తాడిపత్రి రూరల్ పీఎస్‌లో డీఎస్పీ, సీఐతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి (ఫైల్)
ఆయనో మాజీ ఎమ్మెల్యే. పలు కేసుల్లో నిందితుడు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు కోకొల్లలు. అడ్డొస్తే భయపెట్టడం.. ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేందుకూ వెనుకాడని అనుచరగణం. అధికారం అండతో పోలీసులను ఆయన తన గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం సాగించాడు. బాధితులు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కినా.. కనీసం కేసు తీసుకునే ధైర్యం కూడా పోలీసులు చేయలేకపోయారు. ఉన్నతాధికారుల చొరవతో కొన్ని కేసుల్లో కేసు నమోదు చేసినా.. చర్యలు కాగితాలకే పరిమితం. ఇప్పటికీ ఆయన దర్జాగా పోలీసుస్టేషన్‌కు వచ్చిపోతున్నా ప్రశ్నించేందుకు జంకుతున్న పోలీసులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. పైగా రాచమర్యాదలు చేస్తున్న తీరుతో ‘చట్టం తన పని తాను చేసుకుపోతుందనే’ మాటలకు అర్థం లేదనే విషయం ఇట్టే అర్థమవుతోంది. – తాడిపత్రి
సాక్షి, తాడిపత్రి : అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేయని అక్రమాలు లేవు. అక్రమ రవాణా నుంచి పరిశ్రమల నిర్వాహకులను బెదిరించి ముడుపులు తీసుకోవడం దాకా.. అన్నింట్లోనూ రౌడీయిజమే. అధికారులెవరైనా ప్రశ్నిస్తే.. ప్రాణాలే తీస్తానంటూ హెచ్చరిస్తారు. అందుకే తాడిపత్రి నియోజకవర్గంలోని అధికారులు, పోలీసులంతా ప్రాణాలు గుప్పిట్లో బతుకుతున్నారు. అయితే ఇటీవలే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం అవినీతి, అక్రమాలు, గుండాయిజానికి చరమగీతం పాడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు నూతన ఎస్పీ సత్యయేసుబాబు కూడా అసాంఘిక శక్తులకు అండగా నిలిస్తున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడాలు లేకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించుటలో సక్సెస్ అవుతున్నారు. కాకపోతే ఇప్పటికే పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఏకపక్షంగా పోలీసుల చర్యలు
2019 ఏప్రిల్ 11న పోలింగ్ సందర్భంగా తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో ఓవ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేయగా...పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నిందితుడైన వైఎస్సార్ సీపీ నాయకుడు వంశీమోహన్‌రెడ్డి సోదరుడైన ఏడీసీసీ బ్యాంకు మేనేజర్ వై.అనిల్‌కుమార్ కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇటీవల ఆయన విధులకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన జేసీ వర్గీయులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అనిల్‌కుమార్‌రెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు చేశాడు.
అయితే గతంలో ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నేరుగా పోలీసు స్టేషన్‌కే వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఎస్పీ సత్యయేసుబాబు తాడిపత్రి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వారు వెంటనే అనిల్‌కుమార్‌రెడ్డి అరెస్టు చేశారు. కానీ అదే ఘటనకు సంభందించిన వైఎస్సార్సీపి నేతలు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినా...పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయలేదు. అనిల్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులోనూ మాజీ ఎమ్మెల్యే జేసీపై (క్రైం నంబర్ 182/2019) కేసు నమోదు చేసినప్పటికీ అరెస్టు చేయలేదు.
రూరల్ పీఎస్ ఆవరణలో అనుచరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే, చిత్రంలో డీఎస్పీ, సీఐలు (ఫైల్)
జేసీ పోలీసు స్టేషన్‌కే వచ్చినా...
తాజాగా శనివారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి, సీఐ సురేష్‌బాబుతో చర్చింది తాపీగా వెళ్లిపోయారు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది....చట్టం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
మహిళా ఉద్యోగిపై జేసీ రుబాబు
2014 జూన్‌లో పట్టణంలోని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్‌గా ఎల్.మంజుల భాద్యతలు తీసుకున్నారు. వెంటనే మొండి బకాయిల వసూళ్లలో భాగంగా రుణాలు చెల్లించని వారికి నోటీసులను జారీ చేశారు. నోటీసులందుకున్న వారిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులే ఎక్కువగా ఉండగా...వారి తరఫున జేసీ ప్రభాకర్‌రెడ్డి బ్యాంకు చీఫ్ మేనేజర్ మంజులతో చర్చించారు. కాస్త చూసీచూడనట్లు వె?ళ్లాలనన్నారు...అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆయనలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. తన మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఈ క్రమంలోనే 2014 సెప్టెంబర్ 14న సీబీ రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎంను తన అనుచరులతో మూసివేయించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి...ఆ గది తాళాలు తీసుకొనివెళ్లారు. విషయం తెలుసుకున్న బ్యాంకు చీఫ్ మేనేజర్ మంజుల తన సిబ్బందిని వెంటబెట్టుకుని ఎమ్మెల్యే జేసీపీఆర్ ఇంటి వెళ్లగా... ఆయన నానా దుర్బాషలాడాడు. కిందిస్థాయి సిబ్బంది ముందే మహిళా ఉద్యోగి అని చూడకుండా దూషించి అసభ్యకరంగా ప్రవరించారు. దీనిపై బ్యాంకు మేనేజర్ మంజుల పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కట్టలేదు.
► 2015లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏడీగా పనిచేసిన ప్రతాప్‌రెడ్డి గ్రానైట్ అక్రమ రవాణా, జీరో వ్యాపారంపై ఉక్కుపాదం మోపారు. ఏడాదికి రూ.1.5 కోట్లు మాత్రమే వచ్చే ప్రభుత్వ ఆదాయాన్ని రూ.7 కోట్ల వరకు తీసుకెళ్లారు. దీంతో ప్రతాప్‌రెడ్డిపై జేసీ సోదరులు కన్నెర్ర చేశారు. అయినా ఆయన ఖాతరు చేయకపోవడంతో.. చంపేస్తామని బెదిరించారు. అప్పట్లో ఏడీ ప్రతాప్‌రెడ్డి.. తనకు ఎస్వీ రవీంద్రారెడ్డి(పొట్టి రవి)తో ప్రాణహాని ఉందని ఉన్నతాధికారులకు, పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై నేటికీ కనీస విచారణ లేదు.
► 2017 జూన్ 28న చిన్నపొలమడ సమీపంలోని ప్రభోదానంద స్వామి ఆశ్రమంలో అదనపు కట్టడాల కోసం అన్ని అనుమతులతో ఇసుకను తరలిస్తుండగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకున్నారు. నిర్వాహకులను కులం పేరుతో దూషించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఇసుకను తరలిస్తున్న వాహనాలను ఆయనే పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ ఘటనపై లారీ డ్రైవర్ దాసరి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులంపేరుతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితుడు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా.. జేసీ పీఆర్‌పై కేసు నమోదు చేయాలని పెద్దపప్పూరు పోలీసులను కమిషన్ ఆదేశించింది. ఆ మేరకు జూలై 3న జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ(క్రైం నెంబర్:94/2017) కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోని పరిస్థితి.
► ఇటీవల ఏడీసీ బ్యాంకు మేనేజర్ అనిల్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో కుట్రదారునిగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై రూరల్ పోలీసు స్టేషన్‌లో (క్రైం నెంబర్: 182/2019) కేసు నమోదైంది. అయినప్పటికీ పోలీసులు ఆయన్ను కనీసం ప్రశ్నించలేదు.
కోర్టు ఉత్తర్వులు అమలు చేయని వైనం
బ్యాంకు మేనేజర్ తనపై కేసు పెట్టారని తెలుసుకున్న అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కేసును తప్పుదోవ పట్టించేందుకు 2014 సెప్టెంబర్ 15న తన అనుచరులతో పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తనకు మద్దతుగా పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులచేత బలవంతంగా ర్యాలీ చేయించారు. ఈ కేసులో కోర్టు సమన్లు జారీ చేయాలని ఆదేశించినా పోలీసుల్లో చలనం లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment