57 ఏళ్ళ వయసులోనూ అదే ఉత్సాహం..
ఆమె.. తన అభిరుచిని డబ్బు సంపాదనకు మార్గంగా మలచుకుంది. ఉపాధిగా బస్ డ్రైవర్ జీవితాన్ని ప్రారంభించి 23 ఏళ్ళ క్రితమే మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చింది. ఆసియాలోనే మొదటి మహిళా బస్ డ్రైవర్ గా పేరు తెచ్చుకొని 57 ఏళ్ళ వయసులోనూ అదే ఉత్సాహంతో విధులు నిర్వహిస్తోంది.
కన్యాకుమారిలో పుట్టిన వసంతకుమారి వివాహం అనంతరం చెన్నైలో బస్ డ్రైవర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. అతి చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడంతో ఆమె తండ్రి మరో పెళ్ళి చేసుకున్నాడు. 19 ఏళ్ళ వయసులోనే వసంతకు నలుగురు పిల్లలున్న ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. భర్త భవన నిర్మాణ కూలిగా పనిచేసేవాడు. పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూనే మహాలిర్ మండ్రం అనే ఓ మహిళా సంఘంలో వసంత.. సెక్రెటరీగా పనిచేసేది.
అయితే చాలీ చాలని జీతాలతో జీవనోపాధి కష్టంగా మారడంతో బతకు బండిని ఈడ్చేందుకు మార్గాలను అన్వేషించింది. సంపాదనే ధ్యేయంగా బస్ డ్రైవర్ గా స్థిరపడేందుకు నిర్ణయించుకొంది. అదే ఇష్టంగా మలచుకొని 23 ఏళ్ళ క్రితం డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించిన వసంత.. ఆసియాలోనే మొదటి మహిళా బస్ డ్రైవర్ గా పేరు తెచ్చుకోవడమే కాక, ప్రస్తుతం 57 ఏళ్ళ రిటైర్మెంట్ వయసులోనూ అదే ఉత్సహంతో చెన్నైలో విధులు నిర్వహిస్తోంది.
నేను ప్రభుత్వోద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు అధికారులు అది ఎంతో కష్టమైన ఉద్యోగం అని, పురుషులే కష్టాలు ఎదుర్కొంటున్న ఫీల్డ్ లో నెగ్గుకు రావడం కష్టమన్నారని వసంత చెప్తోంది. ఎవరెన్ని చెప్పినా.. అనుకున్నది సాధించిన వసంత హెవీ వెహికిల్ లైసెన్స్ సంపాదించి డ్రైవింగ్ ఫీల్డ్ లోకి ఎంటరయ్యింది. మొదట్లో నైపుణ్య పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో అధికారులు తిరస్కరించారు. అయినా పట్టు వదలకుండా... వారిని ఎన్నోసార్లు అభ్యర్థించడంతో మరోసారి టెస్ట్ కు పిలిచారు.
అప్పడు తన సత్తా చూపించిన వసంత.. డ్రైవర్ గా ఎంపికయ్యింది. తమిళనాడు స్టేట్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో 1993 లో ఆసియాలోనే మొదటి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన ఆమె... తిరిగి వెనక్కు చూడలేదు. ఎటువంటి ప్రత్యేక సదుపాయాలను పొందలేదు. పురుషులతో సమానంగా విధులు నిర్వహించింది. ఇప్పటికీ ఆమె నాగర్ కోయిల్ నుంచి తిరువనంతపురం రెగ్యులర్ రూట్ లో రాత్రి పదిగంటల వరకూ విధులు కొనసాగిస్తోంది.
ఉద్యోగం ప్రారంభించిన కొత్తలో ఉదయం 6 గంటలకు డ్యూటీకి వస్తే మధ్యాహ్నం 2 గంటల వరకూ షిఫ్ట్ లో ఉండాల్సి వచ్చేదని, ఆ సమయంలో పిల్లలను ఇరుగు పొరుగులకు అప్పగించేదాన్నని అంటున్న వసంత.. ఉద్యోగం ఎంతో ఒత్తిడితో కూడుకొని ఉండేదని చెప్తోంది. తన తర్వాత ఎంతోమంది మహిళలు డ్రైవర్ గా ఉద్యోగంలో చేరినా.. కొద్ది కాలంలోనే డెస్క్ ఉద్యోగాలకు మారిపోయారని చెప్తోంది. మహిళా డ్రైవర్ గా ఎటువంటి సవాళ్లు ఎదుర్కొన్నావంటూ ఎంతోమంది తనను ప్రశ్నిస్తారని, ఏ క్షేత్రంలోనైనా కష్టం ఉంటుందని, అది ఎదుర్కోవడమే ముఖ్యమని ఆమె చెప్తుంది.
ఇటీవల రెయిన్ డ్రాప్స్ ఉమెన్ ఎచీవర్ అవార్డును అందుకున్న వసంతకుమారి ఏప్రిల్ 2017 లో రిటైర్ కానుంది. పదవీ విరమణ అనంతరం డ్రైవింగ్ పాఠశాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న ఆమె... కుదరని పక్షంలో కనీసం అటువంటి కళాశాలల్లో శిక్షకురాలిగానైనా ఉద్యోగం కొనసాగిస్తానని, తన జీవితాన్ని నిలబెట్టిన డ్రైవింగ్ ను శరీరం సహకరించినంత వరకూ వదిలేది లేదని చెప్తోంది.