'దెబ్బలు తినటమే కాదు.. తిరిగి కొట్టడానికి సిద్ధమే'
విజయవాడ : త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో వామపక్షాలదే పైచేయి కానుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. శుక్రవారం విజయవాడలో ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలసి కె నారాయణ విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ పేరుతో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో అక్కడ స్థానిక ప్రజలు స్వేచ్ఛ వచ్చినట్లు భావిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు.
కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందని ఎద్దేవా చేశారు. అలాగే పశ్చిమబెంగాల్‌లో కూడా మమతాబెనర్జీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ, అసోంలలో బీజేపీ పరిస్థితి పైన పటారం, లోన లొటారంలా ఉందని వ్యాఖ్యానించారు. మతోన్మాద పోరాటం ద్వారానే రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే ఆ పార్టీ నాయకత్వం దాడులకు పూనుకుంటోందని ఆరోపించారు.
వామపక్షాలు ప్రధాన శత్రువుగా తయారవుతున్నాయనే దాడులు చేయిస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. అయితే, దెబ్బలు తినటానికి కాదు.. తిరిగి కొట్టడానికైనా తాము సిద్ధమని ప్రకటించారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చివరికి విద్యార్థులుపైన కూడా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
యూనివర్సిటీలపై దృష్టి పెట్టిన విద్యార్థి సంస్థ ఏబీవీపీ.... తన ప్రాబల్యం పెంచటానికి ఇతర సంఘాలపై దాడులు చేస్తోందని విమర్శించారు. జేఎన్యూ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ వాస్తవాలు చెబుతుంటే... ఎందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కన్నయ్యపై దాడులకు ఢిల్లీ నుంచే పథకం రచిస్తున్నారని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.
హెచ్‌సీయూ వీసీ అప్పారావు నియామకం కూడా కుట్ర పూరితమేనన్నారు. అమరావతి డిజైన్ చేసిన వారికి లక్ష డాలర్లు ఇవ్వటం సమంజసం కాదని రామకృష్ణ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక విధానంలో ఎమ్మెల్యేలు అక్రమ సంపాదన చేస్తున్నారని ఆరోపించారు. క్యాంపు కార్యాలయం ఐదు కిలోమీటర్ల దూరంలో ఇసుక దందా జరుగుతుంటే ఏమీ చేయలేకపోతున్నారని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.