ఈ దుఃఖం ఆగేదెప్పుడు?
* కాలిన మృతదేహాల గుర్తింపు కష్టమే
* వెంటాడుతున్న ఐదేళ్లనాటి ‘గౌతమి’ దుర్ఘటన
* నేటికీ గుర్తించని 11 మృతదేహాలు ఎవరివో..?
* తమిళనాడు రైలు ప్రమాదంలోనూ ఇదే దుస్థితి
* మ.నగర్ ఘటనలోనూ అదే అయోమయం
సాక్షి, హన్మకొండ/అమలాపురం: ‘ఒక్కగానొక్క కొడుకని అల్లారు ముద్దుగా పెంచి చెట్టంతవాన్ని చేస్తిమి కొడుకా.. 15 నెలలైతాంది నీ జాడేది..? మాకు ఈ దుఃఖం ఆగేదెప్పుడు.. బిడ్డా..?’ అంటూ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో ఆచూకీ లేకుండాపోయిన వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మాదారపు అవినాష్ తల్లి గీతాదేవి కన్నీళ్లు పెట్టుకుంటోంది. 2012 జులై 30న నెల్లూరు వద్ద జరిగిన ఈ ఘటన మాదిరిగానే.. ఐదేళ్ల క్రితం జరిగిన గౌతమి రైలు ప్రమాదంలో మృతి చెందిన 11 మంది ఆనవాళ్లు నేటికీ గుర్తించలేకపోయారు.
2008 జూలై 31 రాత్రి సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన గౌతమి ఎక్స్‌ప్రెస్ అర్ధరాత్రి 1 గంటకు వరంగల్ జిల్లా కేసముద్రం మండలం తాడ్లపూసపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ రైలు ఎస్-10 బోగీలో అకస్మాత్తుగా అగ్నికీలలు లేచి.. మొత్తం 31 మంది మరణించగా, వారిలో నలుగురిని వెంటనే గుర్తించారు. అసలే గుర్తించ లేనివిధంగా కాలిపోయి 27 మంది మృతిచెందినట్లు రైల్వే అధికారులు ధ్రువీకరించారు. కాలి బూడిదయ్యే స్థితిలో ఉన్న అవయవాలు మాత్రమే మిగలడంతో.. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతి చెందిన వ్యక్తులను గుర్తించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
అయితే ఆ డీఎన్‌ఏ పరీక్షల్లో కేవలం 16 మందిని మాత్రమే గుర్తించగలిగారు. ఈ దుర్ఘటనలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రిటైర్డు సీటీఓ బేజుపూరి చెంచయ్య కుమారుడు, కోడలు డాక్టర్ బి.రవికుమార్, డాక్టర్ సరిత (ఏడు నెలల గర్భిణీ) బుగ్గి అయ్యారు. ఇలా మిగిలిన 11 శాంపిల్స్ ఎవరివో డీఎన్‌ఏ పరీక్షల ద్వారా తెలుసుకునేందుకు వీలుకాక వరంగల్ కేఎంసీలోనే ఉండిపోయాయి. వీటికి అంత్యక్రియలు నిర్వహిద్దామనుకున్నా.. చట్టపరంగా ఏవైనా అభ్యంతరాలెదురు కావచ్చనే భయం వెంటాడుతోంది. దీంతో ఈ విషయమై తమకు సలహా ఇవ్వాల్సిందిగా జిల్లా ఉన్నతాధికారులు న్యాయశాఖకు లేఖ రాశారు. ఇలా ఇప్పటికీ తమ వాళ్లు బతికే ఉన్నారా.. చనిపోయారా..? అని వారి కుటుంబీకులు కన్నీళ్లతో కుమిలిపోతున్నారు.
ఇలాంటి ఘోర అగ్నిప్రమాదాల్లో మృతదేహాలు బుగ్గి అవడం వల్ల కొన్ని డీఎన్‌ఏ పరీక్షలకూ దొరకవని రిటైర్డు సీటీఓ చెంచయ్య తెలి పారు. తమ కొడుకు, కోడలు మృతి విషయంలో తెలిసివచ్చిందన్నారు. ఇలాంటపుడు ఇతర ఆధారాలతో మృతులను నిర్ధారించాలని కోరారు.
ఉద్యోగం ఇవ్వలేదు.. హైకోర్టు జోక్యంతో డెత్ సర్టిఫికెట్
గౌతమి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కిర్లంపూడికి చెందిన పిరాట్ల గొల్లబ్బాయి, సత్యప్రభావతి మృతదేహాలూ డీఎన్‌ఏ పరీక్షలకు వీల్లేని రీతిలో బూడిదయ్యాయి. దీంతో రైల్వే శాఖ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాతోపాటు వారి డెత్ సర్టిఫికెట్ల కోసం కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడ్డారు. చివరికి హైకోర్టును ఆశ్రయించి సర్టిఫికెట్లు పొందగలిగారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని రైల్వేశాఖ ప్రకటించినా.. ఇప్పటికీ రాలేదని గొల్లబ్బాయి కుమారుడు రామకృష్ణ తెలిపాడు. ఉద్యోగం కోసం రెండేళ్లుగా హైకోర్టు చుట్టూ తిరుగుతున్నానన్నాడు.
ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో వోల్వో బస్సు దగ్ధం ఘటనలో బుగ్గి అయిన 45 మందిలో.. గురువారం నాటికి 41 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. డీఎన్‌ఏ పరీక్షల సమస్యలే ఎదురు కావచ్చని బాధిత కుటుంబాలవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మృతదేహాల విషయంలో ప్రభుత్వం కొన్ని మినహాయింపులివ్వాలని, ప్రయాణికుల జాబితా, కుటుంబ సభ్యుల సమాచారం ఆధారంగా వారు మృతిచెందినట్లు నిర్ధారించి, న్యా యం చేయాలని బాధిత కుటుంబాల వారు కోరుతున్నారు.