World Tourism Day: తిరుగు... తిను... ఉన్నది ఒకటే జిందగీ | World Tourism Day: Travel couple Soumya and Vishu run the Road To Taste special story | Sakshi
Sakshi News home page

World Tourism Day: తిరుగు... తిను... ఉన్నది ఒకటే జిందగీ

Published Tue, Sep 27 2022 12:22 AM | Last Updated on Tue, Sep 27 2022 10:23 AM

World Tourism Day: Travel couple Soumya and Vishu run the Road To Taste special story - Sakshi

భర్త విషుతో సౌమ్య; వివిధ రకాల వంటలతో సౌమ్య

కోయంబత్తూరులో కోడి పలావు, అమృత్‌సర్‌లో కుల్చా, లక్నోలో కబాబులు.. ఉడిపిలో ఇడ్లీ... కొత్త ప్రాంతాలు చూస్తూ అక్కడ దొరికే తిండిని రుచి చూస్తూ జీవితం గడిచిపోతుంటే ఎలా ఉంటుంది? సౌమ్య జీవితంలానే ఉంటుంది. ఐటిలో పని చేసే సౌమ్య ఇప్పుడు ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్‌ ట్రావెల్‌ రైటర్‌ అయ్యింది.

భర్త విషుతో కలిసి ‘రోడ్‌ టు టేస్ట్‌’ అనే వ్లోగ్‌ని నడుపుతుంది ఆమె. నెలలో ఒక్క కొత్త ప్రాంతాన్నైనా రోడ్డు మార్గంలో చూసి అక్కడి తిండి తినాలన్నది సౌమ్య లక్ష్యం. ఇవాళ ‘వరల్డ్‌ టూరిజం డే’. లోకం చాలా విశాలమైనది. రుచులు లెక్కలేనివి. తిరుగుతూ తినే అనుభూతి ఈ సెలవుల్లో ట్రై చేయండి.

ఊరికే శాంపిల్‌కి సౌమ్య తన భర్త విషుతో వేసిన ఒక ట్రిప్‌ను తెలుసుకుందాం. దాని పేరు ‘దక్షిణ భారతదేశంలో మంచి బిర్యానీని కనుగొనుట’. అంతే. కారు వేసుకుని భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరారు. ముందు హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడి ‘షాబాద్‌’ లో బిర్యానీ టేస్ట్‌ చూశారు. ‘షా గౌస్‌’నూ వదల్లేదు. అక్కణ్ణుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అక్కడి అలీబాబా కేఫ్‌లో ఫేమస్‌ ‘భత్కలీ బిర్యానీ’ తిన్నారు. ఆ తర్వాత అక్కడే ‘చిచాబాస్‌ తాజ్‌’ అనే రెస్టరెంట్‌లో దొరికే బిర్యానీ తిన్నారు. కీమా బిర్యానీ టేస్ట్‌ చూశారు.

నాగార్జున రెస్టరెంట్‌లో దొరికే ‘తర్కారీ బిర్యానీ’ (వెజ్‌ బిర్యానీ) లాగించారు. అక్కడి నుంచి చెన్నై బయలుదేరి దారిలో ‘అంబూర్‌’లో ఆగి అంబూర్‌ బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత చెన్నైలో మెరినా బీచ్‌లో సేద తీరి చెన్నైలో దొరికే ‘షాదీ బిర్యానీ’ తిన్నారు. చెన్నైలోని ఫేమస్‌ ‘చార్మినార్‌ బిర్యానీ సెంటర్‌’ అనే చిన్న షాపులోని బిర్యానీ వంకాయ కూరతో తిన్నారు. కల్యాణ్‌ భవన్‌లో దొరికే బిర్యానీ వంతు తర్వాత. అక్కడి నుంచి కోయంబత్తూరు బయలుదేరి మధ్యలో మహాబలిపురంలో ఒక బిర్యానీ టేస్ట్‌ చూశారు. ఆ తర్వాత కోయంబత్తూరులో దిండిగుల్‌ మటన్‌ బిర్యానీకి లొట్టలు వేశారు. చివరకు ఈ ప్రయాణం కేరళలోని కాలిట్‌లో దొరికే మలబార్‌ బిర్యానీతో ముగిసింది.

ఇంట్లో నాలుగ్గోడల మధ్య కూచుని ఉంటే ఇన్ని ఊళ్ల మీదుగా ఇన్ని బిర్యానీలు తినే వీలు ఉండేదా? అసలు లోకం తెలిసేదా? ఇన్ని రుచులతో ఇన్ని స్థలాలు ఉన్నాయని ఇందరు మనుషులు వీటిని సిద్ధం చేస్తున్నారని ఎలా తెలియాలి? ప్రయాణాలు చేయాలి. సౌమ్య తన భర్త విషుతో కలిసి చేసే పని అదే. అందుకే ఆమె తన వ్లోగ్‌కు ‘రోడ్‌ టు టేస్ట్‌’ అని పెట్టింది.

2015లో పెళ్లి– ప్రయాణం
సౌమ్య, విషులు తమ సొంత ఊళ్లు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ప్రపంచమే వారి ఊరు. మొత్తం మీద ఇద్దరూ టీనేజ్‌ వయసు నుంచి సోలో ట్రావెలర్లుగా ఉన్నారు. కాని విషు పని చేసే ఐ.టి కంపెనీలోనే సౌమ్య కూడా చేరడంతో కథ ఒక దారిన పడింది. ‘మన టేస్ట్‌ ఒకటే’ అని ఇద్దరూ గ్రహించారు. 2015లో పెళ్లి చేసుకున్నారు. ‘జీవితం అంటే తిరగడమే’ అనేది వీరి పెళ్లికి ట్యాగ్‌లైన్‌. 2016లో ‘రోడ్‌ టు టేస్ట్‌’ వ్లోగ్‌ మొదలెట్టారు. ఇన్‌స్టాలో కూడా తమ అనుభవాలు, ఫోటోలు పెడతారు. సోషల్‌ మీడియాలో ఈ జంట చాలా పాపులర్‌ అయ్యింది. రోడ్డు మార్గం గుండా తిరుగుతూ కొత్త ప్రాంతాల విశేషాలతో పాటు అక్కడి ఆహారం గురించి తెలియ చేస్తారు. కంటికి, కడుపుకి వీరిచ్చే విందు అందరికీ నచ్చింది. ఇప్పటికి వీరు కలిసి 30 దేశాల్లో 100 నగరాలు చూశారు. ఇన్ని మనం చూడకపోయినా మన దేశంలోనే 30 టూరిస్ట్‌ ప్లేస్‌లు చూడగలిగితే చాలు.

డబ్బులూ వస్తాయి
ఒక రంగంలో మనం ఫేమస్‌ అయితే డబ్బులూ వస్తాయి. సౌమ్య కూడా డబ్బు సంపాదిస్తోంది. అనేక ప్రాడక్ట్‌లను ప్రమోట్‌ చేయమని కంపెనీలు డబ్బులిస్తాయి. ఉదాహరణకు ‘మిల్టన్‌’ వారు ఒక ట్రిప్‌కు స్పాన్సర్‌ చేస్తారు. ఆ విశేషాలు రాసేప్పుడు సౌమ్య మిల్టన్‌ ఉత్పత్తి ఏదైనా తన ప్రయాణంలో ఉన్నట్టు చూపుతుంది. ఒక సినిమాను ప్రమోట్‌ చేయాలంటే పోస్టర్‌ ఇచ్చి హిమాలయ బేస్‌ క్యాంప్‌కు వెళ్లమంటే వెళ్లి అక్కడ దానిని చూపుతూ ఫొటో దిగుతారు. ప్లస్‌ ప్రయాణ వివరాలు రాస్తారు. అంటే ఉభయతారకం అన్నమాట.

భ్రమణ కాంక్ష
స్త్రీలైనా పురుషులైనా తిరగాలి. సౌమ్య, విషులకు ఉండే ఆర్థిక శక్తి, ఇంగ్లిష్‌ ప్రావీణ్యం మనకు లేకపోవచ్చు. కాని పొదుపుగా తక్కువ ఖర్చులో చేసే విహారాలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు, తెలంగాణలో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు కనీసం చూసి ఉండాలి. ఆ తర్వాత సౌత్‌లోని ఒక్కో రాష్ట్రం చూడాలి. తర్వాత నార్త్‌. తర్వాత ఈశాన్యం. తిరుగుతూ ఉంటే ఈ లోకం ఇంత పెద్దది... చిన్న మనసుతో బతక్కూడదు అనిపిస్తుంది. అది చాలదూ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement