అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ప్రైవేట్ ఓల్వో బస్సు దుర్ఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు వరుస దాడులతో తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ప్రైవేట్ బస్సుల యజమానులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురంలోని ఆర్టీఏ కార్యాలయం వద్దకు ప్రైవేట్ బస్సుల యజమానులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు బస్సులతో పాటు వచ్చి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ బస్సుల యజమాని మునిరత్నం శ్రీనివాసులు మాట్లాడుతూ.. తలనొప్పి వస్తే.. వైద్యుడు తల తీసేయడని పేర్కొన్నారు. పాలెం దుర్ఘటన అనంతరం ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూపి, ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా బస్సులను సీజ్ చేయడం అన్యాయమన్నారు. ఫైనాన్స్ కంపెనీలకు కంతులు కట్టలేక, సిబ్బందికి వేతనాలు చెల్లించలేక యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కర్ణాటకలోని హావేరి జిల్లాలో కూడా మరో ప్రమాదం జరిగిందని, అయితే అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను ఇలా సీజ్ చేయలేదని చెప్పారు. గతంలో విమాన ప్రమాదాలు కూడా జరిగాయని, మరి విమానాలను సీజ్ చేశారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏవైనా సూచనలు, సలహాలు చేస్తే వాటిని ఆచరిస్తామని హామీ ఇచ్చారు. అలా కాకుండా దాడులు చేస్తే ఉద్యమాలతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. అనంతరం బస్సుల యజమానులు రవాణా శాఖ ఉప కమిషనర్(డీటీసీ) ప్రతాప్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రతాప్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు దాడులను ఆపేది లేదని స్పష్టం చేశారు.
ప్రైవేటు వేయొద్దు ‘అనంత’ ఆర్టీఏ
Published Tue, Jan 28 2014 4:14 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement