మహీంద్రా నుంచి జీతో మినీ వ్యాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారం హైదరాబాద్ మార్కెట్లో జీతో మినీ వ్యాన్‌ను ప్రవేశపెట్టింది. బీఎస్–4 ప్రమాణాలతో 625 సీసీ సింగిల్ సిలిండర్, వాటర్ కూల్డ్ ఎం–డ్యూరా ఇంజన్‌ను పొందుపరిచారు. 16 హెచ్‌పీ ఇంజన్ ఔట్‌పుట్, 38 ఎన్‌ఎం టార్క్, 1,190 కిలోల బరువు, అయిదు గేర్లు, మాన్యువల్ స్టీరింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. డ్రైవర్‌తో సహా అయిదుగురు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 10.5 లీటర్లు. మూడు రంగుల్లో లభిస్తోంది. వారంటీ రెండేళ్లు లేదా 40,000 కిలోమీటర్లు. మైలేజీ లీటరుకు 26 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది.
పెట్రోలు, సీఎన్‌జీ వర్షన్‌లోనూ ఇది లభిస్తుందని మహీంద్రా ఆటోమోటివ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అరవపల్లి తెలిపారు. మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ కులకర్ణితో కలిసి మీడియాతో మాట్లాడుతూ... ప్యాసింజర్ క్యారియర్ వాహన విభాగంలో పనితీరు, భద్రత, సౌకర్యం విషయంలో జీతో మినీ వ్యాన్ సంచలనం సృష్టిస్తుందని చెప్పారాయన. త్రిచక్ర వాహన యజమానులు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఇది చక్కని వాహనమని అభిప్రాయపడ్డారు. జహీరాబాద్ ప్లాంటులో దీన్ని తయారు చేస్తున్నారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో వాహనం ధర రూ.3.34 లక్షలు.