AB Bardhan
-
ఒకే జెండాకు అంకితం
కొత్త కోణం చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావు, తరిమెల నాగిరెడ్డి వంటి వారు తమ కుటుంబం, ఆస్తి, ఐశ్వర్యాలకన్నా పార్టీకీ, ప్రజలకూ, ఉద్యమాలకూ అంకితమై పనిచేశారు. గత కొంతకాలంగా ఈ అంకిత భావం కొరవడిన ఫలితంగానే పశ్చిమ బెంగాల్, కేరళ వంటి కమ్యూనిస్టు కంచుకోటల నుంచి బీజేపీకి వలసలు పెరుగుతున్నాయి. ఇక్కడే ఏబీ బర్ధన్‌ను, ఆయన నిబద్ధతను, ప్రజలపై ఆయనకున్న విశ్వాసాన్ని స్మరించుకోవడం సముచితం. గతకాలపు అనుభవసారానికీ, మనకూ మధ్య దూరం పెరుగుతోందని తొలి తరం కమ్యూనిస్టు సిద్ధాంత నిబద్ధుడు, నిరాడంబరుడు ఎ.బి.బర్ధన్ మరణం గుర్తుచేస్తోంది. పదిహేనేళ్ల బాల్యం మినహా, ఏడున్నర దశాబ్దాల జీవితంలో తను నమ్మిన కమ్యూనిజాన్ని తుచ తప్పకుండా ఆచరించిన వ్యక్తి ఆయన. కమ్యూనిజాన్నీ, దాని ఆచరణలో కచ్చితత్వాన్నీ కూడా పాటించారు. ప్రజలే జీవితంగా బతికిన వ్యక్తి బర్ధన్. వ్యక్తిగత జీవితమే లేని వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ప్రజలంటే కేవలం మైదానప్రాంతాల్లో అన్ని అవకాశాలతో బతికేవారే కాదని, వారు మాత్రమే చరిత్ర గతిని మార్చారనుకోవడం తప్పని, అడవిబిడ్డల పోరాటాలను, ఉద్యమాలను మినహాయించరాదని ఆయన బలంగా విశ్వసించారు. తరతరాలుగా కులం పేరుతో వెలివేతకు గురవుతోన్న దళితుల త్యాగాలను మరువరాదని కూడా అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే ‘ఈ దేశ స్వాతంత్య్రం కోసం ప్రజలందరితోపాటు అడవుల్లో నివసించే ఆదివాసీలు కూడా రాజీలేని పోరాటం చేశారు. దేశంలోని సహజ వనరులు, జాతీయ సంపదగా ఉన్న బడ్జెట్లలో దళితులకూ, ఆదివాసులకూ వాటా కల్పించడం ప్రభుత్వాల బాధ్యతగా ఉండాలి. అంతేకానీ, దళితుల, ఆదివాసీల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ, వారిని మరింత దీనస్థితికి నెట్టివేస్తూ, దేశ ప్రగతి గురించి మాట్లాడటం వంచన తప్ప మరొకటి కాదు.’ ఆగస్టు 22-23; 2012 తేదీల్లో నాగ్‌పూర్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సమావేశాన్ని ప్రారంభిస్తూ బర్ధన్ అన్న మాటలివి. ఆయన అప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలగి సురవరం సుధాకర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న దశ. అయినప్పటికీ జాతీయ స్థాయిలో సబ్ ప్లాన్ చట్టం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి అనారోగ్యాన్ని సైతం లెక్కచేయక ఆయన ఢిల్లీ నుంచి నాగ్‌పూర్ వచ్చారు. ఆ సమావేశాలకు నేను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన కాకి మాధవరావు కూడా హాజరయ్యాం. సబ్‌ప్లాన్ ఆశయంగా... అప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కోసం జరుగుతున్న పోరాటం ఫలించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ సంవత్సరం డిసెం బర్‌లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు కోసం చట్టాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుపై ఒక జాతీయ సదస్సును కూడా నిర్వహించింది. ఆ సదస్సుకు ఆయన హాజరవుతారని ఎవరూ ఊహించ లేదు. ఆ సదస్సులో బర్ధన్ మాట్లాడిన తీరు, వెలిబుచ్చిన అభిప్రాయాలు, హాజరైన వారికి ఆయన అందించిన స్ఫూర్తి మరువలేనివి. ముఖ్యంగా మహా రాష్ట్రలో ఆదివాసీల ఉద్యమాల గురించీ, ఆ ఉద్యమాల్లో పాల్గొన్న ఆదివాసీ నాయకుల గురించీ ఆయన అందించిన వివరాలు ఉత్తేజాన్ని కలిగించాయి. దళితుల, ఆదివాసీల అభివృద్ధిలో సబ్‌ప్లాన్ పాత్ర ఎంత కీలకం కాగలదో ఆనాడే చాలా చక్కగా వివరించారు. జీవితం, రాజకీయాలు, ఉద్యమం ఇవి వేర్వేరు కావనీ, ఒకదానికొకటి ముడివడివున్న అంశాలనీ ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. భారత కమ్యూనిస్టుల తొలితరంలో చివరి వాైరైన అర్ధేంద్ భూషణ్ బర్ధన్ 91 సంవత్సరాలు అర్థవంతమైన, ప్రజలతో మిళితమైన జీవితాన్ని గడిపారు. జనవరి 1, 2016న కన్నుమూయడంతో నూతన సంవత్సరంలోకి అడుగిడిన రోజునే ఈ విషాదం చోటుచేసుకుంది. కార్మికనేత ఈరోజు బంగ్లాదేశ్‌లో భాగమైన సెల్హట్లో సెప్టెంబర్ 25, 1925న హేమేంద్ర కుమార్, సరళాదేవిలకు జన్మించిన బర్ధన్, 15 ఏళ్ల వయస్సులో నాగ్‌పూర్‌లో ఉండగా కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నాటి బెంగాల్, మహారాష్ట్రలు సామా జిక, రాజకీయ ఉద్యమాలకు పుట్టినిళ్లు. అటువంటి ప్రాంతంలో పుట్టి పెరిగిన బర్ధన్‌ను ఆ ఉద్యమాలు బాగా ప్రభావితం చేశాయి. అందువల్లనే 1940లోనే అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్)లో చేరారు. విద్యార్థి ఉద్య మంలో ఉన్న సమయంలోనే బర్ధన్ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆర్థికశాస్త్రంలో, న్యాయశాస్త్రంలో పట్టాలు పొందారు. ఆ తర్వాత ఆయన పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా ఉండాలని భావించారు. నాగ్‌పూర్‌లోని విద్యుత్, రైల్వే, వస్త్ర, రక్షణ రంగ పరి శ్రమల్లోని కార్మికులను ఉద్యమంలోకి సమీకరించారు. అయితే బర్ధన్ పూర్తి కాలం కార్యకర్తగా చేరే నాటికి పార్టీ మీద నిషేధం కొనసాగుతున్నది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బర్ధన్‌ను అరెస్టు చేసి రెండున్న రేళ్లు జైలులో ఉంచారు. అంతకు ముందు ఆయన రహస్య జీవితాన్ని గడి పారు. 1957లో నాగ్‌పూర్ పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. 1968లో జాతీయ కౌన్సిల్ సభ్యునిగా, 1978లో పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు. 1982 నాటి వారణాసి మహాసభలో కేంద్ర కార్యదర్శివర్గంలో ప్రవేశించారు. అప్పటినుంచి తన కార్య క్షేత్రాన్ని ఢిల్లీకి మార్చారు. 1996లో పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 2012 వరకు కొనసాగారు. ఆ వెంటనే నాగ్‌పూర్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సదస్సులో ఎన్నో ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. పార్టీ దళి తుల, ఆదివాసీల పట్ల అనుసరించాల్సిన వైఖరిపై ఎన్నో సూచనలు చేశారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పట్ల పార్టీ దృష్టి సారించకపోతే అర్థం లేదని తేల్చి చెప్పారు. అక్కడే కమ్యూనిస్టు పార్టీ అవసరం ఉందని స్పష్టం చేశారు. దళిత, ఆదివాసీ పక్షపాతి 1973లో బర్ధన్ రాసిన ‘‘ట్రైబల్ ప్రాబ్లం ఇన్ ఇండియా’’ అన్న పుస్తకం ఎంతో విలువైన సమాచారాన్ని, ఆదివాసీల పోరాటాలకు ఎంతో నైతిక స్థైర్యాన్ని అందించింది. సరిగ్గా ఆ సమయంలోనే నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ పోరాటాలు ఉధృతంగా సాగుతున్నాయి. ఈ పుస్తకంలో శ్రీకాకుళం గిరిజన రైతాంగపోరాటం ప్రస్తావన ఉండడం గమనార్హం. అన్ని ప్రభుత్వా లూ చట్టాలనూ, రాజ్యాంగాన్నీ సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల, గిరిజ నుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ఉద్యమాలు సాయుధ పోరాటం వైపు వెళుతున్నాయని ఆ పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. ఆది వాసీల పట్ల, ఉద్యమం పట్ల కమ్యూనిస్టు పార్టీలు తన కర్తవ్యాలను రూపొం దించుకోవాలని అందుకోసం ఈ పుస్తకం ఉపకరించాలని చెప్పారు. ఆనాటికి ఆయన పార్టీలో ముఖ్యమైన నాయకులు కూడా కాదు. కానీ ఆదివాసీల సమ స్యల పట్ల ఆయన పార్టీ విధానాన్ని నిర్దేశించే బాధ్యతను తీసుకున్నారు. ఆయన దళితులు, ఆదివాసీల పక్షపాతి అనడానికి మరొక ఉదాహరణ ఉంది. 1980 దశకం మధ్యభాగం నుంచి కులపరంగా రిజర్వేషన్ల సమస్యపై, ప్రత్యేకించి వెనుకబడిన కులాల రిజర్వేషన్లపై వివాదం చెలరేగింది. ఎమర్జెన్సీ అనంతరం వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు వెనుకబడిన కులాలకోసం రిజర్వేషన్లు ప్రకటించాయి. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి. మురళీధర్‌రావు కమిషన్ సిఫారసుల ఆధారంగా 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు బీసీల కోసం ప్రకటించిన రిజర్వేషన్లు వివాదాస్పదం అయ్యాయి. ఏపీ నవ సంఘర్షణ సమితి పేరుతో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనను కొందరు ప్రారంభించారు. అదే సమ యంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్ వ్యతిరేక ఆందో ళనలు తలెత్తాయి. బర్ధన్ ఈ సందర్భంగా ‘కులం-వర్గం-రిజర్వేషన్లు’ పై రెండు వ్యాసాలను ప్రచురించారు. కులం వికృత రూపాన్ని ఇందులో ఆయన ఎండగట్టారు. ‘మార్క్స్, ఎంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక నా జీవి తాన్ని మలచింది. అదేవిధంగా కమ్యూనిస్టు, మార్క్సిస్టు మూల సిద్ధాంత గ్రంథాలు, గోర్కీ రాసిన అమ్మ లాంటి నవలలు నన్ను నిరంతరం మేల్కొనే విధంగా చేశాయి.’ అని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలోని అజయ్ భవన్లో బర్ధన్‌ను నేను మూడుసార్లు కలుసుకున్నాను. ఆయన కూర్చునే గది కానీ, ఆయన నివసించే ఇల్లు కానీ అతి సాధారణంగా ఉండేవి. ఆయన సహచరి పద్మా బర్ధన్ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసి 1986లో మరణించారు. బర్ధన్ స్ఫూర్తి నేటి అవసరం గతంలో మనరాష్ట్రంలో కమ్యూనిస్టు నాయకులు చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, నక్సలైట్ నాయకులైన కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావు, తరిమెల నాగిరెడ్డి వంటి వారు తమ కుటుంబం, ఆస్తి, ఐశ్వర్యాలకన్నా పార్టీకి, ప్రజలకు, ఉద్యమాలకు అంకితమై పనిచేశారు. గత కొంతకాలంగా ఈ అంకితభావం కొరవడిన ఫలితంగానే పశ్చిమ బెంగాల్, కేరళ లాంటి కమ్యూనిస్టు కంచుకోటల నుంచి బీజేపీకి వలసలు పెరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో వామపక్ష పార్టీలు ఓడిపోయిన తరువాత ఈ వలసలు మరింత పెరిగాయి. కేరళలో కూడా ఇదే ధోరణి. 1980-90 తర్వాత వచ్చిన నాయకత్వంలో ఎక్కువ మందికి సొంత కుటుంబాలు, వ్యాపారాభివృద్ధే లక్ష్యం కావడం వల్ల కింది స్థాయి కార్య కర్తలకు వారు స్ఫూర్తిదాయకంగా నిలవలేకపోయారు. కనీసం సైద్ధాంతిక నిబద్ధతను సైతం కార్యకర్తల్లో నింపలేని పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా మత, సంప్రదాయ సంకెళ్ల నుంచి నాయకత్వం బయటపడకపోవడంతో ఇతర పార్టీలకు, కమ్యూనిస్టు పార్టీలకు మధ్యనున్న అంతరాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోయారు. అందువల్లనే కమ్యూనిస్టు పార్టీల నుంచి బీజేపీలోకి వలస వెళ్ళడం కార్యకర్తలకు ఇబ్బందికరంగా తోచలేదు. సరిగ్గా ఇక్కడే ఏబీ బర్ధన్‌ను, ఆయన నిబద్ధతను, ప్రజలపై ఆయనకున్న విశ్వాసాన్ని స్మరించుకోవడం అర్థవంతం, సందర్భోచితం. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
బర్ధన్కు నేతల తుది వీడ్కోలు
ఢిల్లీలో అంత్యక్రియలు పూర్తి సాక్షి, న్యూఢిల్లీ: వామపక్ష కురువృద్ధుడు, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ పార్థివదేహానికి సోమవారం ఢిల్లీలోని నిగంబోధ్ఘాట్ విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం ఉదయం సీపీఐ కేంద్ర కార్యాలయం అజోయ్భవన్లో బర్ధన్ భౌతికకాయం వద్ద ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బృందా కారత్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ఎంపీ డి.రాజా, టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, గురుదాస్‌దాస్ గుప్తా, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు నారాయణ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చైనా దౌత్య కార్యాలయం డెప్యూటీ చీఫ్ లూ జిన్ సంగ్సహా పలువురు వామపక్షపార్టీల నేతలు, కార్యకర్తలు అజోయ్భవన్ చేరుకుని బర్ధన్కు నివాళులర్పించారు. పలురాష్ట్రాల నుంచి వచ్చిన వామపక్ష నేతలు, కార్యకర్తలు బర్ధన్ అంతిమయాత్రలో పాల్గొని తుదివీడ్కోలు పలికారు. -
నేడు బర్ధన్కు తుది వీడ్కోలు
-
నేడు బర్ధన్కు తుది వీడ్కోలు
న్యూఢిల్లీ: సీపీఐ సీనియర్‌నేత ఏబీ బర్ధన్ అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ఇక్కడి నిగమ్‌బోధ్ ఘాట్ జరగనున్నాయి. 92 ఏళ్ల బర్ధన్ అనారోగ్యంతో శనివారం కన్నుమూయడం తెలిసిందే. సోమవారం ఉదయం బర్ధన్ భౌతికకాయాన్ని కార్యకర్తల సందర్శనార్థం పార్టీ కేంద్ర కార్యాలయం లో ఉంచుతారు. బర్ధన్ మృతిపై సీపీఎం, డీఎంకే తదితర పలు పార్టీలు సంతాపం తెలిపాయి. బర్ధన్ విలువలున్న నేత అని బీజేపీ నేత ఎల్కే అద్వానీ అన్నారు. బర్ధన్ మృతి దేశ వామపక్ష, కార్మిక ఉద్యమానికి తీరని లోటని సీపీఐ ప్రధాన కార్యద్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు. -
అజయ్‌భవన్‌కు కొండంత అండ
నివాళి ‘ఏమిటిలా నిరుత్సాహపరిచావ్? నీవు కేంద్రానికి వచ్చి జాతీయ స్థాయిలో పని చేస్తావని అంతా ఆశించాం!’ అన్నారు ఏబీ బర్దన్ గారు (సెప్టెంబర్ 24, 1924- జనవరి 2, 2016). గడచిన నవం బర్ నెలాఖరున నేను కేంద్ర కార్య వర్గ సమావేశాలకి ఢిల్లీ వెళ్లిన ప్పుడు నన్ను చూడగానే బర్దన్ గారు అన్నమాట ఇదే. నిజానికి ఆయనే నన్ను తీవ్రంగా నిరుత్సాహ పరిచారు. ఆయన ఆదేశించినట్టుగానే నేను ఢిల్లీకి మకాం మార్చడానికి నిర్ణయం తీసుకున్నాక, వారు అజయ్భవన్ను శాశ్వతంగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. నన్ను తన సొంతమనిషిని చేసుకుని చనువుగా అలా గదమాయించారాయన. అందులో ఒక ఆప్యాయత ఉంది. అంతేనా! నా మీద ఆయన పెట్టుకున్న నమ్మకం ఎలాంటిదో కూడా గమనించాను. తీరా నేను విషయం గుర్తు చేశాక వెన్న లాగా కరిగిపోయారు. వెంటనే, ‘సరే కానీ!’ అంటూ ఆప్యాయంగా భుజం తట్టారు. పాండిచ్చేరి మహాసభలో నాకు కేంద్ర బాద్యతలు అప్పగిం చారు. ఆ మహాసభ ఆదేశం మేరకు నేను ఢిల్లీకి మకాం మార్చాలి. తీసుకున్న బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తేనే మనిషికి సంతృప్తి. కానీ కార్యదర్శిగా ఉండగా, తీసుకున్న ఒక బాధ్యతను అసంపూర్తిగా వదలి నూతన నాయకత్వం మీద భారం పడేసి పోవడానికి నా మనసు అంగీకరించలేదు. వాస్తవంగా ఆ బాధ్య తలను పూర్తి చేయడానికి ఆచరణలో అనేక సమస్యలు ఎదురై నాయి. దానితో నేను హైదరాబాద్‌లోనే ఉండవలసి వచ్చింది. దాని ఫలితమే కేంద్రంలో నాకప్పగించా లనుకున్న బాధ్యతలను స్వీకరించలేకపోయాను. తరువాత నేను బిహార్‌లో అప్పుడు జరిగిన ఆ రాష్ర్ట పార్టీ సమావేశాలకు బయలుదేరాను. ఎక్కడికీ ప్రయాణం అనడిగారు బర్దన్. బిహార్కని చెప్పగానే ఎంతో ఆనందించి,వెళ్లి రమ్మని సైగ చేశారు. బిహార్ నుంచి తిరిగి వచ్చే లోపుననే మాటామంతీ లేకుండా ఆస్పత్రిలో మంచం మీద అలా అచేతనంగా కనిపించారు. ఒక్కసారైనా పలకరించలేకపోతామా అని చివరి దాకా ఎదురుచూశాను. చివరికి నిరాశనే మిగిల్చారు. మమ్మ ల్నందరినీ విడిచి నిర్దయగా నిష్ర్కమించారు కామ్రేడ్ బర్దన్. వామపక్ష ఉద్యమానికి తలమానికం బర్దన్. పదవీ విరమణ చేశారు గానీ, శక్తి మేరకు కొన్ని బాధ్యతలను నిర్వహిస్తూనే ఉన్నారు. అనారోగ్యం పాలు కాగానే వారి అమ్మాయి అల్క వారి ఇంటికి తీసికెళ్లి బాగోగులు చూసు కోవడానికి ప్రయత్నించారు. అల్కా అహ్మదాబాద్‌లో పేరెన్నిక గన్న డాక్టరు. ఆమె భర్త సమీర్ బారువా ఐఐఎం డెరైక్టర్. అక్కడే వింత సమస్య ఎదురైంది. బంధువులు ఎవరు వచ్చి పలకరించినా స్పందించేవారు కాదట. బర్ధన్ కుమారుడు సాహిల్ గుర్గావ్లో వ్యాపారస్తుడిగా స్థిరపడ్డారు. మరో కుమారుడు అశోక్ రష్యాలో ఫిజిక్స్, మ్యాథ్స్ లలో ఎంఎస్ చేసి ఆ తర్వాత అమెరికాలోని బర్క్లీ యూని వర్సిటీలో అర్ధశాస్త్రంలో పీహెచ్డీ చేసి పలు గ్రంథాలు రచించారు. కుటుంబసభ్యులు అప్పుడప్పుడు వచ్చి బర్ధన్‌ను కలవడమే తప్ప వారి దగ్గరకు ఆయన వెళ్లింది లేదు. న్యూఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయం అజయ్భవనే 2006 వరకూ ఆయన నివాసగృహం. ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాక పార్టీ ఎంపీకి చెందిన క్వార్టర్స్‌కి మారారు. తన కుమార్తె ఇంట సకల సౌకర్యాలూ ఉన్నా ఏమీ లేని వారిగా, పార్టీ కార్యాల యంలో పరిమిత సౌక ర్యాలే ఉన్నా అక్కడే ఆయన ఎంతో ఆనందంగా, తృప్తిగా గడపడం గమనించాం. చివరికి తనకు సుతరామూ ఇష్టం లేకున్నా, తండ్రి ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉంచుదామని నిర్ణయించుకున్న వారి కుమార్తె ఆయనను ఢిల్లీకే పంపించేశారు. శేష జీవితాన్ని కమ్యూనిస్ట్ కుటుంబంతోనే గడపాలని ఆయన దృఢంగా కోరుకున్నారు. ఇది నిశ్చయం. కార్యకర్తలతో ఆయన వ్యవహారసరళి ఆదర్శనీయంగా ఉండేది. చురుకైన కార్యకర్తలు తొందరపాటు పనులు చేసినా ఆప్యాయంగా మందలించే వారే తప్ప కోపగించుకొనేవారు కాదు. నాపైన కూడా ఒకటి రెండు దఫాలు వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ మందలింపు, విమర్శ కార్యకర్తను ముందుకు నడిపించేదిగా ఉండేది. అజయ్భవన్లో బర్దన్ ఉంటేనే పార్టీకి కొం డంత అండ. ఆయన వెన్నలాంటి మనసు కలిగిన కఠినాత్ముడు. బర్దన్గారు భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆ గంభీరస్వరం, ఆత్మీయ స్పర్శ, ఆప్యాయత నిండిన పలకరింపు మనతోనే ఉంటాయి. బర్దన్ గారి జీవితం ప్రజాస్వామ్యానికి, సెక్యుల రిజానికి, సోషలిస్ట్ వ్యవస్థ స్థాపనకు అంకితమైంది. ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచి ఉండే ఆ విప్లవమూర్తికి ఇదే శ్రద్ధాంజలి. కళాహృదయుడీ కామ్రేడ్ తీరిక లేకుండా సదా ఉద్యమాల్లో పాల్గొనే బర్దన్‌కు కవిత్వ మన్నా, పాటలన్నా ప్రాణం. ఏ కొంచెం ఖాళీ దొరికినా ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వాన్నీ, మహ్మద్ రఫీ పాటల్ని వినడానికి ఇష్టపడేవారు. ఇక్బాల్ బానో రాసిన ‘హమ్ దేఖేంగే...’ గీతమైతే ఆయన నోట్లో నానేది. సాహిర్ లుధ్యాన్వి, కైఫీ ఆజ్మీ వంటి మహాకవులు పార్టీలో ఉండేవారని ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. మహా రాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించి అక్కడే ట్రేడ్ యూనియన్ రంగంలో చురుగ్గా పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీలోకి ప్రవేశించారు. 2004లో తొలిసారి యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వామ పక్షాలు దానికి మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో ఆయన తరచు మన్మోహన్‌సింగ్‌తో మాట్లాడేవారు. అయితే మన్మోహన్పై ఆయనకంత సదభిప్రాయం లేదు. దేశాన్ని అమెరికాకు సన్నిహితం చేయడమే ఆయన ఎజెండా అని అనేవారు. చిత్రంగా తనకు మన్మోహన్కంటే వాజపేయి అంటేనే సదభిప్రాయం ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఆర్ధిక, విదేశీ వ్యవహారాల్లో కాంగ్రెస్, బీజేపీల విధానాలు ఒకటేనని భావించేవారు. - కె.నారాయణ వ్యాసకర్త సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు. మొబైల్ : 9490952222 -
'తప్పు'లో కాలేసిన మమత
కోల్ కతా: సీపీఐ సీనియర్ నాయకుడు ఏబీ బర్దన్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సంతాపం ప్రకటించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆమె సంతాపం ప్రకటించడం గమనార్హం. పొరపాటును గ్రహించి వెంటనే ఈ ట్వీట్ తొలగించారు. బర్దన్ మృతికి సంతాపం ప్రకటిస్తూ తన అధికారిక ట్విటర్ పేజీలో సందేశం పోస్టు చేశారు. 'బర్దన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. చాలా కాలం పాటు ఆయన రాజకీయాల్లో, కార్మిక సంఘాల్లో పనిచేశారు. ఆయన మరణం తీరనిలోటు. బర్దన్ కుటుంబానికి, సన్నిహితులకు సంతాపం తెల్పుతున్నా' అని మమత ట్వీట్ చేశారు. అయితే బర్దన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని వెంటనే ఈ ట్వీట్ తొలగించారు. అప్పటికే ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పక్షవాతంతో బాధపడుతున్న బర్దన్ కు ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
ఆడంబరమెరుగని ఆదర్శ నేత
నేడు చండ్ర రాజేశ్వరరావు శత జయంతి కామ్రేడ్ సీఆర్ పార్టీ అత్యున్నత స్థానంలో ఉన్నా తానొక గొప్ప సిద్ధాంతవేత్తననే బడాయిని ప్రదర్శించక సాదాసీదాగా ఉండేవారు. తన రైతు పుట్టుకకు, రైతు సహజాతానికి గర్వపడేవారు. ఆ సహజ ఆలోచన తరచు వాస్తవికతకు దగ్గరగా ఉండేది. అది కొన్ని సందర్భాల్లో సిద్ధాంతీకరణ సామర్థ్యం లేని కామ్రేడ్స్ పట్ల కొంత పక్షపాతానికి కారణమయ్యేది. నేడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు శత జయంతి. ఆయన జీవితాన్ని, భారత కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన ఆందించిన సేవలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భమిది. నాకంటే సన్నిహితంగా ఆయనను ఎరిగిన వారు ఎందరో ఉన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో, ప్రత్యేకించి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన నిర్వహించిన పాత్రను నాకంటే వారే బాగా వివరించగలరు. దశాబ్దాల తరబడి సన్నిహితంగా ఆయనను గమనించే భాగ్యం నాకు కలిగింది. ఆ అనుభవాల ఆధారంగా ఒక మనిషిగా, దేశభక్తునిగా, సీనియర్ సహచరునిగా, పార్టీ నాయకునిగా సీఆర్ బహుముఖ వ్యక్తిత్వం గురించి నేను చెబుతాను. కామ్రేడ్ సీఆర్ 25 ఏళ్లపాటు సీపీఐ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ అధినేతగా అంత సుదీర్ఘ కాలం పనిచేయడం అటు పార్టీపైనా, ఆయనపైనా కూడా సానుకూల, ప్రతికూల ప్రభావాలను నెరపే ఉంటుంది. అయితే ఆ అంశాన్ని రాగద్వేషాలకు అతీతమైన వస్తుగత దృక్పథంతో అంచనా వేయాల్సింది కాలమే. నన్ను 1982లో కేంద్ర కమిటీ కార్యదర్శివర్గ సభ్యునిగా తీసుకున్న తదుపరి నేను ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరాను. అటుపిమ్మట దాదాపు పదేళ్ల పాటూ ఆయనతో సన్నిహితంగా కలసి పనిచేసిన కాలంలో నా మనఃఫలకంపై ఆయన గురించి ముద్రితమైన కొన్ని అభిప్రాయాలను మాత్రమే చెబుతాను. ఆ కాలమంతటా మేం ఇద్దరం అజయ్ భవన్లో ఒకే అంతస్తులో ఉండేవాళ్లం. పని సమయాల్లోను, ఖాళీ సమయాల్లోనూ, అధికారిక హోదాలోను, వ్యక్తిగతంగానూ కూడా నేనాయనను అతి తరచుగా కలుస్తుండేవాడిని. సీఆర్‌ను చూసిన వెంటనే స్ఫురించేది ఆయన భారీ విగ్రహం. పొడవుగా, విశాలమైన భుజాలతో, దృఢంగా నిండుగా కనిపించేవారు. దృఢమైన దవడలు, పెద్దమొహంతో ఆయన ఎదుటివారి మొహంలోకి సూటిగా చూసేవారు. ఖంగున మోగే గొంతుతో బిగ్గరగా మాట్లాడేవారు. రూపం మొరటు-మనసు మెత్తన ఆయన భారీ కాయానికి మించి విశాలమైనది ఆయన హృదయం. మొరటు రూపం మాటున సుతిమెత్తని, దయార్ద్ర హృదయం దాగి ఉండేది. ఎవరికి బాధకలిగినా ఆయనకు నొప్పి. తన చుట్టుపక్కలున్న కామ్రేడ్లలో ఎవరు జబ్బుపడి ఆసుపత్రిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా సీఆర్ అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. ఆదుర్దాగా యోగక్షేమాలు విచారించి, డబ్బు అవసరమేమో వాకబు చేసేవారు. నా భార్య కోమాలో ఉండగా ఆమెను చూడటం కోసమే పనిగట్టుకుని ఆయన నాగపూర్ వచ్చారు. డబ్బు పట్టుకుని వచ్చి మరీ డబ్బు అవసరమేమోనని విచారించడం నేనెన్నటికీ మరువలేను. ఒక వేళ ఆయన వల్ల నాకు నిజంగానో, ఊహాజనితంగానో ఏమైనా బాధ కలిగినా గానీ ఆయన చూపిన దయా, సానుభూతులకు దాన్ని మరచిపోవాల్సిందే. నాయకుడినన్న అహంకారం ఇసుమంతైనా లేకుండా క్యాడర్లు, సభ్యులందరికీ ఆయన అందుబాటులోఉండేవారు. భౌతికంగానే కాదు, ఆత్మికంగానూ, కామ్రేడ్లీగానూ కూడా ఆయన అందరికీ సన్నిహితంగా మెలిగేవారు. పార్టీ కార్యాలయం గేటు వద్ద ఉన్న రెడ్గార్డ్స్తో, స్వీపర్ పనిచేసే కుర్రాళ్లతో, క్యాంటీన్ సిబ్బందితో కూచుని గంటల తరబడి ముచ్చట్లాడేవారు. నాయకత్వ సహచరులతో, ఇతర పార్టీలలోని పరిచయస్తులతో మాట్లాడినట్టే వారితో కూడా. ఆయన అందరినీ తన సహచర కార్యకర్తలుగానే గౌరవించేవారు, వారి గౌరవాన్ని చూరగొనేవారు. ఆయనకంటే నేను చాలా జూనియర్ని. మామధ్య తీవ్ర విభేదాలు చెలరేగి నేనాయన ఆగ్రహానికి గురైన సందర్భాలున్నాయి. అయితే ఆ మరుసటి రోజు ఉదయం నేనింకా నిద్రలేవకముందే ఆయన నా గదిలో ప్రత్యక్షమై వార్తలు, మంచీచెడ్డా మాట్లాడేవారు. నిన్నటి కోపతాపాలిక చెల్లు. ఇది మరో రోజు, అంతే. ఆయనకు ఎవరన్నా ఎలాంటి ద్వేష భావమూ ఉండేదే కాదు కాబట్టే అలా ఉండటం సాధ్యమైంది. మనిషి నడవడికలో, సామాజికంగా కలిసిమెలిసి ఉండటంలో కనిపించే చిన్న చిన్న విషయాలే మనిషిని విలక్షణంగా నిలుపుతాయి, ప్రత్యేకించి నాయకుని విషయంలో అది మరింత నిజం. కామ్రేడ్ సీఆర్ పార్టీ అత్యున్నత స్థానంలో ఉన్నా తానొక గొప్ప సిద్ధాంతవేత్తనంటూ బడాయిని ప్రదర్శించక సాదాసీదాగా ఉండేవారు. ఆయన తన రైతు పుట్టుకకు, రైతు సహజాతానికి గర్వపడేవారు. రైతు సహజమైన ఆయన ఆలోచన తరచు సరిగ్గానూ, వాస్తవికతకు దగ్గరగానూ ఉండేది. అయితే పలు సందర్భాల్లో అది... సిద్ధాంతీకరించే సామర్థ్యం కొరవడినవారి పట్ల కొంత పక్షపాతం చూపడానికి కూడా కారణమయ్యేది. అత్యున్నత స్థాయిలో అది తీవ్రమైన పొరపాట్లకు దారి తీయవచ్చు. అది కొనసాగితే తీవ్రమైన తప్పిదాలకు సైతం దారితీయవచ్చు. ఆయన నాయకత్వంలో పార్టీ చేసిన... అత్యవసర పరిస్థితికి మద్దతునివ్వడం వంటి తీవ్రమైన వ్యూహాత్మక, ఎత్తుగడల తప్పిదాలను ఎవరూ కప్పిపుచ్చలేరు. నరనరాన నిండిన లౌకికతత్వం కామ్రేడ్ సీఆర్‌లో కొట్టవచ్చినట్టుగా కనిపించే లక్షణం దృఢమైన లౌకికవాద దృక్పథం. మన రిపబ్లిక్ లౌకికవాద-ప్రజాస్వామిక పునాదులపైనా, రాజకీయ వ్యవస్థపైనా విశ్వాసం. అందువల్లనే ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు మన లౌకికవాద పునాదులకు తూట్లు పొడుస్తూ, మతోన్మాద విషాన్ని వ్యాపింపజేసే కార్యకలాపాలను సాగించడం పట్ల కటువుగా ఉండేవారు. మైనారిటీలందరి హక్కులపట్ల, సంక్షేమంపట్ల ఆయన అత్యంత పట్టింపును ప్రదర్శించేవారు. దూకుడుగా వస్తున్న మిలిటెంటు ఆధిక్యతావాదం పట్ల వారి భయాందోళనలను పంచుకునేవారు. ప్రజాస్వామ్యమంటే అధిక సంఖ్యాకుల అధికారం, ఆధిపత్యం కాదని నమ్మిన నిజమైన లౌకికవాద ప్రజాస్వామికవాది ఆయన. బాబ్రీ మసీదును కూలగొట్టి ‘అక్కడే మందిరం నిర్మిస్తాం’ అంటూ అద్వానీ తదితరులు మాట్లాడుతున్నప్పుడే ఆయన మోగుతున్న ప్రమాద ఘంటికను గుర్తించారు. లౌకికవాదులుగా చెప్పుకునే నేతలు చాలామంది సమయం మించిపోయే వరకు అది గ్రహించలేకపోయారు. ‘మసీదు’ కేవలం సంకేతం మాత్రమేననీ, దాన్ని ధ్వంసం చేయాలని పిలుపునివ్వడమంటే ఆ మైనారిటీ మతానికి వ్యతిరేకంగా పూర్తిస్థాయి దాడికి పిలుపునివ్వడమేననీ, మన లౌకికవాద పునాదుల శిథిలాలపై ‘హిందూ రాష్ట్రా’న్ని నిర్మించడమేననీ సీఆర్ గ్రహించారు. అయితే భారత ప్రజలకు, ప్రత్యేకించి హిందువులకు ఆ ప్రమాదాన్ని నివారించగల అంతర్నిహిత శక్తి ఉన్నదని ఆయనకు ప్రగాఢ విశ్వాసం. అందుకే మైనారిటీలకు, మసీదుకు మద్దతుగా సమీకృతం కావాలని పిలుపునిచ్చి, స్వయంగా ముందు నిలిచారు. మొట్ట్టమొదటగా అయోధ్యకు ఆ సందేశాన్ని తీసుకుపోయారు. మతతత్వ వ్యతిరేక పోరాట చరిత్రలో సీఆర్ కృషి నిలిచిపోతుంది. కమ్యూనిస్టు... దేశభక్తుడు కామ్రేడ్ సీఆర్ కమ్యూనిస్టు. కాబట్టే నిజమైన దేశభక్తుడు. జాతీయ ఐక్యత, సమగ్రతలను ఎత్తిపట్టారు. అది లేనిదే భారత ప్రజాస్వామ్యం, భవిష్యత్తు నిలవడానికి పునాదే లేకుండా పోతుందని భావించారు. కాశ్మీర్, పంజాబ్, అస్సాం, మణిపూర్లలో రేగుతున్న ఉద్రిక్తతలు జాతీయ ఐక్యత, సమగ్రతలకు ముప్పును కలిగిస్తాయని పసిగట్టారు. ఆ సమస్యలపై పైపై విశ్లేషణలతో సంతృప్తి చెందలేదు. పైకి కనిపించే లక్ష ణాలు పలు సందర్భాల్లో వ్యవస్థ లోపల లోతుగా వేళ్లూనుకున్న రోగాన్ని కప్పిపుచ్చుతుంటాయి. సీఆర్ ఆ మూల సమస్యలను లోలోతుల్లోకి వెళ్లి పరిశీలించారు. ఆయన సిక్కు చరిత్ర, మత గ్రంథాలను అధ్యయనం చేశారు. అస్సాం భౌగోళికత, బహుళ జాతుల మూలాల గ్రంథాలను కూడా అధ్యయనం చేశారు. అలాగే హిందూ పురాణాలు, తత్వశాస్త్రం వగైరా కూడా. సిక్కులలోని ఒక చిన్న విభాగం డిమాండయిన ఖలిస్థాన్ సిక్కులందరి మనోభావాల్లోకి ఎలా చొరబడిగలిగిందో తెలుసుకోవాలని తాపత్రయపడ్డారు. గంటల తరబడి ఆ విషయాలను పార్టీకి చెందినవారి కంటే ఎక్కువగా పార్టీకి చెందని పంజాబీ మేధావులతో, నేతలతో చర్చించేవారు. ఢిల్లీ సిక్కు వ్యతిరేక అల్లర్ల వల్ల వారికి కలిగిన తీవ్ర వేదనను ఆయన కంటే ఎక్కువగా అర్థం చేసుకున్నవారు లేరు. కాశ్మీర్, అస్సాం లేదా మణిపూర్ తిరుగుబాటు సమస్యలపైన ఆయనది అదే వైఖరి. ఆ ప్రాంతాలన్నిట్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. మూరుమూల ‘సున్నిత ప్రాంతాల’ సాధారణ ప్రజలను కలుసుకుని వారిని అర్థం చేసుకోవాలని తహతహలాడే వారు. డెబైయ్యేళ్లు పైబడినా, ఆస్త్మా వ్యాధితో బాధపడుతున్నా ఆయనలో ఆ ఓపిక మాత్రం కొరవడింది లేదు. ‘భవిష్యత్తులోకి ముందుకు’ రోజులు గడిచే కొద్దీ సీఆర్ కులం, మతం పేరిట పెరుగుతున్న వేర్పాటువాద విచ్ఛిన్నకర శక్తులపట్ల అసంతృప్తితో ఉండేవారు. భారత దేశ వైవిధ్యంలోని ఏకత్వాన్ని అర్థం చేసుకోడానికి అన్ని మతాలను, సంస్కృతులను అధ్యయనం చేయసాగారు. పార్సీ వంటి చిన్న మతం సైతం ఆయన దృష్టి నుంచి తప్పిపోయింది లేదు. మార్క్సిస్టు ఆలోచనా విధానాన్ని భారతదేశపు సుసంపన్నమైన సామాజిక, సాంస్కృతిక వారసత్వంతో సమ్మిళితం చేయాల్సిన అవసరం పట్ల ఆయన విశ్వాసం రోజురోజుకు బలపడింది. కాలం చెల్లిన ప్రతీఘాతుక అంశాలను తిరస్కరించి, ప్రగతిశీలమైన ప్రతి అంశాన్ని స్వీకరించాల్సిందేననే నిర్ధారణకు వచ్చారు. అప్పటికే ఆయన తన జీవిత చరమాంకానికి చేరి ఆ రంగంలో మరింతగా కృషి చేయలేకపోవడం దురదృష్టకరం. సీపీఐ రెండుగా చీలిపోయిన సమయంలో కామ్రేడ్ సీఆర్ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు. పలు వివాదాలతో చర్చలతో కూడిన ఆ అంశాన్ని చర్చించే సందర్భం ఇది కాదు. అయితే ైచె నా పార్టీతో సౌభ్రాతృత్వ సంబంధాలను నెలకొల్పుకోడానికి వెళ్లిన మొట్టమొదటి పార్టీ ప్రతినిధి బృందంలో సీఆర్‌తో పాటు నేను కూడా ఉన్నాను. ‘‘గతాన్ని మరచిపోదాం. భవిష్యత్తులోకి ముందుకు చూద్దాం. గతం ఇప్పుడు చరిత్ర లో భాగం’’ అని సీఆర్ చైనా కామ్రేడ్స్‌తో అనడం గుర్తుకు వస్తోంది. పార్టీ చీలికకు కూడా అదే వర్తిస్తుంది. గతంపై చరిత్ర తీర్పు చెబుతుంది. సూత్రబద్ధమైన కమ్యూనిస్టు ఐక్యతతో ‘‘భవిష్యత్తులోకి ముందుకు చూడడడమే’’ ముందు భారతదేశ విముక్తికి, సోషలిజానికి ముందు షరతు అవుతుంది. చీలిక సమయంలో తిరిగి ఐక్యతను సాధించగలిగినంత సమర్థవంతమైన రీతిలో నాయకత్వం కృషి చేయలేకపోవడం విచారకరం. కామ్రేడ్ సీఆర్ ఆ కర్తవ్యాన్ని పరిపూర్తి చేసే బాధ్యతను వదిలి వెళ్లారు. కమ్యూనిస్టు నాయకులు అలా ఆశావహంగా భవిష్యత్తులోకి చూడాలి. (వ్యాసకర్త సీపీఐ అగ్రనేత) - ఎ.బి. బర్ధన్ -
కాంగ్రెస్, బీజేపీకా సీన్ లేదు: బర్ధన్
భువనేశ్వర్: 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ రెండింటిలో ఏ పార్టీ కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని సీపీఐ పేర్కొంది. లెఫ్ట్, ప్రాంతీయ పార్టీలు, ప్రజాస్వామ్య శక్తుల కలయికతో ఓ ఆచరణీయమైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ అగ్రనేత ఏబీ బర్ధన్ తెలిపారు. ‘ప్రజాగ్రహం వల్ల కాంగ్రెస్‌కు తిరిగి అధికారం దక్కే అవకాశాల్లేవు. అటు బీజేపీ పరిస్థితి చూస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలను గెలుచుకునే పరిస్థితి లేదు’ అని అన్నారు. ఆదివారమిక్కడ బర్ధన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రత్యామ్నాయం ఏర్పాటు కాగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
కేంద్రం అచేతనంగా వ్యవహరిస్తోంది: బర్దన్
-
కేంద్రం అచేతనంగా వ్యవహరిస్తోంది: బర్దన్
ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అచేతనంగా వ్యవహరిస్తోందని సీపీఐ సీనియర్ నాయకుడు ఏబీ బర్దన్ విమర్శించారు. రాష్ట్ర విభజనపై రెండు ప్రాంతాలు నేతలు కూర్చుని మాట్లాడుకోవాలని ఆయన సూచించారు. రెండు ప్రాంతాలను జేఏసీ నాయకులను పిలిచి మాట్లాడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో అనిశ్చితిని తొలగించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితి గురించి బర్దన్‌కు వివరించినట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. కాంగ్రెస్‌కు ఇప్పుడైనా కనువిప్పు కలిగి సమస్యను పరిష్కరించాలని అన్నారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు జేడీ(యు) నేత శరద్ యాదవ్‌ను కలిశారు.