పాలెం దుర్ఘటన కు నేటితో ఏడాది
* కొంతమంది బాధితులకు నేటికీ అందని పరిహారం
* జబ్బర్ ట్రావెల్స్‌లో సజీవదహనమైన 44 మందికి నేడు శ్రద్ధాంజలి
బెంగళూరు : మహబూబ్‌నగర జిల్లా, కొత్తకోట మండలంలోని పాలెం గ్రామం సమీపంలో జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదానికి గురై 44 మంది సజీవదహనమైన సంఘటనకు నేటితో ఏడాది పూర్తయింది. నేటికీ కొంతమంది బాధితులు పరిహారం కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 29వ రాత్రి 11 గంటల సమయంలో ఇక్కడి కలాసిపాళ్యలోని జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (ఏపీ 02- టిఏ,0963) హైదరాబాద్‌కు బయలుదేరింది. ఆ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
డ్రైవర్ ఫిరోజ్ బాష బస్సును అతి వేగంతో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తరువాత ప్రయాణికులు గాఢనిద్రలోకి జారుకున్నారు. అక్టోబర్ 30వ తేదీ వేకువజామున 5.10 గంటల సమయంలో మహబూబ్‌నగర జిల్లా, కోత్తకోట మండలంలోని పాలెం-కనుమెట్ట గ్రామం మధ్యలోని జాతీయ రహదారిలో కారును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ వోల్వో బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. 15 సెంకెడ్లలో బస్సు పూర్తిగా కాలిపోయింది.
ఈ ప్రమాదంలో 44 మంది సజీవదహమయ్యారు. ఈ ప్రమాదంలో మహబూబ్‌నగర జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు న్యాయమూర్తి పల్లే మోహన్‌కుమార్ కుమార్తె ప్రియాంక (గర్బిణి), చిరంజీవి అభిమానుల సంఘం కర్ణాటక అధ్యక్షుడు కోటే వెంకటేష్, ఆయన సోదరి అనితతో పాటు, దంపతులు, చిన్నారి, వ్యాపారులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రమాదంలో సజీవదహనమైన వారికి బెంగళూరు కలాసిపాళ్యలో గురువారం శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిర ణ్ కుమార్‌రెడ్డి కేసు దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని, నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బస్సుకు ఉన్న ఇన్సూరెన్స్‌ను క్లయిమ్ చేసి మృతుల కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పారు. అయితే నేటికీ మృతుల కుటుంబ సభ్యులు కొంతమంది ప్రభుత్వ కార్యాలయాల చుట్లూ తిరుగుతూనే ఉన్నారు. న్యాయం జరగకపోవడంతో వారు మహబూబ్‌నగరలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణలో ఉంది.