న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సస్పెండ్ అయిన సివిల్ సర్వెంట్ సౌమ్య చౌరాసియాకు ఆమె కస్టడీలో గడిపిన సమయం, ఆరోపణలు నమోదు చేయకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఈరోజు(గురువారం) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే విచారణలో ఉన్నవారిని ఎన్నాళ్లు జైలులో ఉంచుతారని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించింది
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మాజీ డిప్యూటీ సెక్రటరీగా చౌరాసియా పనిచేశారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమె నిందితురాలు. సుప్రీం న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సౌమ్య చౌరాసియాకు బెయిల్ మంజూరు చేసింది. ఆమె ఇప్పటికే ఒక సంవత్సరం తొమ్మిది నెలల పాటు కస్టడీలో ఉన్నారని, ఆమె సహ నిందితుల్లో కొందరు ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
ట్రయల్ కోర్టుకు హాజరుకాక పోవడం, నిందితులలో కొందరిపై నాన్-బెయిలబుల్ వారెంట్లను అమలు చేయకపోవడం వల్ల అభియోగాలు నమోదు చేయడం సాధ్యం కాదని ఛత్తీస్ హైకోర్టు గతంలో పేర్కొంది. ఈ దరిమిలా, తదుపరి తేదీలో విచారణకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో, తాము పిటిషనర్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని నిర్దేశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఆమె మధ్యంతర బెయిల్‌పై ఉన్నందున తిరిగి సర్వీస్‌లో చేర్చుకోవద్దని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్‌లో ఉంచాలని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
చౌరాసియా తదుపరి కోర్టు విచారణకు హాజరుకావాలని, అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడానికి లేదా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించవద్దని, ఆమె తన పాస్‌పోర్ట్‌ను ప్రభుత్వానికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న కేసుల్లో నేరారోపణ రేటు ఎంతని? నిందితులను ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాగా ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించగా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది పల్లవి శర్మ ఈ కేసులో చౌరాసియా తరపున వాదించారు. సౌమ్య చౌరాసియా 2022 డిసెంబర్‌లో బొగ్గు కుంభకోణంతో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. తన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఆదేశాలను చౌరాసియా సుప్రీం కోర్టులో సవాలు చేశారు.
ఇది కూడా చదవండి: తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!
Comments
Please login to add a commentAdd a comment