మినీవ్యాన్‌ను ఢీకొన్న బస్సు
మినీవ్యాన్‌ను ఢీకొన్న బస్సు
Published Mon, Jan 13 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: మినీవ్యాన్‌ను ప్రభుత్వ బస్సు ఢీకొన్న సంఘటనలో పంచాయతీ అధ్యక్షురాలు సహా ఐదుగురు మృతి చెందారు. 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిిస్థితి విషమంగా ఉండడంతో చెన్నైకు తరలించారు. తిరువళ్లూరు జిల్లా మన్నవేడు గ్రామానికి చెందిన పంచాయతీ అధ్యక్షురాలు మంజుల. పొన్నేరి సమీపంలోని యానంబాక్కం గ్రామంలో ఉన్న మంజుల బంధువు శనివారం సాయంత్రం మృతిచెందారు. ఈ నేపథ్యంలో బంధువుల మృతికి మన్నవేడు చెందిన 18 మంది ఆదివారం ఉదయం మినీవ్యాన్‌లో బయలుదేరారు. అంత్యక్రియల్లో పాల్గొని ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తిరుగుపయనం అయ్యారు. వ్యాన్ పెద్దపాళ్యం వద్ద వస్తుండగా, రెడ్‌హిల్స్ నుంచి ఊత్తుకోట వైపు వెళుతున్న ప్రభుత్వ బస్సు, మినీవ్యాన్‌ను ఢీకొని వ్యవసాయపొలంలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో మినీవ్యాన్‌లో పయనిస్తున్న మన్నవేడు పంచాయతీ అధ్యక్షురాలు మంజుల సంఘటన స్థలంలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు వ్యాన్‌లో చిక్కుకున్న వారిని రక్షించి 108కు సమాచారం అందించారు. అయితే గంట దాటినా 108 రాకపోవడంతో మరొక వ్యాన్‌లో గాయపడిన వారిని తరలించారు.
అయితే మార్గమధ్యంలో మన్నవేడు గ్రామానికి చెందిన ఇళయాత్త(60), శశికళ(40), ఏలుమలై(50) మృతిచెందారు. ప్రమాదంలో మన్నవేడు గ్రామానికి చెందిన మునస్వామి (27), వినోద్ (07), సుకుమార్(10), రాబర్ట్ (58), హేమరాజ్ (30), గుణ (38), అరుల్‌జ్యోతి(45), మనోహరమ్మాల్ (50), రాజామ్మాల్ (50), దురైయమ్మాల్ (45), మల్లికా (52), కోట్టయమ్మా (30), అన్నామ్మాల్ (50), రోసి(43) గాయపడ్డారు. వీరిలో మనోహరమ్మాల్, రాజామ్మాల్ , దురైయమ్మాల్, మల్లిక పరిిస్థితి విషమంగా ఉండడంతో వారిని తిరువళ్లూరు వైద్యశాల నుంచి చెన్నైకు తరలించారు. చికిత్స పొందుతూ మరో మహిళ మృతిచెందారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో తిరువళ్లూరు వైద్యశాలకు దద్దరిల్లింది. సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆశిం చిన గ్రామంలో నలుగురు మృతిచెందడంతో గ్రామం లో విషాద చాయలు అలుముకున్నాయి. పెద్ద పాళ్యం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement