
చట్టాల్లో మార్పులవసరం: బొత్స సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ బస్సుల దూకుడుకు కళ్లెం వేసేందుకు పటిష్టమైన ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ అవసరమని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర మోటారు వాహన చట్టాల్లో మార్పులు అవసరమని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధం ఘటనపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఆయన బుధవారం రవాణా కమిషనర్ కార్యాలయంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి లక్ష్మీపార్థసారథి, కమిషనర్ అనంతరాం, అదనపు కమిషనర్ శ్రీనివాస్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. కల్వర్టు దాటే క్రమంలో డ్రైవర్ తన ముందున్న కారును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించాడని, అదే సమయంలో ముందు టైర్ పేలిందని, దాంతో బస్సు కల్వర్టుకు ఢీకొని డీజిల్ ట్యాంకర్ పగిలిందని చెప్పారు. క్షణాల్లో మంటలంటుకొని బస్సు పూర్తిగా కాలిపోయిందని, ఈ ఘటనలో మొత్తం 45 మంది అక్కడికక్కడే చనిపోయారని చెప్పారు.
గాయపడిన మరో ఐదుగురు డిఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బస్సుసీటింగ్ సామర్ధ్యం 43 మాత్రమేనని, ఇద్దరు డ్రైవర్లతో కలుపుకుని 45 మంది ప్రయాణించవలసి ఉండగా, ఐదుగురు ఎక్కువగా ఉన్నారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. రవాణా అధికారులు తనిఖీలు చేయకపోవడమే ఓవర్ లోడింగ్‌కు కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్ట్ క్యారేజీలుగా తిరగాల్సిన బస్సులు స్టేజీ క్యారేజీలుగా ఎందుకు తిరుగుతున్నాయన్న ప్రశ్నకు.. ప్రయాణికుల డిమాండ్‌ను ఆర్టీసీ భర్తీ చేయలేకపోతోందని, దీంతో స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకోలేకపోతున్నామని మంత్రి చెప్పారు. బస్సులకు వేగ నియంత్రణ పరికరాలు(స్పీడ్ గవర్నర్స్) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ కోర్టుల జోక్యం వల్ల ఏర్పాటు చేయలేకపోతున్నామన్నారు. కాగా దివాకర్ ట్రావెల్స్ రోడ్ లైన్స్‌కు చెందిన ఈ బస్సు(ఏపీ 02 టీఏ 0963) బెంగళూరుకు చెందిన జబ్బార్ ట్రావెల్స్‌కు 2011 అక్టోబర్‌లో బదిలీ అయిందని మంత్రి చెప్పారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు, అలాగే గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా అందించే విషయంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించాక ప్రకటిస్తామని బొత్స తెలిపారు.