పోలీసు విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం | by the name of police enquiry they raped the woman | Sakshi
Sakshi News home page

పోలీసు విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం

Published Wed, Dec 24 2014 2:10 AM | Last Updated on Tue, Aug 21 2018 7:18 PM

పోలీసు విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం - Sakshi

పోలీసు విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం

సాక్షి, చెన్నై : ప్రియుడితో కలసి బీచ్‌లో ఉన్న ఓ విద్యార్థినిని పోలీసు పేరిట బెదిరించాడు. విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలిపెట్టాడు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ సెమ్మంజేరి పోలీసులు సరిహద్దు సమస్యను సృష్టించారు. చివరకు నీలాంకరై పోలీసుల్ని ఆశ్రయించి తన గోడును వెల్లబోసుకుంది.
 
 తాంబరం సమీపంలోని సేలయూర్ క్యాంప్ వీధికి చెందిన ఓ విద్యార్థిని గౌరివాక్కంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థితో  పరిచయం ప్రేమగా మారింది. ఈ ఇద్దరు సోమవారం సాయంత్రం నీలాంకరై బీచ్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా కూర్చుని మాట్లాడుతుండగా అటు వైపుగా తెల్ల చొక్కా, ఖాకీ ప్యాంట్ ధరించిన వ్యక్తి ఆ ఇద్దర్నీ బెదిరించాడు. తాను ట్రాఫిక్ పోలీసునని పేర్కొంటూ, ఆ ఇద్దరి వివరాలు రాబట్టాడు. ఆ విద్యార్థిని కనిపించడం లేదని తమ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చిందని బెదిరించాడు. తల్లిదండ్రులు తన కోసం సెమ్మంజేరి పోలీసు స్టేషన్లో ఉన్నారని పేర్కొన్నాడు. తనతో పాటుగా పోలీసు స్టేషన్‌కు రావాలని హెచ్చరించి మోటార్ సైకిల్‌పై ఆ యువతిని తీసుకెళ్లాడు.
 
  తన ప్రియురాల్ని సెమ్మంజేరి పోలీసు స్టేషన్‌కు ట్రాఫిక్ కానిస్టేబుల్ తీసుకెళ్లడంతో, అక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రియుడు పరుగులు తీశాడు. చీకటి పడుతుండడంతో చివరకు  జరిగిన విషయాన్ని అక్కడి ఓ కానిస్టేబుల్ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే, తమకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, అలాంటి వ్యక్తి ఎవ్వరూ ఇక్కడ లేరని వచ్చిన సమాధానంతో ఆందోళన చెందాడు. కాసేపటికి ఆ విద్యార్థిని పోలీసు స్టేషన్ వద్దకు పరుగున వచ్చింది. తనపై కానిస్టేబుల్ వేషంలో ఉన్న వ్యక్తి  అత్యాచారం చేశాడని, బెదిరించి షోళింగనల్లూరు వద్ద వదలిపెట్టి వెళ్లాడని కన్నీటి పర్యంతం అయింది.
 
 సరిహద్దు సమస్య
 తాను అత్యాచారానికి గురైనట్టు ఆ విద్యార్థిని కన్నీళ్లు పెడుతున్నా సెమ్మంజేరి పోలీసులు మాత్రం కనికరించలేదు. ఆ సంఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదని వెనక్కి పంపించేశారు. చివరకు అక్కడున్న కొందరి సాయంతో నీలాంకరై పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ఆమె గోడును విన్న పోలీసులు తక్షణం స్పందించారు. ఆ యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ విద్యార్థిని, ఆమె ప్రియుడు తెలిపిన ఆచూకీ మేరకు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. షోళింగనల్లూరు పరిసరాల్లోని చెక్ పోస్టుల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆ విద్యార్థిని షోలింగనల్లూరు చెక్ పోస్టు సమీపంలో ఓ వ్యక్తి తన మోటార్‌సైకిల్ మీద నుంచి తోసేయడం రికార్డు కావడంతో దాని ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. రెండు రోజుల క్రితం నీలాంకరై పరిసరాల్లో ఓ మహిళను పట్ట పగలు రోడ్డు మీద కత్తులతో బెదిరించి నగల్ని ఓ వ్యక్తి దోచుకెళ్లిన ఘటన మరువక ముందే, పోలీసు వేషంలో వచ్చి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడడం ఆ పరిసరాల్లో కలకలం రేగింది. దీంతో నీలాంకరై బీచ్ పరిసరాల్లో ప్రేమ జంటలకు హెచ్చరికలు చేయడంతో పాటుగా భద్రతను పెంచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement