తాడిపత్రి: ఒకప్పుడు ఇంట్లో కూర్చొనే కనుసైగలతో జిల్లా రాజకీయాలను శాసించిన జేసీ సోదరుల రాజకీయ భవిష్యత్తు నేడు ప్రశ్నార్థకంగా మారింది. అహంకారం, నోటి దురుసు వారిని ఈ స్థాయికి తెచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారి తీరుతో వారసుల రాజకీయ భవిష్యత్తూ ప్రమాదంలో పడింది. జేసీ సోదరులు సుమారు 35 ఏళ్ల పాటు తాడిపత్రి నియోజకవర్గాన్ని కబంధ హస్తాల్లో ఉంచుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
వారి వైఖరితో విసిగి వేజారిన ప్రజలు 2019 ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు. వైఎస్సార్‌సీపీని ఆదరించి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయి. ఫలితంగా వైఎస్సార్‌సీపీకి మరింత ఆదరణ పెరిగింది. ఇటీవల కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంక్షేమ యాత్రకు విశేష జనాదరణ లభించడమే ఇందుకు నిదర్శనం. ఈ పరిణామాలు జేసీ బ్రదర్స్‌ను, వారి అనుచరులను అంతర్మథనంలో, ఆందోళనలో పడేశాయి.
సర్వేలోనూ వెనుకంజ?
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపై ఆ పార్టీ అధిష్టానం ఇటీవల సర్వే చేయించినట్లు తెలుస్తోంది. అందులోనూ జేసీ సోదరులు వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. మునిసిపల్ చైర్మగా పట్టం కట్టినా జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, అధికారులను టార్గెట్ చేస్తూ, నోటిదురుసుగా మాట్లాడుతూ పాలన కుంటుపడేలా చేశారన్న అంశం సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది.
జేసీ ప్రభాకర్‌రెడ్డి వల్ల టీడీపీకి నష్టమే కానీ, చేకూరే లాభం ఏమీలేదన్న విషయం వెల్లడి కావడంతో ఆ పార్టీ అధిష్టానం ప్రత్యామ్నాయ నాయకత్వంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో జేసీ సోదరులపై వరుసగా పోటీ చేసి ఓటమి పాలైన నాయకుడి వైపు చూస్తున్నట్లు సమాచారం. అతనికి టికెట్ కేటాయిస్తే కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందని, లేదంటే అదీ గల్లంతేనన్న భావన టీడీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.
దూరమవుతున్న కేడర్
జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారశైలిపై సొంత పార్టీ కేడర్‌లోనే అసంతృప్తి ఉంది. తన ఉనికి కోసం మాత్రమే పాకులాడే ఆయన్ను నమ్ముకుంటే తమకు నష్టమేనని కొందరు కౌన్సిలర్లు భావిస్తున్నారు. టీడీపీ సొంత సామాజిక వర్గం కూడా జేసీ వ్యవహారశైలిని తప్పుబడుతోంది. చివరకు అనుచరుల్లోనూ తీవ్ర నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జేసీ అనుచరుడు, పెద్దపప్పూరు మండల నాయకుడు రఘునాథ్‌రెడ్డి ఇటీవల వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు.
అలాగే కౌన్సిలర్ రాబర్ట్, అయూబ్ బాషా పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు ఇదేబాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఉలిక్కిపడిన జేసీ సోదరులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు తమ నివాసంలో విందు ఏర్పాటు చేసి బుజ్జగించినట్లు తెలిసింది. అయినప్పటికీ కేడర్ వారిని విశ్వసించడం లేదు.
వారసులకు నష్టం
జేసీ కుటుంబాన్ని నియోజకవర్గ ప్రజలు సుదీర్ఘ కాలం పాటు ఆదరించినప్పటికీ వారి ఇబ్బందులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. సరికదా ఏవైనా సమస్యలు చెప్పుకునేందుకు తమ వద్దకు వచ్చిన ప్రజలను నోటికి ఎంతొస్తే అంత మాట అనేవారు. చులకనగా, హేళనగా మాట్లాడేవారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే నియోజకవర్గంలో పర్యటించి హడావుడి చేసేవారు.
ఎన్నికల అనంతరం వ్యాపారాలకు పరిమితమయ్యేవారు. జేసీ బ్రదర్స్ అహంకారపూరితంగా, పెత్తందారీతనంతో వ్యవహరిస్తూ ప్రజలను నిర్లక్ష్యం చేసిన ఫలితంగా 2019 ఎన్నికల్లో వారి వారసులుగా బరిలోకి దిగిన జేసీ పవన్, జేసీ అస్మిత్‌రెడ్డిలను ఓడించి గట్టిగానే గుణపాఠం నేర్పారు. ఇప్పుడు కూడా వారసుల రాజకీయ ఎదుగుదలకు జేసీ సోదరులే ప్రతిబంధకంగా మారారన్న భావన తాడిపత్రి ప్రజల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment