బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘోరం | Bangalore, Hyderabad, on his way from the worst | Sakshi
Sakshi News home page

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘోరం

Published Thu, Oct 31 2013 2:46 AM | Last Updated on Fri, Sep 28 2018 3:27 PM

Bangalore, Hyderabad, on his way from the worst

 

= మృత్యుశకటం...
 = 45 మంది సజీవ దహనం
 = మృతుల్లో 28 మంది బెంగళూరు వాసులు?
 = ఆహుతైన ప్రైవేట్ బస్సు
 = బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘోరం
 = ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్, మరో ఐదుగురు ప్రయాణికులు

 
 ప్రయాణపు అలసటతో కాస్తంత సేపు అలా కునుకుతీశారు. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరిపోతాం అనుకుంటూ ఆదమరిచి రెప్పలువాల్చారు. కానీ వాళ్లకేం తెలుసు.. తాము ప్రయాణిస్తున్న బస్సే మృత్యుశకటమై వాళ్లను కాటేస్తుందని.. తమను గమ్యస్థానాలకు చేరుస్తుందనుకున్న బస్సే చితిమంటలను రగిల్చి తమ నిండు జీవితాలను బుగ్గిపాలు చేస్తుందని... తెలతెల వారకుండానే తమ బతుకులు తెల్లారిపోతాయని... బుధవారం తెల్లవారుఝామున ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా పాలం గ్రామం వద్ద సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం 45 మంది జీవితాలను బలిగొని, వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కుటుంబాన్ని షోషించే పెద్దదిక్కును కోల్పోయిన  వారు ఒకరైతే, అనురాగాన్ని పంచే తల్లిని దూరం చేసుకున్న వారు ఇంకొకరు. ఇలా ప్రమాదంలో మరణించిన ఒక్కో వ్యక్తికి, ఒక్కో కుటుంబానికి ఒక్కో కన్నీటి గాధ, తీరని వ్యధ... వెరసి వారి జీవితంతో అదో కాళరాత్రిగా మిగిలింది.
 
సాక్షి, బెంగళూరు : బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైన సంఘటనలో 45 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా పాలంలో ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. వివరాలు... బెంగళూరుకు చెందిన షకీల్ జబ్బర్, జబ్బార్ ట్రావెల్స్ పేరుతో హైదరాబాద్, ముంబై,చెన్నై, కేరళాలోని తిరుచ్చి ప్రాంతాలకు 30 బస్సులను నడుపుతున్నారు. అందులో ఐదు బస్సులు ప్రతి రోజూ బెంగళూరు,  హైదరాబాద్ మధ్య సంచరిస్తున్నాయి.

రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు గంటకో బస్ చొప్పున జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు నగరం నుంచి బయలుదేరతాయి. ఇందులో భాగంగా ఈనెల 29 (మంగళవారం) రాత్రి 10 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కళాసిపాళ్య బస్టాండ్ నుంచి  ఓల్వో బస్సు (ఏపీ 02టీఏ 0963) హైదరాబాద్‌కు బయలు దేరింది.

ఈ బస్సు బెంగళూరులోని బీటీఎంలే అవుట్ వద్ద ప్రారంభమై కోరమంగళ, బెలందూర్, మారతహళ్లి, దొమ్మలూరు, కళాసిపాళ్య, ఆనందరావ్‌సర్కిల్, మైత్రివనం, హెబ్బాల్ వద్ద మొత్తం 44 మంది ప్రయాణికులను ఎక్కించుకుని సరిగ్గా రాత్రి 10:30 గంటలకు బెంగళూరు నగరాన్ని వీడింది. ఈ బస్సు హైదరాబాద్‌కు బుధవారం ఉదయం సుమారు 6:30 గంటలకు చేరాల్సి ఉంది. అయితే  తెల్లవారుఝామున 5.25 గంటల సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా పాలం గ్రామం వద్దకు చేరుకోగానే బస్సు ప్రమాదానికి గురైంది.  క్షణాల్లో బస్సులో మంటలు వ్యాపించడంతో... అందులోని 45 మంది సజీవదహనమయ్యారు.
 
మృతుల్లో దాదాపు 28 మంది వరకు బెంగళూరుకు చెందిన వారు కాగా, మిగతా వారు ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాల నుంచి జీవనోపాధికి నగరానికి వచ్చిన వారిగా తెలుస్తోంది. కాగా మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన అజ్మతుల్ల, అతని భార్య జబీన్‌తాజ్ వీరి ఐదేళ్ల కుమార్తె ఉన్నారు.  కాగా ఈ దుర్ఘటన నుంచి బెంగళూరుకు చెందిన డ్రైవర్ ఫైరోజ్,  కోలారుకు చెందిన క్లీనర్‌అయాజ్,  ప్రయాణికులు శ్రీకర్, యోగేష్, మజర్ భాష, జై సింగ్, రాజేష్ ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలతో బయటపడిన వీరికి వైద్య సేవలు అందిస్తున్నట్లు ట్రావెల్స్ యజమాని షకీల్ జబ్బర్ సోదరుడు జమీల్ జబ్బర్ బెంగళూరులో మీడియాకు వెల్లడించారు.

 ప్రమాదఘటనపై భిన్న వాదనలు...

 ఘటన గురించి తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ బెంగళూరు కళాసిపాళ్య వద్ద ఉన్న జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు. సంస్థ మేనేజర్ ఇంతియాజ్‌తో మాట్లాడి ఘటన వివరాలు తీసుకున్నారు. అనంతరం  ప్రమాద కారణాలను మీడియాకు వివరించారు. ‘బస్సు మహబూబ్‌నగర్ పాలం వద్దకు చేరుకోగానే వాహనం ముందు టైర్ పేలిపోవడంతో డ్రైవర్ వాహనాన్ని పక్కగా ఆపి ఆ విషయాన్ని వాహనం యజమాని షకీల్ నవాజ్ జబ్బర్‌కు తెలియజేశాడు. వాహనం పక్కగా నిలబడి డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతుండగానే పేలిన టైర్ నుంచి అగ్గిరవ్వలు వెలువడి సమీపంలో ఉన్న  డీజిల్ ట్యాంకర్‌పై పడ్డాయి. దీంతో బస్సు మొత్తం క్షణాల్లో తగలబడిపోయింది.’ అని వివరించారు.
 
అయితే ప్రమాదానికి మరో కారణం కూడా వినిపిస్తోంది....ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు డ్రైవర్ చాలా వేగంగా బస్సును నడుపుతూ ముందు వెలుతున్న కారును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించి అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. వేగంగా బస్ డివైడర్‌ను ఢీ కొట్టిన తక్షణమే ముందు టైర్ వెనకనే ఉన్న డీజిల్ ట్యాంకర్ కూడా డివైడర్‌ను బలంగా తాకింది. దీంతో డీజిల్ ట్యాంకర్ పేలిపోయి క్షణాల్లో బస్సు మొత్తం మంటల్లో తగలబడిపోయింది.  ఇక ప్రమాదం జరిగే సమయానికి ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్న కారణంగా అసలు ఏం జరుగుతోందనేది తెలిసేలోపే ప్రయాణికులందరూ మంటల్లో సజీవదహనమయ్యారు.  ఇక డ్రైవర్ క్లీనర్ కాస్తంత మెలకువలోనే ఉంటారు కాబట్టి ప్రమాదాన్ని గ్రహించి తమ పక్కనే ఉన్న అద్దాలను బద్దలుకొట్టుకొని బయటకు దూకేసినట్లు తెలుస్తోంది.
 
పరిహారం అందించలేమన్నకర్ణాటక ప్రభుత్వం

 బస్ ప్రమాదం ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం అందించలేమని కర్ణాటక సర్కారు తెలిపింది. ఈ విషయమై ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మాట్లాడుతూ... ఘనటకు సంబంధించి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డితో మాట్లాడానని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందిగా కోరానని చెప్పారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేఎస్‌ఆర్టీసీలో ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం తరఫున పరిహారం అందించడానికి వీలవుతుందని చెప్పారన్నారు.

అయితే బస్సుకు ఇన్సూరెన్స్ ఉండటం వల్ల సదరు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మృతుల కుటుంబాలకు రూ.4 నుంచి రూ.5 లక్షల పరిహారం అందించడానికి అవకాశం ఉందన్నారు. కాగా కర్ణాటక శాసనసభ ప్రతిపక్షనాయకుడు కుమారస్వామి మాత్రం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఘటనకు సంబంధించి దర్యాప్తు జరపడానికి రాష్ట్ర రవాణా శాఖలో  కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అమర్‌నారాయణ అనే సీనియర్ అధికారిని విచారణ అధికారిగా కర్ణాటక ప్రభుత్వం నియమించింది.
 
ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్...

 ప్రమాదానికి గురైన వోల్వో బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 2010, అక్టోబర్ 6న దివాకర్ రోడ్‌లైన్, జేసీ ఉమారెడ్డి పేరున రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. అయితే ఈ బస్సును బెంగళూరుకు చెందిన దివంగత సీఏ జబ్బర్ భార్య షాహీన్‌జబ్బర్, ఆయన కుమారులు షకీల్‌జబ్బర్, జమీల్‌జబ్బర్‌కు లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి జబ్బర్ ట్రావెల్స్ పేరుతోనే బెంగళూరుకు, హైదరాబాద్‌కు మధ్య బస్సు నడుస్తోంది. కాగా బస్సు లీజుకు ఇచ్చినట్లు డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తుంటే, జేసీ సోదరులు మాత్రం బస్‌ను తాము మూడేళ్ల క్రితమే అమ్మేశామని, బస్‌తో తమకేం సంబంధం లేదని అనడం గమనార్హం. అంతేకాకుండా దాదాపు రూ.1.70 కోట్లు విలువజేసే బస్సును లీజుకు ఇస్తే దానికి కనీసం సబ్‌రిజిస్ట్రేషన్  కార్యాలయంలో లీజును రిజిస్ట్రేషన్ చేయకుండా కేవలం నోటరీతో సరిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement