వెళ్లొస్తాం.. అమ్మానాన్నల చివరి మాటలు
గుంటూరు : అమ్మా వెళ్లొస్తామంటూ.. తమ కుమార్తెకు ఆప్యాయంగా చెప్పిన ఆ మాటలే వారికి చివరి పలుకులయ్యాయి. హైదరాబాద్లో బస్సు దిగాక తల్లీతండ్రుల నుంచి క్షేమ సమాచారంతో మళ్లీ ఫోన్ వస్తుందని ఆ కూతురు ఎంతగానో ఎదురు చూసింది. అయితే ఫోన్ వచ్చిందికానీ.. అది మోసుకొచ్చింది.. క్షేమ సమాచారాన్ని కాదు. కన్నవారి మరణ వార్తను. మహబూబ్ నగర్ బస్సు దగ్ధం ఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు సజీవ దహనమయిన ఘటన అందరి హృదయాలనూ ద్రవింపచేస్తోంది.
గాలి బాలసుందర్ రాజు, మేరీవిజయలక్ష్మి దంపతులు. వీరి ఒక్కగానొక్క కుమార్తె సౌమ్య బెంగళూరులోని రామయ్య ఐఐటీలో ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. సౌమ్య మొదట్లో కళాశాల హాస్టల్ ఉండి చదువుకునేది. అయితే హాస్టల్ భోజనం పడకపోవటంతో బాలసుందర్ రాజు దంపతులు నుంచి వెళ్లి సంవత్సర కాలంగా కుమార్తె దగ్గరే బెంగళూరులో ఉంటున్నారు.
కాగా బాలసుందర్ రాజు చాలాకాలంగా షుగర్ తో బాధపడుతున్నాడు. ప్రతి మూడు నెలలకోసారి హైదరాబాద్ వెళ్లి అక్కడే చెకప్ చేయించుకుని మందులు తెచ్చుకుంటున్నాడు. అలాగే ఈసారి కూడా భార్య మేరీ విజయలక్ష్మిని వెంటపట్టుకుని బెంగళూరులో రాత్రి పది గంటల సమయంలో బస్సు ఎక్కాడు. అయితే ప్రమాదం జరిగిన సమయం తెల్లవారుజాము కావటంతో దంపతులిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు.
ఇదే సమయంలో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు తోటి ప్రయాణీకులతోపాటు వీరిని కూడా ఆహుతి చేసేశాయి. ఈ ఘటనతో బాలసుందర్ రాజు స్వస్థలమైన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళ్లూరులో విషాదం నెలకొంది. కనీసం శవాలను కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడటంతో వారి కుటుంబ సభ్యులు భోరుమంటున్నారు. కనీసం చివరిచూపు కూడా చూడలేకపోయామంటూ రోదిస్తున్నారు.