అంతా క్షణాల్లోనే.... | Private Volvo bus roll | Sakshi
Sakshi News home page

అంతా క్షణాల్లోనే....

Published Tue, Jan 21 2014 2:50 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

అంతా క్షణాల్లోనే.... - Sakshi

అంతా క్షణాల్లోనే....

  • వచ్చేశాం... అనుకుంటుండగానే ఘోరం
  •  హొసకోటె వద్ద ప్రైవేట్ వోల్వో బస్సు బోల్తా
  •  ఐదుగురి దుర్మరణం.. మృతులందరూ నెల్లూరు జిల్లా వాసులే
  •  28 మందికి గాయాలు.. వీరిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే అధికం
  •  బాధితులను పరామర్శించిన మంత్రి రామలింగారెడ్డి
  •  మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా
  •  కారణం డ్రైవర్ నిద్రమత్తా..? లేక కుక్కల గుంపా?
  •  
     కాసేపట్లో బస్సు దిగాలి.. బెంగళూరు వచ్చేస్తోందని ప్రయాణికులు అప్పుడప్పుడే నిద్రలోంచి మేల్కొంటున్నారు. ఇంతలో ఉన్నట్లుండి ఒక్క సారిగా.. ధడేల్ మంటూ పెద్ద శబ్ధం.. బస్సు డివైడర్‌ను ఢీకొందంటూ ప్రయాణికుల కేకలు.. అయ్యో.. బస్సు.. ఆపండి అంటూ ఆర్తనాదాలు.. అంతలోనే బస్సు డివైడర్‌పై నుంచి ఎడమ వైపు తిరిగి బోల్తా.. దేవుడా.. కాపాడు అంటూ గావు కేకలు.. అరుపులు, ఆర్తనాదాలు, ఏడుపులు, పెడబొబ్బలు... సోమవారం తెల్లవారు జామున నెల్లూరు నుంచి బెంగళూరుకు వస్తూ  హొసకోటె వద్ద ప్రమాదానికి గురైన వోల్వో బస్సు వద్ద దృశ్యమిది.. మహబూబ్ నగర్ జిల్లా పాలెం, కర్ణాటకలోని హావేరిలో రెండు వోల్వో బస్సులు దగ్ధమైన ఘటనలు ప్రజల స్మృతి పథం నుంచి చెరిగిపోక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం అందరినీ నిశ్చేష్టులను చేసింది. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల భద్రతపై కలుగుతున్న అనుమానాలకు బలం చేకూర్చింది.
     
    కోలారు, న్యూస్‌లైన్ : హొసకోట వద్ద వోల్వో బస్సు ప్రమాదానికి గురైందని తెలియగానే అటు నెల్లూరు, ఇటు బెంగళూరు వాసుల్లో కలకలం రేగింది. ప్రమాదానికి కారణం అధిక వేగం అని ప్రయాణికులు ఆరోపిస్తుండగా, కుక్కల గుంపు అడ్డం రావడం వల్లే అదుపు తప్పిందని డ్రైవర్ చెబుతున్నాడు.

    బెంగళూరుకు చెందిన రాజేశ్ ట్రావెల్స్ బస్సు నెల్లూరులో ఆదివారం రాత్రి పదిన్నర గంటలకు బయలుదేరింది. ఆరు గంటల కల్లా బెంగళూరు చేరుకోవాల్సి ఉంది. బెంగళూరు మరో 25 కిలోమీటర్లు ఉందనగా హొసకోటె వద్ద అదుపు తప్పి మెయిన్, సర్వీసు రోడ్లను వేరు చేసే డివైడర్ పైకి ఎక్కి కొంత దూరం వెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నెల్లూరుకు చెందిన అనూష (24), ప్రదీప్ (28), విజయ్‌కుమార్ (30), ప్రసాద్ (30), మానస్ కుమార్(6)లు మరణించారు. గాయపడిన 28 మందిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

    మృతుల్లో కూడా ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. సాధారణంగా ఇక్కడి నెల్లూరు జిల్లా వాసులు వారాంతాల్లో శుక్రవారం రాత్రి సొంత ఊర్లకు వెళ్లి.. ఆదివారం రాత్రి తిరిగి బయలుదేరి రావడం పరిపాటి. కేఏ 01 ఏఏ 7709 నంబరు గల ఆ బస్సులో మొత్తం 52 మంది ప్రయాణికులున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న హొసకోటె పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో సమీపంలోని ఎంవిజీ వైద్య కళాశాలకు తరలించారు. పది పదిహేను కుక్కలు హఠాత్తుగా రోడ్డుకు అడ్డం రావడంతో వాటిని తప్పించబోగా బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైందని డ్రైవర్ వెంకటప్ప తెలిపాడు. అప్పుడు బస్సు మామూలు వేగంతోనే నడిపానని చెప్పాడు.
     
    బస్సులో ఇద్దరు డ్రైవర్లు
    బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. నెల్లూరులో బస్సు బయలు దేరిన సమయంలో తిరుపతికి చెందిన డ్రైవర్ కోదండం డ్రైవింగ్ చేశాడు. చిత్తూరు జిల్లా నేండ్రగుంట వద్ద వెంకటప్ప డ్రైవింగ్ చేపట్టాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను నిద్రిస్తున్నందున, సంఘటన ఎలా జరిగిందో తెలియదని కోదండం తెలిపాడు.
     
    డ్రైవర్ నిద్రమత్తుతోనే : పలువురు ప్రయాణికుల ఆరోపణ
     మితి మీరిన వేగంతో పాటు డ్రైవర్ నిద్రలో జోగినందు వల్లే ప్రమాదం జరిగిందని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. తనను పరామర్శించడానికి వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి వద్ద నెల్లూరు ప్రయాణికురాలు మస్తానమ్మ ఇదే విషయాన్ని చెప్పింది.ఎంవిజీ వైద్య కళాశాల మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆర్తనాదాలు మిన్ను ముట్టాయి. ప్రమాద విషయం తెలియగానే మృతులు, క్షతగాత్రుల బంధువులు హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నెల్లూరు నుంచి సైతం మధ్యాహ్నం 12 గంటలకు పలువురు వచ్చారు.
     
    రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా
     ప్రమాదంలో గాయపడిన వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆస్పత్రిలో పరామర్శించారు.  క్షత గాత్రులను ఒక్కొక్కరినే పలకరిస్తూఘటనపై ఆరా తీశారు. డ్రైవర్ వెంకటప్ప దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తాను కేవలం 80 కిలోమీటర్ల వేగంతోనే వెళుతున్నానని డ్రెవర్ మంత్రికి తెలుపగా, 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి కదా...అని మంత్రి  ప్రశ్నించగా, అతని నోటి వెంట మాట రాలేదు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా  అందజేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స చేయిస్తామని తెలిపారు. బస్సు బీమా నుంచి కూడా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందుతుందన్నారు. కాగా హొసకోటె ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్, బెంగుళూరు రూరల్ ఎస్పీ రమేష్, ఐజీ ఉల్‌హక్ హుసేన్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
     
     ఎవరూ పట్టించుకోలేదు
     తమ బస్సు ప్రమాదానికి గురైందని, చనిపోతున్నా తమను ఎవరూ పట్టించుకోలేదంటూ తన కుమారుడు ఫోన్ చేసి చెప్పాడని బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ తండ్రి, నెల్లూరుకు చెందిన నాగేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యాడు. సాధారణంగా తన కుమారుడు బెంగుళూరుకు చేరుకున్న తరువాత ఏడు గంటలకు ఫోన్ చేసే వాడని, ఉదయం అయిదున్నరకే ఫోన్ రావడంతో భయపడుతూ తీశామని, తాము శంకించినట్లే జరిగిందని వాపోయాడు. తన కుమారుడు ప్రమాద విషయం చెప్పిన వెంటనే ఫోన్ ఆగిపోయిందని, తర్వాత తామెంతగా ప్రయత్నించినా అటు వైపు నుంచి సమాధానం రాలేదని తెలిపాడు. భార్యతో కలసి మధ్యాహ్నం ఆయన ఆస్పత్రి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అయిదు నెలల గర్భిణీ అయిన తమ కోడలు అనూష చనిపోయిందని తెలుసుకుని గుండెలవిసేలా విలపించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement