సాక్షి, న్యూఢిల్లీ: మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు దగ్ధం ఘటన పట్ల ప్రధాని మన్మోహన్‌సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంపై విచారం వెలిబుచ్చారు. బుధవారం ఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. గాయపడ్డవారు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు.
విచారణ జరిపిస్తున్నాం: సీఎం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ముంపు ప్రాంతాల్లో పర్యటనకు శ్రీకాకుళం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దారుణమైన ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన వెనుక సంఘ విద్రోహ శక్తుల హస్తం ఉందా? లేక నిర్లక్ష్యమే కారణమా? అనే విషయమై విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
బాధితులకు అండగా నిలవండి
మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నాయకులకు జగన్ సూచన
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అగ్నికీలల్లో చిక్కుకొని 45 మంది మృతి చెందడం పట్ల వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రయాణికులు మాడిమసై పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన బుధవారం సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే.. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు వీలైనంతగా సహాయపడాలని ఆయన మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నాయకులను కోరారు. కోర్టు ఆంక్షల మూలంగా ఆయన సంఘటనా స్థలానికి వెళ్లలేకపోయారు. హైదరాబాద్‌ను విడిచి వెళ్లరాదనే ఆంక్షలను సడలిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు బుధవారం సాయంత్రం 5గంటల తర్వాత వెలువడ్డాయి.
మృతుల కుటుంబాలకు ప్రముఖుల సంతాపం
సాక్షి, నెట్‌వర్క్: బస్సు ప్రమాదంపై తమిళనాడు గవర్నర్ రోశయ్య విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాదంలో అంత మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. తణుకులో మాట్లాడుతూ.. ప్రభుత్వ విభాగాలు సరైన రీతిలో పని చేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు.
ప్రమాదంపై అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.నారాయణ, బీవీ రాఘవులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ మార్గంలో నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై కొరడా ఝుళిపించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం బస్సు ప్రమాదస్థలాన్ని ఆయన సందర్శించారు. దుర్ఘటనపై లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘అక్రమ వాహనాలను నియంత్రిస్తేనే భద్రత’
సాక్షి, హైదరాబాద్: అక్రమ వాహనాలను నియంత్రించడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆర్టీసీ ఈయూ అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పద్మాకర్ అన్నారు. రవాణా శాఖ ప్రైవేటు వాహనాలను నియంత్రించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్ అన్నారు.
బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
Published Thu, Oct 31 2013 3:49 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement