దావణగెరె, న్యూస్‌లైన్/సాక్షి, బెంగళూరు :
మితిమీరిన వేగం మరో ఘోర ప్రమాదానికి దారి తీసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద అక్టోబర్ 30న చోటు చేసుకున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన ఇంకా కళ్ల ముందు నుంచి చెరిగిపోక మునుపే రాష్ట్రంలోని హావేరి జిల్లా సవనూరు తాలూకా, కణిమళ్లళ్లి వద్ద నేషనల్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు ప్రమాదానికి గురై దగ్ధమైంది. మాజీ మంత్రి, చామరాజపేట నియోజవర్గం ఎమ్మెల్యే(జేడీఎస్) ఎన్‌టీ జమీర్ అహ్మద్ ఖాన్ అండ్ అసోసియేట్స్ పేరుతో ఈ బస్సు రిజిస్ట్రేషన్ అయింది.
బెంగళూరులోని కలాసీపాళ్య కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ట్రావెల్స్‌కు చెందిన సంస్థ ముంబై, గోవా, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాలకు నిత్యం 30 బస్సులను నడుపుతోంది. ఇందులో ఆరు బస్సులు బెంగళూరు - ముంబై మధ్య సంచరిస్తుంటాయి. బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు ఆ సంస్థకు చెందిన కే.ఎ- 01 ఏసీ 8642 వోల్వో బస్సు 982 కి.మీ దూరమున్న ముంబైకి బయలుదేరింది. బెంగళూరులోని మారతహళ్లి వద్ద ప్రారంభమైన ఈ బస్సు జయనగర్ ఫోర్త్ బ్లాక్, కలాసీపాళ్య, మెజిస్టిక్, ఆనందరావు సర్కిల్, యశ్వంతపూర్, జాలహళ్లి ప్రాంతాల్లో సంచరిస్తూ 50 మంది ప్రయాణికులను ఎక్కించుకుంది. రాత్రి 9.45 గంటలకు సిటీ విడిచింది. ఈ బస్సు గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముంబైకి చేరాల్సి ఉంది. మొత్తం ప్రయాణికుల్లో 36 మంది ముంబై, 12 మంది పూణే, ఇద్దరు సాతరా బై పాస్ వద్ద దిగాల్సి ఉంది. వీరితో పాటు ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ ఉన్నారు.
బెంగళూరు నుంచి 334 కి.మీ దూరంలో నాల్గవ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు 135 కి.మీ వేగంతో ఈ బస్సు వెళ్తూ అదుపు తప్పింది. వరదా నదిపై నిర్మించిన బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొంది. అదే ఊపులో బస్సు ముందుకు దూసుకెళ్లడంతో డీజిల్ ట్యాంక్ క్షిద్రమై మంటలు వ్యాపించాయి. దీనికి గాలి తోడు కావడంతో ఒక్కసారిగా మంటలు బస్సును చుట్టుముట్టాయి. బస్సు డ్రైవర్(2) గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం తాకిడికి మేల్కొన్న ఓ ప్రయాణికుడు మంటలను గమనించి నిద్రమత్తులో ఉన్న తన తోటి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించాయి.
అరగంటలోపు బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. బస్సు డ్రైవర్(1), మరో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను హుబ్లీ లోని కిమ్స్, హావేరిలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆనవాలు కూడా చిక్కకుండా కాలిపోయిన శరీరాల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు చేయనున్నారు.
హావేరి జిల్లాలో ఓల్వో బస్సు దగ్ధం
Published Fri, Nov 15 2013 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement