Saumya
-
ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?.. ఈడీకి సుప్రీం కోర్టు మందలింపు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సస్పెండ్ అయిన సివిల్ సర్వెంట్ సౌమ్య చౌరాసియాకు ఆమె కస్టడీలో గడిపిన సమయం, ఆరోపణలు నమోదు చేయకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఈరోజు(గురువారం) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే విచారణలో ఉన్నవారిని ఎన్నాళ్లు జైలులో ఉంచుతారని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించిందిఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మాజీ డిప్యూటీ సెక్రటరీగా చౌరాసియా పనిచేశారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమె నిందితురాలు. సుప్రీం న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సౌమ్య చౌరాసియాకు బెయిల్ మంజూరు చేసింది. ఆమె ఇప్పటికే ఒక సంవత్సరం తొమ్మిది నెలల పాటు కస్టడీలో ఉన్నారని, ఆమె సహ నిందితుల్లో కొందరు ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.ట్రయల్ కోర్టుకు హాజరుకాక పోవడం, నిందితులలో కొందరిపై నాన్-బెయిలబుల్ వారెంట్లను అమలు చేయకపోవడం వల్ల అభియోగాలు నమోదు చేయడం సాధ్యం కాదని ఛత్తీస్ హైకోర్టు గతంలో పేర్కొంది. ఈ దరిమిలా, తదుపరి తేదీలో విచారణకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో, తాము పిటిషనర్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని నిర్దేశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఆమె మధ్యంతర బెయిల్‌పై ఉన్నందున తిరిగి సర్వీస్‌లో చేర్చుకోవద్దని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్‌లో ఉంచాలని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.చౌరాసియా తదుపరి కోర్టు విచారణకు హాజరుకావాలని, అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడానికి లేదా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించవద్దని, ఆమె తన పాస్‌పోర్ట్‌ను ప్రభుత్వానికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న కేసుల్లో నేరారోపణ రేటు ఎంతని? నిందితులను ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాగా ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించగా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది పల్లవి శర్మ ఈ కేసులో చౌరాసియా తరపున వాదించారు. సౌమ్య చౌరాసియా 2022 డిసెంబర్లో బొగ్గు కుంభకోణంతో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. తన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఆదేశాలను చౌరాసియా సుప్రీం కోర్టులో సవాలు చేశారు.ఇది కూడా చదవండి: తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..! -
World Tourism Day: తిరుగు... తిను... ఉన్నది ఒకటే జిందగీ
కోయంబత్తూరులో కోడి పలావు, అమృత్‌సర్‌లో కుల్చా, లక్నోలో కబాబులు.. ఉడిపిలో ఇడ్లీ... కొత్త ప్రాంతాలు చూస్తూ అక్కడ దొరికే తిండిని రుచి చూస్తూ జీవితం గడిచిపోతుంటే ఎలా ఉంటుంది? సౌమ్య జీవితంలానే ఉంటుంది. ఐటిలో పని చేసే సౌమ్య ఇప్పుడు ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్ ట్రావెల్ రైటర్ అయ్యింది. భర్త విషుతో కలిసి ‘రోడ్ టు టేస్ట్’ అనే వ్లోగ్‌ని నడుపుతుంది ఆమె. నెలలో ఒక్క కొత్త ప్రాంతాన్నైనా రోడ్డు మార్గంలో చూసి అక్కడి తిండి తినాలన్నది సౌమ్య లక్ష్యం. ఇవాళ ‘వరల్డ్ టూరిజం డే’. లోకం చాలా విశాలమైనది. రుచులు లెక్కలేనివి. తిరుగుతూ తినే అనుభూతి ఈ సెలవుల్లో ట్రై చేయండి. ఊరికే శాంపిల్‌కి సౌమ్య తన భర్త విషుతో వేసిన ఒక ట్రిప్‌ను తెలుసుకుందాం. దాని పేరు ‘దక్షిణ భారతదేశంలో మంచి బిర్యానీని కనుగొనుట’. అంతే. కారు వేసుకుని భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరారు. ముందు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి ‘షాబాద్’ లో బిర్యానీ టేస్ట్ చూశారు. ‘షా గౌస్’నూ వదల్లేదు. అక్కణ్ణుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అక్కడి అలీబాబా కేఫ్‌లో ఫేమస్ ‘భత్కలీ బిర్యానీ’ తిన్నారు. ఆ తర్వాత అక్కడే ‘చిచాబాస్ తాజ్’ అనే రెస్టరెంట్లో దొరికే బిర్యానీ తిన్నారు. కీమా బిర్యానీ టేస్ట్ చూశారు. నాగార్జున రెస్టరెంట్లో దొరికే ‘తర్కారీ బిర్యానీ’ (వెజ్ బిర్యానీ) లాగించారు. అక్కడి నుంచి చెన్నై బయలుదేరి దారిలో ‘అంబూర్’లో ఆగి అంబూర్ బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత చెన్నైలో మెరినా బీచ్‌లో సేద తీరి చెన్నైలో దొరికే ‘షాదీ బిర్యానీ’ తిన్నారు. చెన్నైలోని ఫేమస్ ‘చార్మినార్ బిర్యానీ సెంటర్’ అనే చిన్న షాపులోని బిర్యానీ వంకాయ కూరతో తిన్నారు. కల్యాణ్ భవన్లో దొరికే బిర్యానీ వంతు తర్వాత. అక్కడి నుంచి కోయంబత్తూరు బయలుదేరి మధ్యలో మహాబలిపురంలో ఒక బిర్యానీ టేస్ట్ చూశారు. ఆ తర్వాత కోయంబత్తూరులో దిండిగుల్ మటన్ బిర్యానీకి లొట్టలు వేశారు. చివరకు ఈ ప్రయాణం కేరళలోని కాలిట్లో దొరికే మలబార్ బిర్యానీతో ముగిసింది. ఇంట్లో నాలుగ్గోడల మధ్య కూచుని ఉంటే ఇన్ని ఊళ్ల మీదుగా ఇన్ని బిర్యానీలు తినే వీలు ఉండేదా? అసలు లోకం తెలిసేదా? ఇన్ని రుచులతో ఇన్ని స్థలాలు ఉన్నాయని ఇందరు మనుషులు వీటిని సిద్ధం చేస్తున్నారని ఎలా తెలియాలి? ప్రయాణాలు చేయాలి. సౌమ్య తన భర్త విషుతో కలిసి చేసే పని అదే. అందుకే ఆమె తన వ్లోగ్కు ‘రోడ్ టు టేస్ట్’ అని పెట్టింది. 2015లో పెళ్లి– ప్రయాణం సౌమ్య, విషులు తమ సొంత ఊళ్లు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ప్రపంచమే వారి ఊరు. మొత్తం మీద ఇద్దరూ టీనేజ్ వయసు నుంచి సోలో ట్రావెలర్లుగా ఉన్నారు. కాని విషు పని చేసే ఐ.టి కంపెనీలోనే సౌమ్య కూడా చేరడంతో కథ ఒక దారిన పడింది. ‘మన టేస్ట్ ఒకటే’ అని ఇద్దరూ గ్రహించారు. 2015లో పెళ్లి చేసుకున్నారు. ‘జీవితం అంటే తిరగడమే’ అనేది వీరి పెళ్లికి ట్యాగ్‌లైన్. 2016లో ‘రోడ్ టు టేస్ట్’ వ్లోగ్ మొదలెట్టారు. ఇన్‌స్టాలో కూడా తమ అనుభవాలు, ఫోటోలు పెడతారు. సోషల్ మీడియాలో ఈ జంట చాలా పాపులర్ అయ్యింది. రోడ్డు మార్గం గుండా తిరుగుతూ కొత్త ప్రాంతాల విశేషాలతో పాటు అక్కడి ఆహారం గురించి తెలియ చేస్తారు. కంటికి, కడుపుకి వీరిచ్చే విందు అందరికీ నచ్చింది. ఇప్పటికి వీరు కలిసి 30 దేశాల్లో 100 నగరాలు చూశారు. ఇన్ని మనం చూడకపోయినా మన దేశంలోనే 30 టూరిస్ట్ ప్లేస్‌లు చూడగలిగితే చాలు. డబ్బులూ వస్తాయి ఒక రంగంలో మనం ఫేమస్ అయితే డబ్బులూ వస్తాయి. సౌమ్య కూడా డబ్బు సంపాదిస్తోంది. అనేక ప్రాడక్ట్‌లను ప్రమోట్ చేయమని కంపెనీలు డబ్బులిస్తాయి. ఉదాహరణకు ‘మిల్టన్’ వారు ఒక ట్రిప్‌కు స్పాన్సర్ చేస్తారు. ఆ విశేషాలు రాసేప్పుడు సౌమ్య మిల్టన్ ఉత్పత్తి ఏదైనా తన ప్రయాణంలో ఉన్నట్టు చూపుతుంది. ఒక సినిమాను ప్రమోట్ చేయాలంటే పోస్టర్ ఇచ్చి హిమాలయ బేస్ క్యాంప్‌కు వెళ్లమంటే వెళ్లి అక్కడ దానిని చూపుతూ ఫొటో దిగుతారు. ప్లస్ ప్రయాణ వివరాలు రాస్తారు. అంటే ఉభయతారకం అన్నమాట. భ్రమణ కాంక్ష స్త్రీలైనా పురుషులైనా తిరగాలి. సౌమ్య, విషులకు ఉండే ఆర్థిక శక్తి, ఇంగ్లిష్ ప్రావీణ్యం మనకు లేకపోవచ్చు. కాని పొదుపుగా తక్కువ ఖర్చులో చేసే విహారాలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు, తెలంగాణలో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు కనీసం చూసి ఉండాలి. ఆ తర్వాత సౌత్‌లోని ఒక్కో రాష్ట్రం చూడాలి. తర్వాత నార్త్. తర్వాత ఈశాన్యం. తిరుగుతూ ఉంటే ఈ లోకం ఇంత పెద్దది... చిన్న మనసుతో బతక్కూడదు అనిపిస్తుంది. అది చాలదూ? -
ఆర్య వల్వేకర్... మిస్ ఇండియా–యూఎస్ఏ
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ యువతి ఆర్య వల్వేకర్(18) మిస్ ఇండియా యూఎస్ఏ–2022 గెలుచుకున్నారు. వర్జీనియాకు చెందిన ఆర్య న్యూజెర్సీలో జరిగిన 40వ వార్షిక పోటీలో మిస్ఇండియా యూఎస్ఏ కిరీటం గెలుచుకుంది. సౌమ్య శర్మ, సంజన చేకూరి రన్నరప్‌లుగా నిలిచారు. సినిమాల్లోకి రావాలన్నది తన స్వప్నమని ఆర్య వల్వేకర్ ఈ సందర్భంగా చెప్పారు. ‘నన్ను నేను వెండితెరపై చూసుకోవాలని.. సినిమాలు, టీవీల్లో నటించాలనేది నా చిన్నప్పటి కల’ అని పీటీఐతో ఆమె అన్నారు. 18 ఏళ్ల ఆర్య వల్వేకర్.. వర్జీనియాలోని బ్రియార్ వుడ్స్ హై స్కూల్లో చదువుకున్నారు. మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ హెల్త్‌పై ఆసక్తి కనబరిచే ఆమె పలు అవగాహనా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. యుఫోరియా డాన్స్ స్టూడియోను స్థాపించి స్థానికంగా పిల్లలకు డాన్స్ నేర్పిస్తున్నారు. కొత్త ప్రదేశాల పర్యటన, వంట చేయడం, చర్చలు.. తనకు ఇష్టమైన వ్యాపకాలని వెల్లడించారు. యోగా చేయడం తనకు ఇష్టమన్నారు. ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులు, చెల్లెలితో గడపడంతో పాటు... స్నేహితుల కోసం వంటలు చేస్తుంటానని చెప్పారు. ఇక పోటీల విషయానికొస్తే... మిస్ ఇండియా–యూఎస్ఏతో పాటు మీసెస్ ఇండియా, మిస్ టీన్ ఇండియా –యూఎస్ఏ కాంపిటేషన్స్ జరిగాయి. అమెరికాలోని 30 రాష్ట్రాలకు చెందిన 74 మంది పోటీదారులు వీటిలో పాల్గొన్నారు. వాషింగ్టన్కు చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ, న్యూయార్క్‌కు చెందిన తన్వీ గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏగా నిలిచారు. (క్లిక్: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట) -
తొట్టిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
తొట్టిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు పామర్రు, న్యూస్‌లైన్ : పశువుల కోసం ఏర్పాటుచేసిన కుడితి తొట్టి ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఆ పాప తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. మండలంలోని పెదమద్దాలి అంబేద్కర్ కాలనీలో ఈ విషాదం ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అంబేద్కర్ కాలనీకి చెందిన కలపాల కిషోర్, స్వరూపలకు కుమారుడు శ్యామ్, కుమార్తె సౌమ్య (సంవత్సరం దాటి ఐదు నెలలు) ఉన్నారు. ఆదివారం ఉదయం కిషోర్ పొలం పనులకు వెళ్లాడు. చిన్నారులు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా స్వరూప ఇంట్లో వంట పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఆడుకుంటున్న సౌమ్య పక్కనే పశువుల కోసం ఏర్పాటు చేసిన కుడితి తొట్టి వద్దకు చేరుకుంది. ప్రమాదవశాత్తూ అందులో పడిపోయింది. అక్కడే ఆడుకుంటున్న మరో చిన్నారి ఈ విషయాన్ని తల్లికి తెలుపగా, ఆమె వచ్చేసరికి సౌమ్య స్పృహ కోల్పోయింది. వెంటనే చిన్నారిని మోపెడ్‌పై వైద్యశాలకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే సౌమ్య మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఒక్కగానొక్క కుమార్తె కళ్లముందే ఆడుకుంటూ మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. -
వెళ్లొస్తాం.. అమ్మానాన్నల చివరి మాటలు
గుంటూరు : అమ్మా వెళ్లొస్తామంటూ.. తమ కుమార్తెకు ఆప్యాయంగా చెప్పిన ఆ మాటలే వారికి చివరి పలుకులయ్యాయి. హైదరాబాద్‌లో బస్సు దిగాక తల్లీతండ్రుల నుంచి క్షేమ సమాచారంతో మళ్లీ ఫోన్ వస్తుందని ఆ కూతురు ఎంతగానో ఎదురు చూసింది. అయితే ఫోన్ వచ్చిందికానీ.. అది మోసుకొచ్చింది.. క్షేమ సమాచారాన్ని కాదు. కన్నవారి మరణ వార్తను. మహబూబ్ నగర్ బస్సు దగ్ధం ఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు సజీవ దహనమయిన ఘటన అందరి హృదయాలనూ ద్రవింపచేస్తోంది. గాలి బాలసుందర్ రాజు, మేరీవిజయలక్ష్మి దంపతులు. వీరి ఒక్కగానొక్క కుమార్తె సౌమ్య బెంగళూరులోని రామయ్య ఐఐటీలో ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. సౌమ్య మొదట్లో కళాశాల హాస్టల్ ఉండి చదువుకునేది. అయితే హాస్టల్ భోజనం పడకపోవటంతో బాలసుందర్ రాజు దంపతులు నుంచి వెళ్లి సంవత్సర కాలంగా కుమార్తె దగ్గరే బెంగళూరులో ఉంటున్నారు. కాగా బాలసుందర్ రాజు చాలాకాలంగా షుగర్ తో బాధపడుతున్నాడు. ప్రతి మూడు నెలలకోసారి హైదరాబాద్ వెళ్లి అక్కడే చెకప్ చేయించుకుని మందులు తెచ్చుకుంటున్నాడు. అలాగే ఈసారి కూడా భార్య మేరీ విజయలక్ష్మిని వెంటపట్టుకుని బెంగళూరులో రాత్రి పది గంటల సమయంలో బస్సు ఎక్కాడు. అయితే ప్రమాదం జరిగిన సమయం తెల్లవారుజాము కావటంతో దంపతులిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు తోటి ప్రయాణీకులతోపాటు వీరిని కూడా ఆహుతి చేసేశాయి. ఈ ఘటనతో బాలసుందర్ రాజు స్వస్థలమైన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళ్లూరులో విషాదం నెలకొంది. కనీసం శవాలను కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడటంతో వారి కుటుంబ సభ్యులు భోరుమంటున్నారు. కనీసం చివరిచూపు కూడా చూడలేకపోయామంటూ రోదిస్తున్నారు.