ఆ బస్సు ‘జేసీ’లదే! | Burnt Volvo Bus Belongs to JC Diwakar Travels | Sakshi
Sakshi News home page

ఆ బస్సు ‘జేసీ’లదే!

Published Thu, Oct 31 2013 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM

ఆ బస్సు ‘జేసీ’లదే!

ఆ బస్సు ‘జేసీ’లదే!

కాగితాలపై మాత్రమే ‘జబ్బార్ ట్రావెల్స్’  
ఇప్పటికీ పర్మిట్లు తదితరాలు ‘దివాకర్’ పేరిటే

 
సాక్షి నెట్‌వర్క్: 45 నిండు ప్రాణాలను బలిగొన్న ఓల్వో బస్సు యజమాని ఎవరన్నది వివాదంగా మారింది. బస్సుపై జబ్బార్ ట్రావెల్స్ పేరు రాసి ఉన్నా, దాని అసలు యాజమాన్యం, అజమాయిషీ మాత్రం పూర్తిగా మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిలవేనని తెలుస్తోంది. బస్సుకు సంబంధించిన పర్మిట్లు, పన్ను చెల్లింపులు తదితరాలన్నీ ఇప్పటికీ జేసీ సోదరులకు చెందిన దివాకర్ రోడ్ లైన్స్ పేరుతోనే జరుగుతుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. ప్రభాకర్‌రెడ్డి నడుపుతున్న దివాకర్ రోడ్ లైన్స్ ఈ బస్సును (ఏపీ02 టీఏ 0963) 2010లో ఆయన భార్య జేసీ ఉమారెడ్డి పేరుతో కొనుగోలు చేసింది. కర్ణాటక రవాణా శాఖ వెబ్‌సైట్లో కూడా బస్సు యజమానిగా ఇప్పటికీ ఆమె పేరే ఉంది.
 
ప్రమాదం గురించి తెలియగానే జేసీ బ్రదర్స్ ఉలిక్కిపడ్డారు. ప్రభాకర్‌రెడ్డి ఘటనా స్థలికి వచ్చి, బస్సును 2010లోనే జబ్బార్ ట్రావెల్స్‌కు విక్రయించామని చెప్పుకొచ్చారు. తమ ప్రతినిధులను కూడా హుటాహుటిన లక్డీకాపూల్ కార్యాలయానికి పంపించి లీజు అగ్రిమెంట్‌ను కూడా చూపించారు. మరి బస్సు ఇప్పటికీ మీ సంస్థ పేరిటే ఎందుకు నడుస్తోందన్న విలేకరుల ప్రశ్నకు, ఫైనాన్షియల్ సమస్య అంటూ పొంతన లేని సమాధానమిచ్చారు. పైగా వారు చూపిన లీజ్ ఒప్పందం కూడా మరిన్ని సందేహాలకు తావిస్తోంది. ఎందుకంటే 2010 అక్టోబర్ 10న ఒప్పందం కుదుర్చుకున్నట్టు దానిపై రాసి ఉంది. కానీ సదరు బాండ్ పేపర్‌ను మాత్రం 2010 డిసెంబర్ 8న కొనుగోలు చేసినట్టు దానిపై ఉన్న తేదీని బట్టి స్పష్టమవుతోంది! 2010 డిసెంబర్ 8న కొన్న బాండ్ పేపర్‌పై అక్టోబర్ 10న ఒప్పందం చేసుకోవడం ఎలా సాధ్యమో జేసీ సోదరులకే తెలియాలి. అసలు జబ్బార్ ట్రావెల్స్ సంస్థే జేసీ సోదరుల బినామీ సంస్థేనంటున్నారు. పలు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు గతంలో చాలాసార్లు ఇదే విషయం చెప్పాయి కూడా. జేసీ సోదరుల కనుసన్నల్లో రవాణా మాఫియా నడుస్తోందని అవి ఆరోపించాయి.
 
 పైగా ఒకే నంబర్‌తో పలు బస్సులను నడుపుతున్నట్టు దివాకర్ ట్రావెల్స్‌పై ఇప్పటికే చాలా ఫిర్యాదులున్నాయి. ఇది రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో 200కు పైగా బస్సులు నడుపుతోంది. జేసీ సోదరుల రాజకీయ పలుకుబడి, ఫ్యాక్షన్ నేపథ్యం, వారిచ్చే మామూళ్ల కారణంగా రవాణా శాఖ అధికారులు వాటిని తూతూమంత్రంగా మాత్రమే తనిఖీ చేస్తారని చెబుతారు. బుధవారం 45 మందిని పొట్టన పెట్టుకున్న వోల్వో బస్సును ఎన్‌హెచ్-44పై అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని రవాణా శాఖ చెక్‌పోస్టులో మంగళవారం అర్ధరాత్రి సరిగా తనిఖీ చేయలేదని రవాణా శాఖ అధికారులే చెబుతున్నారు. చెక్‌పోస్టు వద్ద డ్యూటీలో ఉన్న ఎంవీఐ వై.ప్రసాద్ దాన్ని తనిఖీయే చేయలేదు. బుధవారం ఉదయం ప్రమాద వార్త తెలియగానే.. బస్సును తనిఖీ చేసినట్లు మూవ్‌మెంటు రిజిస్టర్‌లో హడావుడిగా చేర్చారని రవాణా శాఖ అధికారులే అంటున్నారు. దీనిపై ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తనిఖీ చేశానని, అప్పుడు 46 మందే ఉన్నారని చెప్పుకొచ్చారు.
 
 చిన్న విషయమది: ప్రభాకర్‌రెడ్డి
 బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని ‘ఓ చిన్న విషయం’గా జేసీ ప్రభాకర్‌రెడ్డి తీసిపారేశారు. ఇలాంటివి జరగడం, జరగకపోవడం అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని ఘటనా స్థలి వద్ద వ్యాఖ్యానించారు! ‘‘ప్రమాదంలో డ్రైవర్ తప్పిదం కన్పించడం లేదు. కల్వర్టును రోడ్డుపైకి కట్టిన అధికారులదే తప్పు. ఈ బస్సు ఇండియాది కాదు, స్వీడన్‌లో తయారైంది. రూ.1.20 కోట్లకు కొన్నాం. ఇంత మంచి బస్సు అయ్యుండీ ప్రమాదం జరిగింది. దానికి మనమేం చేస్తాం? ’ అని చెప్పుకొచ్చారు. కాగా, ప్రమాదానికి గురైన బస్సు జబ్బార్ ట్రావెల్స్‌కు సంబంధించింది కాదని, దివాకర్ ట్రావెల్స్‌దేనని ప్రమాదంలో మరణించిన అక్షయ్‌సింగ్ బాబాయ్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ సుధాకర్ ఆరోపించారు.
 
 ఇదెక్కడి గ‘లీజు’
 సాక్షి, హైదరాబాద్: అక్టోబర్‌లో చేసుకున్న లీజు ఒప్పందం డిసెంబర్‌లో కొన్న స్టాంపు పేపరుపై రాయడం సాధ్యమేనా? వేరొకరికైతే కాదు కాని... దివాకర్ ట్రావెల్స్‌కు మాత్రం ఇది సాధ్యమే. ప్రమాదానికి గురైన బస్సును 10.10.2010న జబ్బార్ ట్రావెల్స్‌కు లీజుకు ఇచ్చినట్లు ఒప్పందం రాసుకున్నారు. దీన్ని అదే తేదీన నోటరీ చేయించారు. అయితే ఈ ఒప్పందం రాసుకున్న స్టాంప్ పేపర్ మాత్రం విక్రేత వద్ద 8.12.2010న కొన్నట్లు ఉంది. ఇదే అనుమానాలకు తావిస్తోంది.

డిసెంబర్ విక్రయించిన స్టాంప్ పేపర్‌పై... దానికి రెండు నెలల ముందు అక్టోబర్‌లో లీజు ఒప్పంద పత్రం రాసుకోవడం ఎలా సాధ్యమో దివాకర్ ట్రావెల్స్ చెప్పాలి. అలాగే ఒకసారి ఈ బస్సును (ఏపీ 02 టీఏ 0963) జబ్బార్ ట్రావెల్స్‌కు లీజుకిచ్చామని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి... తర్వాత దాన్ని తాము అమ్మివేశామని, అయితే యాజమాన్య బదిలీ జరగలేదని మరోసారి చెప్పడం కూడా సందేహాలకు తావిస్తోంది. గడిచిన మూడేళ్లుగా ఈ బస్సుకు కడుతున్న పన్నులన్నీ దివాకర్ ట్రావెల్స్ పేరిటే చెల్లించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement