ఒకే జెండాకు అంకితం | communist ab bardhan life sacrifies to communism | Sakshi
Sakshi News home page

ఒకే జెండాకు అంకితం

Published Thu, Jan 7 2016 1:39 AM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

ఒకే జెండాకు అంకితం - Sakshi

ఒకే జెండాకు అంకితం

కొత్త కోణం
చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావు, తరిమెల నాగిరెడ్డి వంటి వారు తమ కుటుంబం, ఆస్తి, ఐశ్వర్యాలకన్నా పార్టీకీ, ప్రజలకూ, ఉద్యమాలకూ అంకితమై పనిచేశారు. గత కొంతకాలంగా ఈ అంకిత భావం కొరవడిన ఫలితంగానే పశ్చిమ బెంగాల్, కేరళ వంటి కమ్యూనిస్టు కంచుకోటల నుంచి బీజేపీకి వలసలు పెరుగుతున్నాయి. ఇక్కడే ఏబీ బర్ధన్‌ను, ఆయన నిబద్ధతను, ప్రజలపై ఆయనకున్న విశ్వాసాన్ని స్మరించుకోవడం సముచితం.
 
గతకాలపు అనుభవసారానికీ, మనకూ మధ్య దూరం పెరుగుతోందని తొలి తరం కమ్యూనిస్టు సిద్ధాంత నిబద్ధుడు, నిరాడంబరుడు ఎ.బి.బర్ధన్ మరణం గుర్తుచేస్తోంది. పదిహేనేళ్ల బాల్యం మినహా, ఏడున్నర దశాబ్దాల జీవితంలో తను నమ్మిన కమ్యూనిజాన్ని తుచ తప్పకుండా ఆచరించిన వ్యక్తి ఆయన. కమ్యూనిజాన్నీ, దాని ఆచరణలో కచ్చితత్వాన్నీ కూడా పాటించారు. ప్రజలే జీవితంగా బతికిన వ్యక్తి బర్ధన్. వ్యక్తిగత జీవితమే లేని వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ప్రజలంటే కేవలం మైదానప్రాంతాల్లో అన్ని అవకాశాలతో బతికేవారే కాదని, వారు మాత్రమే చరిత్ర గతిని మార్చారనుకోవడం తప్పని, అడవిబిడ్డల పోరాటాలను, ఉద్యమాలను మినహాయించరాదని ఆయన బలంగా విశ్వసించారు. తరతరాలుగా కులం పేరుతో వెలివేతకు గురవుతోన్న దళితుల త్యాగాలను మరువరాదని కూడా అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే ‘ఈ దేశ స్వాతంత్య్రం కోసం ప్రజలందరితోపాటు అడవుల్లో నివసించే ఆదివాసీలు కూడా రాజీలేని పోరాటం చేశారు.
 
 దేశంలోని సహజ వనరులు, జాతీయ సంపదగా ఉన్న బడ్జెట్‌లలో దళితులకూ, ఆదివాసులకూ వాటా కల్పించడం ప్రభుత్వాల బాధ్యతగా ఉండాలి. అంతేకానీ, దళితుల, ఆదివాసీల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ, వారిని మరింత దీనస్థితికి నెట్టివేస్తూ, దేశ ప్రగతి గురించి మాట్లాడటం వంచన తప్ప మరొకటి కాదు.’ ఆగస్టు 22-23; 2012 తేదీల్లో నాగ్‌పూర్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సమావేశాన్ని ప్రారంభిస్తూ  బర్ధన్ అన్న మాటలివి. ఆయన అప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలగి సురవరం సుధాకర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న దశ. అయినప్పటికీ జాతీయ స్థాయిలో సబ్ ప్లాన్ చట్టం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి అనారోగ్యాన్ని సైతం లెక్కచేయక ఆయన ఢిల్లీ నుంచి నాగ్‌పూర్ వచ్చారు. ఆ సమావేశాలకు నేను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన కాకి మాధవరావు కూడా హాజరయ్యాం.     
 
సబ్‌ప్లాన్ ఆశయంగా...
అప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కోసం జరుగుతున్న పోరాటం ఫలించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ సంవత్సరం డిసెం బర్‌లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు కోసం చట్టాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుపై ఒక జాతీయ సదస్సును కూడా నిర్వహించింది.  ఆ సదస్సుకు ఆయన హాజరవుతారని ఎవరూ ఊహించ లేదు. ఆ సదస్సులో బర్ధన్ మాట్లాడిన తీరు,  వెలిబుచ్చిన అభిప్రాయాలు, హాజరైన వారికి ఆయన అందించిన స్ఫూర్తి మరువలేనివి.
 
ముఖ్యంగా మహా రాష్ట్రలో ఆదివాసీల ఉద్యమాల గురించీ, ఆ ఉద్యమాల్లో పాల్గొన్న ఆదివాసీ నాయకుల గురించీ ఆయన అందించిన వివరాలు ఉత్తేజాన్ని కలిగించాయి. దళితుల, ఆదివాసీల అభివృద్ధిలో సబ్‌ప్లాన్  పాత్ర ఎంత కీలకం కాగలదో ఆనాడే చాలా చక్కగా వివరించారు. జీవితం, రాజకీయాలు, ఉద్యమం ఇవి వేర్వేరు కావనీ, ఒకదానికొకటి ముడివడివున్న అంశాలనీ ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. భారత కమ్యూనిస్టుల తొలితరంలో చివరి వాైరైన అర్ధేంద్ భూషణ్ బర్ధన్ 91 సంవత్సరాలు అర్థవంతమైన, ప్రజలతో మిళితమైన జీవితాన్ని గడిపారు. జనవరి 1, 2016న కన్నుమూయడంతో నూతన సంవత్సరంలోకి అడుగిడిన రోజునే ఈ విషాదం చోటుచేసుకుంది.
 
కార్మికనేత
ఈరోజు బంగ్లాదేశ్‌లో భాగమైన సెల్హట్‌లో సెప్టెంబర్ 25, 1925న హేమేంద్ర కుమార్, సరళాదేవిలకు జన్మించిన బర్ధన్, 15 ఏళ్ల వయస్సులో నాగ్‌పూర్‌లో ఉండగా కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నాటి బెంగాల్, మహారాష్ట్రలు సామా జిక, రాజకీయ ఉద్యమాలకు పుట్టినిళ్లు. అటువంటి ప్రాంతంలో పుట్టి పెరిగిన బర్ధన్‌ను ఆ ఉద్యమాలు బాగా ప్రభావితం చేశాయి. అందువల్లనే 1940లోనే అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్)లో చేరారు. విద్యార్థి ఉద్య మంలో ఉన్న సమయంలోనే బర్ధన్ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆర్థికశాస్త్రంలో, న్యాయశాస్త్రంలో పట్టాలు పొందారు. ఆ తర్వాత ఆయన పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా ఉండాలని భావించారు. నాగ్‌పూర్‌లోని విద్యుత్, రైల్వే, వస్త్ర, రక్షణ రంగ పరి శ్రమల్లోని కార్మికులను ఉద్యమంలోకి సమీకరించారు. అయితే బర్ధన్ పూర్తి కాలం కార్యకర్తగా చేరే నాటికి పార్టీ మీద నిషేధం కొనసాగుతున్నది.
 
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బర్ధన్‌ను అరెస్టు చేసి రెండున్న రేళ్లు జైలులో ఉంచారు. అంతకు ముందు ఆయన రహస్య జీవితాన్ని గడి పారు. 1957లో నాగ్‌పూర్ పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. 1968లో జాతీయ కౌన్సిల్ సభ్యునిగా, 1978లో పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు. 1982 నాటి వారణాసి మహాసభలో కేంద్ర కార్యదర్శివర్గంలో ప్రవేశించారు. అప్పటినుంచి తన కార్య క్షేత్రాన్ని ఢిల్లీకి మార్చారు. 1996లో పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 2012 వరకు కొనసాగారు. ఆ వెంటనే నాగ్‌పూర్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సదస్సులో ఎన్నో ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. పార్టీ దళి తుల, ఆదివాసీల పట్ల అనుసరించాల్సిన వైఖరిపై ఎన్నో సూచనలు చేశారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పట్ల పార్టీ దృష్టి సారించకపోతే అర్థం లేదని తేల్చి చెప్పారు. అక్కడే కమ్యూనిస్టు పార్టీ అవసరం ఉందని స్పష్టం చేశారు.
 
దళిత, ఆదివాసీ పక్షపాతి
1973లో బర్ధన్ రాసిన ‘‘ట్రైబల్ ప్రాబ్లం ఇన్ ఇండియా’’ అన్న పుస్తకం ఎంతో విలువైన సమాచారాన్ని, ఆదివాసీల పోరాటాలకు ఎంతో నైతిక స్థైర్యాన్ని అందించింది. సరిగ్గా ఆ సమయంలోనే నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ పోరాటాలు ఉధృతంగా సాగుతున్నాయి. ఈ పుస్తకంలో శ్రీకాకుళం గిరిజన రైతాంగపోరాటం ప్రస్తావన ఉండడం గమనార్హం. అన్ని ప్రభుత్వా లూ చట్టాలనూ, రాజ్యాంగాన్నీ సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల, గిరిజ నుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ఉద్యమాలు సాయుధ పోరాటం వైపు వెళుతున్నాయని ఆ పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. ఆది వాసీల పట్ల, ఉద్యమం పట్ల కమ్యూనిస్టు పార్టీలు తన కర్తవ్యాలను రూపొం దించుకోవాలని అందుకోసం ఈ పుస్తకం ఉపకరించాలని చెప్పారు. ఆనాటికి ఆయన పార్టీలో ముఖ్యమైన నాయకులు కూడా కాదు. కానీ ఆదివాసీల సమ స్యల పట్ల ఆయన పార్టీ విధానాన్ని నిర్దేశించే బాధ్యతను తీసుకున్నారు.
 
ఆయన దళితులు, ఆదివాసీల పక్షపాతి అనడానికి మరొక ఉదాహరణ ఉంది. 1980 దశకం మధ్యభాగం నుంచి కులపరంగా రిజర్వేషన్ల సమస్యపై, ప్రత్యేకించి వెనుకబడిన కులాల రిజర్వేషన్లపై వివాదం చెలరేగింది. ఎమర్జెన్సీ అనంతరం వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు వెనుకబడిన కులాలకోసం రిజర్వేషన్లు ప్రకటించాయి. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి. మురళీధర్‌రావు కమిషన్ సిఫారసుల ఆధారంగా 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు బీసీల కోసం ప్రకటించిన రిజర్వేషన్లు వివాదాస్పదం అయ్యాయి. ఏపీ నవ సంఘర్షణ సమితి పేరుతో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనను కొందరు ప్రారంభించారు. అదే సమ యంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్ వ్యతిరేక ఆందో ళనలు తలెత్తాయి.
 
బర్ధన్ ఈ సందర్భంగా ‘కులం-వర్గం-రిజర్వేషన్లు’ పై రెండు వ్యాసాలను ప్రచురించారు. కులం వికృత రూపాన్ని ఇందులో ఆయన ఎండగట్టారు. ‘మార్క్స్, ఎంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక నా జీవి తాన్ని మలచింది. అదేవిధంగా కమ్యూనిస్టు, మార్క్సిస్టు మూల సిద్ధాంత గ్రంథాలు, గోర్కీ రాసిన అమ్మ లాంటి నవలలు నన్ను నిరంతరం మేల్కొనే విధంగా చేశాయి.’ అని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలోని అజయ్ భవన్‌లో బర్ధన్‌ను నేను మూడుసార్లు కలుసుకున్నాను. ఆయన కూర్చునే గది కానీ, ఆయన నివసించే ఇల్లు కానీ అతి సాధారణంగా ఉండేవి. ఆయన సహచరి పద్మా బర్ధన్ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసి 1986లో మరణించారు.  
 
బర్ధన్ స్ఫూర్తి నేటి అవసరం
గతంలో మనరాష్ట్రంలో కమ్యూనిస్టు నాయకులు చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, నక్సలైట్ నాయకులైన కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావు, తరిమెల నాగిరెడ్డి వంటి వారు తమ కుటుంబం, ఆస్తి, ఐశ్వర్యాలకన్నా పార్టీకి, ప్రజలకు, ఉద్యమాలకు అంకితమై పనిచేశారు. గత కొంతకాలంగా ఈ అంకితభావం కొరవడిన ఫలితంగానే  పశ్చిమ బెంగాల్, కేరళ లాంటి కమ్యూనిస్టు కంచుకోటల నుంచి బీజేపీకి వలసలు పెరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష పార్టీలు ఓడిపోయిన తరువాత ఈ వలసలు మరింత పెరిగాయి. కేరళలో కూడా ఇదే ధోరణి. 1980-90 తర్వాత వచ్చిన నాయకత్వంలో ఎక్కువ మందికి సొంత కుటుంబాలు, వ్యాపారాభివృద్ధే లక్ష్యం కావడం వల్ల కింది స్థాయి కార్య కర్తలకు వారు స్ఫూర్తిదాయకంగా నిలవలేకపోయారు.
 
కనీసం సైద్ధాంతిక నిబద్ధతను సైతం కార్యకర్తల్లో నింపలేని పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా మత, సంప్రదాయ సంకెళ్ల నుంచి నాయకత్వం బయటపడకపోవడంతో ఇతర పార్టీలకు, కమ్యూనిస్టు పార్టీలకు మధ్యనున్న అంతరాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోయారు. అందువల్లనే కమ్యూనిస్టు పార్టీల నుంచి బీజేపీలోకి వలస వెళ్ళడం కార్యకర్తలకు ఇబ్బందికరంగా తోచలేదు. సరిగ్గా ఇక్కడే ఏబీ బర్ధన్‌ను, ఆయన నిబద్ధతను, ప్రజలపై ఆయనకున్న విశ్వాసాన్ని స్మరించుకోవడం అర్థవంతం, సందర్భోచితం.

మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్: 97055 66213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement