touristers
-
World Tourism Day: తిరుగు... తిను... ఉన్నది ఒకటే జిందగీ
కోయంబత్తూరులో కోడి పలావు, అమృత్‌సర్‌లో కుల్చా, లక్నోలో కబాబులు.. ఉడిపిలో ఇడ్లీ... కొత్త ప్రాంతాలు చూస్తూ అక్కడ దొరికే తిండిని రుచి చూస్తూ జీవితం గడిచిపోతుంటే ఎలా ఉంటుంది? సౌమ్య జీవితంలానే ఉంటుంది. ఐటిలో పని చేసే సౌమ్య ఇప్పుడు ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్ ట్రావెల్ రైటర్ అయ్యింది. భర్త విషుతో కలిసి ‘రోడ్ టు టేస్ట్’ అనే వ్లోగ్‌ని నడుపుతుంది ఆమె. నెలలో ఒక్క కొత్త ప్రాంతాన్నైనా రోడ్డు మార్గంలో చూసి అక్కడి తిండి తినాలన్నది సౌమ్య లక్ష్యం. ఇవాళ ‘వరల్డ్ టూరిజం డే’. లోకం చాలా విశాలమైనది. రుచులు లెక్కలేనివి. తిరుగుతూ తినే అనుభూతి ఈ సెలవుల్లో ట్రై చేయండి. ఊరికే శాంపిల్‌కి సౌమ్య తన భర్త విషుతో వేసిన ఒక ట్రిప్‌ను తెలుసుకుందాం. దాని పేరు ‘దక్షిణ భారతదేశంలో మంచి బిర్యానీని కనుగొనుట’. అంతే. కారు వేసుకుని భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరారు. ముందు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి ‘షాబాద్’ లో బిర్యానీ టేస్ట్ చూశారు. ‘షా గౌస్’నూ వదల్లేదు. అక్కణ్ణుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అక్కడి అలీబాబా కేఫ్‌లో ఫేమస్ ‘భత్కలీ బిర్యానీ’ తిన్నారు. ఆ తర్వాత అక్కడే ‘చిచాబాస్ తాజ్’ అనే రెస్టరెంట్లో దొరికే బిర్యానీ తిన్నారు. కీమా బిర్యానీ టేస్ట్ చూశారు. నాగార్జున రెస్టరెంట్లో దొరికే ‘తర్కారీ బిర్యానీ’ (వెజ్ బిర్యానీ) లాగించారు. అక్కడి నుంచి చెన్నై బయలుదేరి దారిలో ‘అంబూర్’లో ఆగి అంబూర్ బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత చెన్నైలో మెరినా బీచ్‌లో సేద తీరి చెన్నైలో దొరికే ‘షాదీ బిర్యానీ’ తిన్నారు. చెన్నైలోని ఫేమస్ ‘చార్మినార్ బిర్యానీ సెంటర్’ అనే చిన్న షాపులోని బిర్యానీ వంకాయ కూరతో తిన్నారు. కల్యాణ్ భవన్లో దొరికే బిర్యానీ వంతు తర్వాత. అక్కడి నుంచి కోయంబత్తూరు బయలుదేరి మధ్యలో మహాబలిపురంలో ఒక బిర్యానీ టేస్ట్ చూశారు. ఆ తర్వాత కోయంబత్తూరులో దిండిగుల్ మటన్ బిర్యానీకి లొట్టలు వేశారు. చివరకు ఈ ప్రయాణం కేరళలోని కాలిట్లో దొరికే మలబార్ బిర్యానీతో ముగిసింది. ఇంట్లో నాలుగ్గోడల మధ్య కూచుని ఉంటే ఇన్ని ఊళ్ల మీదుగా ఇన్ని బిర్యానీలు తినే వీలు ఉండేదా? అసలు లోకం తెలిసేదా? ఇన్ని రుచులతో ఇన్ని స్థలాలు ఉన్నాయని ఇందరు మనుషులు వీటిని సిద్ధం చేస్తున్నారని ఎలా తెలియాలి? ప్రయాణాలు చేయాలి. సౌమ్య తన భర్త విషుతో కలిసి చేసే పని అదే. అందుకే ఆమె తన వ్లోగ్కు ‘రోడ్ టు టేస్ట్’ అని పెట్టింది. 2015లో పెళ్లి– ప్రయాణం సౌమ్య, విషులు తమ సొంత ఊళ్లు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ప్రపంచమే వారి ఊరు. మొత్తం మీద ఇద్దరూ టీనేజ్ వయసు నుంచి సోలో ట్రావెలర్లుగా ఉన్నారు. కాని విషు పని చేసే ఐ.టి కంపెనీలోనే సౌమ్య కూడా చేరడంతో కథ ఒక దారిన పడింది. ‘మన టేస్ట్ ఒకటే’ అని ఇద్దరూ గ్రహించారు. 2015లో పెళ్లి చేసుకున్నారు. ‘జీవితం అంటే తిరగడమే’ అనేది వీరి పెళ్లికి ట్యాగ్‌లైన్. 2016లో ‘రోడ్ టు టేస్ట్’ వ్లోగ్ మొదలెట్టారు. ఇన్‌స్టాలో కూడా తమ అనుభవాలు, ఫోటోలు పెడతారు. సోషల్ మీడియాలో ఈ జంట చాలా పాపులర్ అయ్యింది. రోడ్డు మార్గం గుండా తిరుగుతూ కొత్త ప్రాంతాల విశేషాలతో పాటు అక్కడి ఆహారం గురించి తెలియ చేస్తారు. కంటికి, కడుపుకి వీరిచ్చే విందు అందరికీ నచ్చింది. ఇప్పటికి వీరు కలిసి 30 దేశాల్లో 100 నగరాలు చూశారు. ఇన్ని మనం చూడకపోయినా మన దేశంలోనే 30 టూరిస్ట్ ప్లేస్‌లు చూడగలిగితే చాలు. డబ్బులూ వస్తాయి ఒక రంగంలో మనం ఫేమస్ అయితే డబ్బులూ వస్తాయి. సౌమ్య కూడా డబ్బు సంపాదిస్తోంది. అనేక ప్రాడక్ట్‌లను ప్రమోట్ చేయమని కంపెనీలు డబ్బులిస్తాయి. ఉదాహరణకు ‘మిల్టన్’ వారు ఒక ట్రిప్‌కు స్పాన్సర్ చేస్తారు. ఆ విశేషాలు రాసేప్పుడు సౌమ్య మిల్టన్ ఉత్పత్తి ఏదైనా తన ప్రయాణంలో ఉన్నట్టు చూపుతుంది. ఒక సినిమాను ప్రమోట్ చేయాలంటే పోస్టర్ ఇచ్చి హిమాలయ బేస్ క్యాంప్‌కు వెళ్లమంటే వెళ్లి అక్కడ దానిని చూపుతూ ఫొటో దిగుతారు. ప్లస్ ప్రయాణ వివరాలు రాస్తారు. అంటే ఉభయతారకం అన్నమాట. భ్రమణ కాంక్ష స్త్రీలైనా పురుషులైనా తిరగాలి. సౌమ్య, విషులకు ఉండే ఆర్థిక శక్తి, ఇంగ్లిష్ ప్రావీణ్యం మనకు లేకపోవచ్చు. కాని పొదుపుగా తక్కువ ఖర్చులో చేసే విహారాలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు, తెలంగాణలో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు కనీసం చూసి ఉండాలి. ఆ తర్వాత సౌత్‌లోని ఒక్కో రాష్ట్రం చూడాలి. తర్వాత నార్త్. తర్వాత ఈశాన్యం. తిరుగుతూ ఉంటే ఈ లోకం ఇంత పెద్దది... చిన్న మనసుతో బతక్కూడదు అనిపిస్తుంది. అది చాలదూ? -
దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయి..
Matheran Crime News: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాథేరాన్‌లో ఓ మహిళా పర్యాటకురాలు దారుణ హత్యకు గురైన సంఘటనలో రాయ్‌గఢ్ పోలీసులు ఒక ఐటీ ఇంజనీర్‌ను అరెస్ట్ చేశారు. పన్వేల్‌కు చెందిన రామ్‌పాల్ అనే వ్యక్తి తన భార్య పూనమ్‌పై అనుమానంతోనే ఆమెను లాడ్జిలో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. మాథేరాన్‌లోని ఇందిరానగర్‌లో ఉన్న ఓ లాడ్జ్‌లో గది కావాలని శనివారం సాయంత్రం ఓ జంట వచ్చింది. లాడ్జ్ సిబ్బంది నియమాల ప్రకారం ఆ జంట వివరాలు రిజిస్టర్లో రాసుకొని వారికి గది ఇచ్చారు. ఆదివారం ఉదయం లాడ్జ్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి గది లోపలికి వెళ్లగా, బెడ్ కింద తల లేని మొండెం కనపడింది. రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని చూసి భయపడిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ అంతటా సోదా చేశారు. కానీ తల దొరకలేదు. దీంతో శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పన్వేల్‌లోని ఉప జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా, దర్యాప్తులో భాగంగా తనిఖీ చేస్తుండగా, రిజిస్టర్లో రాసిన పేరు, చిరునామా తప్పుడు వివరాలని తేలింది. ఈ జంట నుంచి లాడ్జ్ యజమాని కేతన్ రమాణే ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకోలేదు. దీంతో ఈ హత్య కేసు చేధించడం పోలీసులకు సవాలుగా మారింది. మరోవైపు, లాడ్జింగులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. చదవండి: (రైల్వే కోచ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్) మాస్క్ ధరించి ఉండటంతో ఆ మహిళ భర్త ముఖం గుర్తించడం కష్టతరంగా మారింది. ఇదిలావుండగా, సోమవారం ఉదయం మాథేరాన్‌లో ఓ చోట ఓ హ్యాండ్ బ్యాగ్ లభించింది. సీసీ టీవీ ఫుటేజ్‌లో మహిళ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగు, పోలీసులకు దొరికిన బ్యాగు ఒకటేనని తేలింది. దీంతో ఆ బ్యాగులో ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెను ముంబైలోని గోరేగావ్‌కు చెందిన 30 ఏళ్ల పూనమ్ పాల్గా గుర్తించారు. అదే సమయంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా తమ కూతురు అదృశ్యమైనట్లు గోరేగావ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మృతదేహం పూనమ్‌దేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. -
పాపికొండలు విహార యాత్రలో విషాదం
సాక్షి, వి.ఆర్.పురం: పాపికొండల విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. విహార యాత్రకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన బ్యాంకు ఉద్యోగి ఇక్కడి కొల్లురు బ్యాంబో హట్స్లొ బస చేశారు. అయితే అతనికి గుండెపోటు రావడంతో హుటాహుటిని తూర్పుగోదావరిజిల్లా వి.ఆర్.పురం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన అప్పటికే మృతిచెంది నట్లు వైద్యులు నిర్ధారించారు. -
లేపాక్షి ఆలయానికి తగ్గిన పర్యాటకులు
లేపాక్షి : కేంద్రప్రభుత్వం ఇటీవల రూ. 500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేయడంతో లేపాక్షిని సందర్శించే పర్యాటకుల రద్దీ తగ్గింది. ప్రతి రెండో శనివారం, ఆదివారాల్లో ఆంధ్రతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేవారు. అయితే పెద్ద నోట్లు చెలామణిలో లేకపోవడంతో పర్యాటకులు రాలేకపోతున్నారు. సామాన్య ప్రజలు ఆలయానికి రావాలన్నా కనీసం రూ.500 అవసరం అవుతుంది. దీంతో ఆలయానికి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. ఫలితంగా ఆలయానికి భక్తుల రద్దీ తగ్గింది. -
పర్యాటకులతో పాతబస్తీ కళకళ
చార్మినార్: వరుస సెలవులతో పాతబస్తీలోని పర్యాటక స్థలాలు సందర్శకులతో కిటకిటలాడాయి. చార్మినార్, మక్కామసీదు, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్ తదితర పర్యాటక ప్రాంతాలన్నీ పర్యాటకులతో శని, ఆదివారాల్లో రద్దీగా మారాయి. ఎటు చూసినా సందడే.. సందడి. చార్మినార్ కట్టడాన్ని సందర్శించేందుకు పర్యాటకులు పోటీపడ్డారు. టిక్కెట్ల కోసం భారీ క్యూ కనిపించింది. ఫుట్‌పాత్ వ్యాపారాలతో పాటు చిరువ్యాపారాలు జోరుగా కొనసాగాయి. ఆటో రిక్షాలను చార్మినార్ వరకు అనుమతించక పోయినప్పటికీ.. చార్మినార్ బాటిల్ నెక్ రోడ్డులో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లేకపోవడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. దీంతో వాహనదారులతోపాటు పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.