అజయ్‌భవన్‌కు కొండంత అండ | condolance to AB Bardhan by k. narayana | Sakshi
Sakshi News home page

అజయ్‌భవన్‌కు కొండంత అండ

Published Sun, Jan 3 2016 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

అజయ్‌భవన్‌కు కొండంత అండ

అజయ్‌భవన్‌కు కొండంత అండ

నివాళి
 
‘ఏమిటిలా నిరుత్సాహపరిచావ్? నీవు కేంద్రానికి వచ్చి జాతీయ స్థాయిలో పని చేస్తావని అంతా ఆశించాం!’ అన్నారు ఏబీ బర్దన్ గారు (సెప్టెంబర్ 24, 1924- జనవరి 2, 2016). గడచిన నవం బర్ నెలాఖరున నేను కేంద్ర కార్య వర్గ సమావేశాలకి  ఢిల్లీ వెళ్లిన ప్పుడు నన్ను చూడగానే బర్దన్ గారు అన్నమాట ఇదే.

నిజానికి ఆయనే నన్ను తీవ్రంగా నిరుత్సాహ పరిచారు. ఆయన ఆదేశించినట్టుగానే నేను ఢిల్లీకి మకాం మార్చడానికి నిర్ణయం తీసుకున్నాక, వారు అజయ్‌భవన్‌ను శాశ్వతంగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. నన్ను తన సొంతమనిషిని చేసుకుని చనువుగా అలా గదమాయించారాయన. అందులో ఒక ఆప్యాయత ఉంది. అంతేనా! నా మీద ఆయన పెట్టుకున్న నమ్మకం ఎలాంటిదో కూడా గమనించాను. తీరా నేను విషయం గుర్తు చేశాక వెన్న లాగా కరిగిపోయారు. వెంటనే, ‘సరే కానీ!’ అంటూ ఆప్యాయంగా భుజం తట్టారు.

పాండిచ్చేరి మహాసభలో నాకు కేంద్ర బాద్యతలు అప్పగిం చారు. ఆ మహాసభ ఆదేశం మేరకు నేను ఢిల్లీకి మకాం మార్చాలి. తీసుకున్న బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తేనే మనిషికి సంతృప్తి. కానీ కార్యదర్శిగా ఉండగా, తీసుకున్న ఒక బాధ్యతను అసంపూర్తిగా వదలి నూతన నాయకత్వం మీద భారం పడేసి పోవడానికి నా మనసు అంగీకరించలేదు. వాస్తవంగా ఆ బాధ్య తలను పూర్తి చేయడానికి ఆచరణలో అనేక సమస్యలు ఎదురై నాయి. దానితో  నేను హైదరాబాద్‌లోనే ఉండవలసి వచ్చింది. దాని ఫలితమే కేంద్రంలో నాకప్పగించా లనుకున్న బాధ్యతలను స్వీకరించలేకపోయాను.

తరువాత నేను బిహార్‌లో అప్పుడు జరిగిన ఆ  రాష్ర్ట పార్టీ సమావేశాలకు బయలుదేరాను. ఎక్కడికీ ప్రయాణం అనడిగారు బర్దన్. బిహార్‌కని చెప్పగానే ఎంతో ఆనందించి,వెళ్లి రమ్మని సైగ చేశారు. బిహార్ నుంచి తిరిగి వచ్చే లోపుననే  మాటామంతీ లేకుండా ఆస్పత్రిలో  మంచం మీద అలా అచేతనంగా కనిపించారు. ఒక్కసారైనా పలకరించలేకపోతామా అని చివరి దాకా ఎదురుచూశాను. చివరికి నిరాశనే మిగిల్చారు. మమ్మ ల్నందరినీ విడిచి నిర్దయగా నిష్ర్కమించారు కామ్రేడ్ బర్దన్.

వామపక్ష ఉద్యమానికి తలమానికం బర్దన్. పదవీ విరమణ చేశారు గానీ, శక్తి మేరకు కొన్ని బాధ్యతలను నిర్వహిస్తూనే ఉన్నారు. అనారోగ్యం పాలు కాగానే వారి అమ్మాయి అల్క వారి ఇంటికి తీసికెళ్లి బాగోగులు చూసు కోవడానికి ప్రయత్నించారు. అల్కా అహ్మదాబాద్‌లో పేరెన్నిక గన్న డాక్టరు. ఆమె భర్త సమీర్ బారువా ఐఐఎం డెరైక్టర్. అక్కడే వింత సమస్య ఎదురైంది. బంధువులు ఎవరు వచ్చి పలకరించినా స్పందించేవారు కాదట. బర్ధన్ కుమారుడు సాహిల్ గుర్‌గావ్‌లో వ్యాపారస్తుడిగా స్థిరపడ్డారు. మరో కుమారుడు అశోక్ రష్యాలో ఫిజిక్స్, మ్యాథ్స్ లలో ఎంఎస్ చేసి ఆ తర్వాత అమెరికాలోని బర్క్‌లీ యూని వర్సిటీలో అర్ధశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి పలు గ్రంథాలు రచించారు.

కుటుంబసభ్యులు అప్పుడప్పుడు వచ్చి బర్ధన్‌ను కలవడమే తప్ప వారి దగ్గరకు ఆయన వెళ్లింది లేదు. న్యూఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయం అజయ్‌భవనే 2006 వరకూ ఆయన నివాసగృహం. ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాక పార్టీ ఎంపీకి చెందిన క్వార్టర్స్‌కి మారారు. తన కుమార్తె ఇంట సకల  సౌకర్యాలూ ఉన్నా ఏమీ లేని వారిగా, పార్టీ కార్యాల యంలో పరిమిత సౌక ర్యాలే ఉన్నా అక్కడే ఆయన ఎంతో ఆనందంగా, తృప్తిగా గడపడం గమనించాం. చివరికి తనకు సుతరామూ ఇష్టం లేకున్నా, తండ్రి ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉంచుదామని నిర్ణయించుకున్న వారి కుమార్తె ఆయనను ఢిల్లీకే పంపించేశారు. శేష జీవితాన్ని కమ్యూనిస్ట్ కుటుంబంతోనే గడపాలని ఆయన దృఢంగా కోరుకున్నారు. ఇది నిశ్చయం.

కార్యకర్తలతో ఆయన వ్యవహారసరళి ఆదర్శనీయంగా ఉండేది. చురుకైన కార్యకర్తలు తొందరపాటు పనులు  చేసినా ఆప్యాయంగా మందలించే వారే తప్ప కోపగించుకొనేవారు కాదు. నాపైన కూడా  ఒకటి రెండు దఫాలు వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ మందలింపు, విమర్శ కార్యకర్తను ముందుకు నడిపించేదిగా ఉండేది. అజయ్‌భవన్లో బర్దన్ ఉంటేనే పార్టీకి కొం డంత అండ. ఆయన వెన్నలాంటి మనసు కలిగిన కఠినాత్ముడు. బర్దన్‌గారు భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆ గంభీరస్వరం, ఆత్మీయ స్పర్శ, ఆప్యాయత నిండిన పలకరింపు మనతోనే ఉంటాయి. బర్దన్ గారి జీవితం ప్రజాస్వామ్యానికి, సెక్యుల రిజానికి, సోషలిస్ట్ వ్యవస్థ స్థాపనకు అంకితమైంది. ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచి ఉండే ఆ విప్లవమూర్తికి ఇదే శ్రద్ధాంజలి.

కళాహృదయుడీ కామ్రేడ్
తీరిక లేకుండా సదా ఉద్యమాల్లో పాల్గొనే బర్దన్‌కు కవిత్వ మన్నా, పాటలన్నా ప్రాణం. ఏ కొంచెం ఖాళీ దొరికినా ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వాన్నీ, మహ్మద్ రఫీ పాటల్ని వినడానికి ఇష్టపడేవారు. ఇక్బాల్ బానో రాసిన ‘హమ్ దేఖేంగే...’ గీతమైతే ఆయన నోట్లో నానేది. సాహిర్ లుధ్యాన్వి, కైఫీ ఆజ్మీ వంటి మహాకవులు పార్టీలో ఉండేవారని ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. మహా రాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించి అక్కడే ట్రేడ్ యూనియన్ రంగంలో చురుగ్గా పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీలోకి ప్రవేశించారు.

2004లో తొలిసారి యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వామ పక్షాలు దానికి మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో ఆయన తరచు మన్మోహన్‌సింగ్‌తో మాట్లాడేవారు. అయితే మన్మోహన్‌పై ఆయనకంత సదభిప్రాయం లేదు. దేశాన్ని అమెరికాకు సన్నిహితం చేయడమే ఆయన ఎజెండా అని అనేవారు. చిత్రంగా తనకు మన్మోహన్‌కంటే వాజపేయి అంటేనే సదభిప్రాయం ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఆర్ధిక, విదేశీ వ్యవహారాల్లో కాంగ్రెస్, బీజేపీల విధానాలు ఒకటేనని భావించేవారు.
 
- కె.నారాయణ
వ్యాసకర్త సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు. మొబైల్ : 9490952222

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement