అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) భారీగా లాభాలు పొందుతున్నాయి. కానీ చమురు వినియోగదారులకు మాత్రం ఆ మేరకు వెసులుబాటు ఇవ్వడంలేదు. ఇప్పటికే ఆహార ధరలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గినమేరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు దాదాపు రూ.15, డీజిల్‌పై రూ.12 చొప్పున లాభాలను ఆర్జిస్తున్నాయని ఇటీవల ఇక్రా నివేదికలో తెలిపింది. ముడిచమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. మార్చి 15, 2024లో పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి క్రూడాయిల్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ అందుకు అనుగుణంగా చమురు ధరలు మాత్రం తగ్గించడంలేదు. దేశంలో ఇప్పటికీ పెట్రోలు లీటరుకు రూ.100, డీజిల్ రూ.90 పైనే ఉంది. ఈ ధరలు ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. రవాణా నుంచి విమానయానం వరకు, పరిశ్రమలు నుంచి సరుకుల వరకు రోజువారీ అవసరాలను ప్రభావితం చేస్తున్నాయి.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఓఎంసీల లాభాలు రూ.86,000 కోట్ల మేర నమోదైనట్లు ఇటీవల పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. గత సంవత్సరం కంటే ఇది 25 రెట్లు ఎక్కువగా ఉంది. హెచ్‌పీసీఎల్‌కు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,980 కోట్ల నష్టం వాటిల్లింది. అందుకు పూర్తి భిన్నంగా 2023-24లో సంస్థ రూ.16,014 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. పన్ను చెల్లింపు తర్వాత బీపీసీఎల్ లాభం రూ.26,673 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ.
ఇదీ చదవండి: డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ, భారతీయ వినియోగదారులకు ఇంధన ధరల్లో వెసులుబాటు కల్పించడంలేదు. మహారాష్ట్ర, హరియాణాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేలా ఓఎంసీలు ధరలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా చమురు తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment