అసలు ఏం జరిగింది?
జబ్బర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు.. మంగళవారం రాత్రి 10 గంటలకు బెంగళూరులో బయల్దేరింది. ఇది బుధవారం ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవాలి. ఇంకో రెండు గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవాల్సి ఉండగా ఘోరం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలంలో ఉన్న పాలెం అనే గ్రామానికి సమీపానికి రాగానే మృత్యుదేవత బస్సును ఆవహించింది. ఉదయం నాలుగున్నర గంటలు దాటిన తర్వాత బస్సు ముందు ఉన్న కారును ఓవర్‌టేక్ చేసింది.
ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన కల్వర్టును ఢీకొట్టింది. ఈ సమయంలో భారీ కుదుపు వచ్చింది. దాంతో బస్సులోని డీజిల్ ట్యాంకు తీవ్రమైన ఒత్తిడి కలిగింది. ఒత్తిడి ఎక్కువయి ట్యాంకులో మంటలు రేగాయి. ఈ మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. డ్రైవర్ చెబుతున్న దాని ప్రకారం బస్సు కల్వర్టును ఢీకొట్టడం వల్ల ముందు టైర్ పగిలిపోయింది. దీంతో బస్సు భారీ కుదుపునకు లోనయింది. ఈ క్రమంలో డీజిల్ ట్యాంకులో మంటలు లేచాయి. బస్సులో మంటలు లేచిన తీరును రెండున్న భిన్నమైన కథనాలు వస్తున్న నేపథ్యంలో.. ప్రమాదం కచ్చితంగా ఎలా జరిగింది? అనే విషయాన్ని నిపుణులు తేల్చాల్సి ఉంది.
బస్సులో మంటలు లేచిన విషయాన్ని డ్రైవర్ క్యాబిన్లో ఉన్న వారు గుర్తించారు. డ్రైవర్‌తో పాటు క్లీనర్ కూడా కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. డ్రైవర్ క్యాబిన్‌కు, ప్రయాణికులు ఉన్న పోర్షన్‌కు మధ్యలో ఉన్న డోర్ తెరుచుకోలేదు. ఈ డోర్ గనుక తెరుచుకుని ఉంటే కొంత మంది ప్రయాణికులు అయినా ప్రాణాలతో బయటపడి ఉండేవారు.
డోర్ తెరుచుకోకపోవడం.. గాఢ నిద్రలో ఉండటం వల్ల ప్రయాణికులకు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి దారి లేకుండా పోయింది. మంటలు వచ్చిన విషయాన్ని గుర్తించే సరికి పొగ, మంటలు దట్టంగా వ్యాపించాయి. ఏసీ గ్యాస్ వల్ల కూడా మంటలు శరవేగంగా వ్యాపించాయి. ఒకరిద్దరు ప్రయాణికులు కాలుతున్న శరీరాలతోనే కిందకు దూకేశారు. అయినా ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యం.. సమయస్ఫూర్తి లేకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. బస్సులో మొత్తం 49మంది ప్రయాణించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా వీరిలో 45 మంది చనిపోయారు. డ్రైవర్, క్లీనర్ తో పాటు మరో అయిదుగురు ప్రాణాలుతో బయటపడ్డారు. కాగా డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా అనే అనుమానంతో వైద్యులు అతని రక్త నమునాలు పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపించారు. ఇక బస్సులో పెద్ద ఎత్తున ఊలు బయటపడటంతో.... బస్సులో సరుకు రవాణాపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇప్పటికీ బస్సులో ఎంత మంది ఉన్నారు? అనే దానిపై ఇంకా స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు. అయితే ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాలు..... అమాయక జనం నిస్సహాయతను సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్....వెరసి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రైవేట్ బస్సెక్కిన ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలే. కరెన్సీతో కళ్లుమూసుకుపోయి చూసిచూడనట్టుగా వదిలిస్తున్న అధికారులు.....ప్రజాభద్రతను బాధ్యత వహించాల్సిన పాలకులు కూడా బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుంటే... సామాన్యులు ప్రాణాలు వోల్వో బస్సుల్లో బూడిదై పోవాల్సిందే.