చోటా డాన్‌ రజాక్, ఖాజాలకు జేసీ సోదరుల అండ ! | Matka Mafia In Anantapur District | Sakshi
Sakshi News home page

చోటా డాన్‌ రజాక్, ఖాజాలకు జేసీ సోదరుల అండ !

Published Sat, Oct 28 2023 8:24 AM | Last Updated on Sat, Oct 28 2023 1:01 PM

Matka Mafia In Anantapur District - Sakshi

జేసీ ప్రభాకర్‌రెడ్డితో చోటాడాన్‌ రజాక్, మకందర్‌ ఖాజా అలియాస్‌ లప్ప ఖాజా (ఫైల్‌)

తాడిపత్రిలో చీకటి మాటున మట్కా మాఫియా రాజ్యమేలుతోంది. ఒకప్పటి జూదరులు ఇప్పుడు బుకీలుగా అవతారమెత్తి చోటా మట్కా డాన్‌తో కలిసి అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. డబ్బు ఆశ చూపి వారిని రొంపిలోకి లాగుతున్నారు. అత్యాశకు పోయిన     సామాన్యులు జేబులకు చిల్లు వేసుకుంటున్నారు. 

తాడిపత్రి అర్బన్‌: మట్కా మహమ్మారి అంకెల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తోంది. మట్కా తగిలితే రూపాయికి రూ.80 ఇస్తామని ఆశ చూపిస్తోంది. దీంతో ఎంతోమంది కూలీనాలీచేసుకునే వారు, వ్యాపారులు, చిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు మట్కాను ఎంచుకుంటున్నారు. పోలీసులు మట్కాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా టీడీపీ నేతల అండదండలున్న నిర్వాహకులు తమ పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. కేరళ నుంచి వలస వచ్చి స్థిరపడిన వ్యక్తి ఈ ప్రాంతానికి మట్కాను పరిచయం చేశాడు. ఆ వ్యక్తి కుమారుడైన రషీద్‌ మట్కా పగ్గాలు చేపట్టాక అనతికాలంలోనే డాన్‌గా ఎదిగాడు. టీడీపీకి చెందిన జేసీ సోదరుల (మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి – మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి)ఆశీస్సులుండడమే ఇందుకు కారణమన్న విమర్శలు ఉన్నాయి.   

తెరపైకి చోటా డాన్‌ రజాక్‌ 
మట్కా డాన్‌ రషీద్‌ కరోనాతో మృత్యువాతపడ్డాక పట్టణంలో మట్కా కొన్నాళ్లు మరుగున పడింది. తన అన్న (ఎల్లో డాన్‌) వారసత్వాన్ని అబ్దుల్‌ రజాక్‌ కొనసాగించడంతో మట్కా తిరిగి పుంజుకుంది. గతంలో బళ్లారికి చెందిన రిజ్వాన్‌ను శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రిజ్వాన్‌ ఇచ్చిన సమాచారంతో ఎస్పీ టీం అప్పట్లో అబ్దుల్‌ రజాక్‌ను అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వినాయక్‌ మేత్రాని అనే మట్కా నిర్వాహకుడిని కూడా పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. 

అయితే రిజ్వాన్, వినాయక్‌ మేత్రాని అనే వీరిరువురు సౌత్‌ ఇండియాలోనే మట్కా కంపెనీల్లో నంబర్‌ వన్‌ షేర్‌హోల్డర్స్‌. వీరిలో రిజ్వాన్‌కు తాడిపత్రికి చెందిన అబ్దుల్‌ రజాక్‌ మట్కా పట్టీలు ఇచ్చేవాడని అప్పట్లో పోలీసులు గుర్తించారు.     టీడీపీకి చెందిన మరో మట్కా డాన్‌ మకందర్‌ ఖాజా అలియాస్‌ లప్ప ఖాజా కుటుంబం మొత్తం తాడిపత్రిలో మట్కా పురుడు పోసుకున్నప్పటి నుంచి మట్కా నిర్వహిస్తుండడం విశేషం. వీరి కుటుంబంలో మహిళలే మట్కా నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. ఇటీవల మకందర్‌ ఖాజా తండ్రి మునీర్‌బాషాతో పాటు ఖాజా సతీమణి షేక్‌ నూరీని అరెస్టు చేశారు.  

పోలీసులనే టార్గెట్‌ చేసి.. 
తాడిపత్రి పచ్చ మట్కా మాఫియాలో కీలక సూత్రధారి రషీద్‌ సోదరుడు అబ్దుల్‌ రజాక్‌ను కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మట్కాను పూర్తిస్థాయిలో ఆపాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అబ్దుల్‌ రజాక్‌ కుటుంబం ఏకంగా పోలీసులనే టార్గెట్‌ చేసింది. సీఐ హమీద్‌ఖాన్‌ తమను వేధిస్తున్నాడంటూ మొసలి కన్నీరు కార్చింది.   

తెరవెనుక ‘పచ్చ’ కుట్ర 
మట్కా మాఫియాను ఇన్నాళ్లూ పెంచి పోషించిన ‘పచ్చ’ నేతలకు అర్బన్‌ సీఐ హమీద్‌ఖాన్‌ చర్యలు మింగుడుపడడం లేదు. ఈయన ఉంటే తమ ఆటలు సాగవని భావించిన ‘పచ్చ’ నేతలు బురదజల్లేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చోటా డాన్‌ అబ్దుల్‌ రజాక్‌ భార్యతో పోలీసు శాఖలోని కీలక అధికారులపై ఆరోపణలు చేయిస్తున్నారు. మానవ హక్కుల సంఘం, ప్రైవేటు కేసుల పేరుతో పోలీసులను బ్లాక్‌మెయిల్‌ చేసి మట్కాను సాగించాలని పథకం రచిస్తున్నారు. 

మట్కారాయుళ్లపై కొరడా 
ఎన్నడూ లేని విధంగా తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లపై కొరఢా ఝళిపిస్తున్నారు. అర్బన్‌ సీఐగా పి.హమీద్‌ఖాన్‌ బాధ్యతలు      స్వీకరించిన తర్వాత మట్కాపై ఉక్కుపాదం మోపారు. పట్టణంలో మట్కా ఎవరు నిర్వహిస్తున్నారన్న దానిపై ఆరా తీసి వారికి ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోని వారిని జిల్లా  నుంచి బహిష్కరించేందుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్‌ గౌతమి ఉత్తర్వుల మేరకు మట్కా నిర్వాహకులు      బుక్కపట్నం శివకుమార్, చుక్కలూరు చాంద్‌బాషా, మక్తుం పాల మాబు, దూదేకుల కుళ్లాయప్ప, ఉదయగిరి మాబున్నీ, దిగువపల్లి పుల్లయ్య,   తుంగ రామాంజులరెడ్డిలపై ఆరు నెలల పాటు జిల్లా బహిష్కరణ వేటు వేశారు.  

ఆన్‌లైన్‌లో మట్కా  
సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్వాహకులు మట్కాను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.         కొందరు మట్కా నిర్వాహకులు స్వయంగా యాప్‌ డెవలపర్స్‌.. మిలాన్‌డే, మిలాన్‌ నైట్‌ పేర్లతో ప్రత్యేక వెబ్‌సైట్లు రూపొందించి యాప్‌ల ద్వారా అండ్రాయిడ్‌ ఫోన్లకు లింక్‌లను పంపి గుట్టుగా మట్కా నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను సదరు ఆండ్రాయిడ్‌ యూజర్‌ రూ.10 వేలు నగదు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్‌దారుకు ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. ఆ పాస్‌వర్డ్‌ ఉపయోగించి మట్కా నిర్వహించుకోవాలి. రూ.100కు రూ.8వేలు చెల్లిస్తామంటూ        అమాయకుల బతుకులను నాశనం చేస్తున్నారు.    

ఉపేక్షించేది లేదు 
మట్కా విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నేను బాధ్యతలు తీసుకున్నాక ఇప్పటి వరకు మట్కా స్థావరాలపై దాడులు జరిపి, 33 కేసులు నమోదు చేశాం. మట్కా, గ్యాంబ్లింగ్‌ను కూకటివేళ్లతో పెకలించాలని సీఐ, ఎస్‌ఐలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఆన్‌లైన్‌ మట్కాను కూడా నిర్మూలిస్తాం. 
– సీఎం.గంగయ్య, డీఎస్పీ, తాడిపత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement