద్రంలో వ్యాను నిలుపు చేస్తుం డగా వెనుకే వస్తున్న లారీ పక్కనుంచి వెళు తూ డ్రైవర్ సీటు వద్ద ఢీకొట్టిందని మినీ వ్యా న్ డ్రైవర్ శ్రీనివాసరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ లెంక సన్యాసినాయుడు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాసరావు, కెమెరామన్ రాజుకు స్వల్ప గాయాలవ్వగా రమణబాబుకు కుడిచేయి విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్ఐ లెంక సన్యాసినాయుడు, హెచ్‌సీ కె.అడివన్న సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘అందుకే.. ఆణ్ణి చంపేశా ’
నల్లజర్ల రూరల్, న్యూస్‌లైన్ : ‘ఔను.. ఆణ్ణి చేతులారా నేనే చంపేశా. పెట్రోల్ పోసి తగులబెట్టా. పేగు తెంచుకుని పుట్టిన కొడుకును ఏ తల్లీ ఇలా చంపుకోదు. కానీ.. నాకు అలాంటి దుస్థితి దాపురించింది. నేను చేసింది తప్పో.. రైటో నాకు తెలీదు. తొందరపాటులో ఇలా చేశాను. అరుునా.. దీనికి కారణం వాడే. ఇలాంటి కొడుకు పగవారికి కూడా ఉండకూడదు’ రోదిస్తూ చెప్పింది ఆ తల్లి. కొడుకు ఆగడాలను భరించలేక తల్లే అతడిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. సంచలనం కలిగించిన ఈ ఘటనలో కోదాటి పెద్దిరాజు (36) అనే ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుణ్ణి ఎందుకు హతమా ర్చాల్సి వచ్చిందో అతడి తల్లి కోదాటి పద్మావతి (55) పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘20 ఏళ్లుగా ఆడు పెట్టే హింసలను భరిం చాను. ఆడు దురలవాట్లకు బానిసయ్యూడు. ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. అన్నీ మౌనంగానే భరించాం. ఏదోరోజు మారకపోతాడా.. బాగుపడకపోతాడా అనుకునేదాన్ని. అందుకే ఆరుసార్లు ఆటోలు, ఓసారి మినీ వ్యాన్ కొనిచ్చాను. ఏదిచ్చినా మూణ్ణాళ్ల ముచ్చటే. జల్సాలు, అలవాట్ల కోసం వాటిని అమ్మేశాడు. వాడికోసం మాకున్న ఎకరం పొలం అమ్మేశాను. రోడ్డు పక్కనున్న విలువైన ఇంటిని సైతం అమ్మాల్సి వచ్చింది. పదేళ్ల క్రితం యాక్సిడెం ట్లో ఆడి కుడికాలుకు దెబ్బతగిలితే నాలుగేళ్లపాటు పోషించాను. రెండుసార్లు ఆపరేషన్లు కూడా చేరుుంచాను. ఎన్నో అప్పులు చేసేవాడు. అప్పులిచ్చినోళ్లు తగవులకు వచ్చేవారు. నేను, నా భర్త సూర్యనారాయణ కలసి కొన్ని బకారుులు అప్పటికప్పుడు తీర్చేవాళ్లం. మా దగ్గర డబ్బులేకపోతే ప్రాంసరీ నోట్లు రాసిచ్చేవాళ్లం. ఇంతచేసినా వాడికి కడుపు నిండలేదు. నా భర్త, నేను కలిసి ఉంటున్న ఇంటిని అమ్మేసి డబ్బులివ్వాలని ఈ మధ్య గొడవ చేస్తున్నాడు. బుధవారం రాత్రి మా ఇంటికొచ్చాడు. ఇల్లు అమ్మి డబ్బు ఇవ్వాలంటూ గొడవపడ్డాడు. నన్ను, నా భర్తను కత్తితో నరికి చంపేస్తానన్నాడు. భయంతో రాత్రంతా మేం వేరేవాళ్ల ఇళ్లకు వెళ్లి తలదాచుకున్నాం. తెల్లవారాక వచ్చి మా అంతు చూస్తానని బెదిరించి వెళ్లాడు. ఈరోజు మళ్లీ వచ్చాడు. మమ్మల్ని చంపేస్తానని వీరంగం చేశాడు. ఏం చేయూలో తెలియలేదు. సీసాలో ఉన్న పెట్రోల్ వాడిపై పోసి నిప్పు పెట్టాను. చచ్చిపోతాడనుకోలేదు. ఇలాంటి కొడుకు పగవాడికి కూడా ఉం డకూడదు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు’ అని వాంగ్మూలంలో పద్మావతి పేర్కొంది. ఇదీ జరిగింది... బుధవారం రాత్రి ప్రకాశరావుపాలెం వచ్చిన పెద్దిరాజు తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. వారు ఉంటున్న ఇంటిని అమ్మేసి డబ్బులివ్వాలని అడిగాడు. అందుకు ససేమిరా అనడంతో ఘర్షణ పడ్డాడు. కత్తి తీసుకుని చంపేస్తానని బెదిరిం చాడు. దీంతో తల్లిదండ్రులు భయపడి వేరేవారి ఇంట్లో తలదాచుకున్నారు. గురువారం ఉదయం 9గంటల సమయంలో పెద్దిరాజు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. వరండాలోని మంచంపై కూర్చుని యు.వెంకటేశ్వరావు, దూలపల్లి ప్రభాకరావు, మిరియాల గంగాధరావు అనేవారితో మాట్లాడుతుండగా.. పద్మావతి బాటిల్లోంచి పెట్రోల్ తీసి అతడిపై పోసి నిప్పంటించింది. మంటలు ఎగసిపడటంతో పైనున్న తాటాకుల పందిరి అంటుకుంది. మం టల్లో చిక్కుకున్న పెద్దిరాజు రక్షించండంటూ హాహాకారాలు చేసాడు. రక్షించేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోరుుంది. పెద్దిరాజు అగ్నికి ఆహుతైపోయూడు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ దేవకుమార్, ఎస్సై పి.చిన్నారావు, తహసిల్దార్ కె.పోసియ్య ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మినీవ్యాన్‌ను ఢీకొన్న బస్సు
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: మినీవ్యాన్‌ను ప్రభుత్వ బస్సు ఢీకొన్న సంఘటనలో పంచాయతీ అధ్యక్షురాలు సహా ఐదుగురు మృతి చెందారు. 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిిస్థితి విషమంగా ఉండడంతో చెన్నైకు తరలించారు. తిరువళ్లూరు జిల్లా మన్నవేడు గ్రామానికి చెందిన పంచాయతీ అధ్యక్షురాలు మంజుల. పొన్నేరి సమీపంలోని యానంబాక్కం గ్రామంలో ఉన్న మంజుల బంధువు శనివారం సాయంత్రం మృతిచెందారు. ఈ నేపథ్యంలో బంధువుల మృతికి మన్నవేడు చెందిన 18 మంది ఆదివారం ఉదయం మినీవ్యాన్‌లో బయలుదేరారు. అంత్యక్రియల్లో పాల్గొని ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తిరుగుపయనం అయ్యారు. వ్యాన్ పెద్దపాళ్యం వద్ద వస్తుండగా, రెడ్‌హిల్స్ నుంచి ఊత్తుకోట వైపు వెళుతున్న ప్రభుత్వ బస్సు, మినీవ్యాన్‌ను ఢీకొని వ్యవసాయపొలంలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో మినీవ్యాన్‌లో పయనిస్తున్న మన్నవేడు పంచాయతీ అధ్యక్షురాలు మంజుల సంఘటన స్థలంలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు వ్యాన్‌లో చిక్కుకున్న వారిని రక్షించి 108కు సమాచారం అందించారు. అయితే గంట దాటినా 108 రాకపోవడంతో మరొక వ్యాన్‌లో గాయపడిన వారిని తరలించారు. అయితే మార్గమధ్యంలో మన్నవేడు గ్రామానికి చెందిన ఇళయాత్త(60), శశికళ(40), ఏలుమలై(50) మృతిచెందారు. ప్రమాదంలో మన్నవేడు గ్రామానికి చెందిన మునస్వామి (27), వినోద్ (07), సుకుమార్(10), రాబర్ట్ (58), హేమరాజ్ (30), గుణ (38), అరుల్‌జ్యోతి(45), మనోహరమ్మాల్ (50), రాజామ్మాల్ (50), దురైయమ్మాల్ (45), మల్లికా (52), కోట్టయమ్మా (30), అన్నామ్మాల్ (50), రోసి(43) గాయపడ్డారు. వీరిలో మనోహరమ్మాల్, రాజామ్మాల్ , దురైయమ్మాల్, మల్లిక పరిిస్థితి విషమంగా ఉండడంతో వారిని తిరువళ్లూరు వైద్యశాల నుంచి చెన్నైకు తరలించారు. చికిత్స పొందుతూ మరో మహిళ మృతిచెందారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో తిరువళ్లూరు వైద్యశాలకు దద్దరిల్లింది. సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆశిం చిన గ్రామంలో నలుగురు మృతిచెందడంతో గ్రామం లో విషాద చాయలు అలుముకున్నాయి. పెద్ద పాళ్యం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.