తిరువణ్ణామలై: తిరువణ్ణామలై జిల్లాలో మినీ వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సెయ్యారుకు చెందిన ఒక కుటుంబ సభ్యులు కళశపాక్కం సమీపంలోని పయంకోయిల్ గ్రామంలో జరిగే నిశ్చితార్థ కార్యక్రమానికి 22 మందితో మినీ వ్యాన్‌లో బుధవారం ఉదయం బయల్దేరారు. పోలూరులో నిశ్చితార్థం ముగించుకొని మధ్యాహ్నం 3 గంటల సమయంలో మినీ వ్యాన్ బయల్దేరింది.
మినీ వ్యాన్ ఆరణి రోడ్డులోని ఎట్టివాడి కూట్‌రోడ్డు వద్ద వెలుతున్న సమయంలో వేలూరు నుంచి తిరువణ్ణామలై వైపు ప్రయాణికులను ఎక్కించుకొని వెళుతున్న ప్రవే టు బస్సు అతి వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో సెయ్యారుకు చెందిన మణి(55),సరోజ(48),తిరునావుక్కరసు(55), సెల్వరాజ్(60), తిమిరికి చెందిన కమల(70) అక్కడికక్కడే మృతి చెందారు. అదే విధంగా ప్రమాదంలో మరో 12 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి, పోలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు అడుక్కంబరైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మరో మహిళ మృతి చెందింది. అయితే మృతి చెందిన మహిళ ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో 11 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని తిరువణ్ణామలై ఎస్పీ పొన్ని నేరుగా వెళ్లి పరిశీలించారు. ప్రమాదంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.
బస్సు–వ్యాన్ ఢీకొని ఆరుగురి మృతి
Published Thu, Mar 9 2017 2:33 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
Advertisement
Advertisement