
'తప్పు'లో కాలేసిన మమత
కోల్ కతా: సీపీఐ సీనియర్ నాయకుడు ఏబీ బర్దన్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సంతాపం ప్రకటించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆమె సంతాపం ప్రకటించడం గమనార్హం. పొరపాటును గ్రహించి వెంటనే ఈ ట్వీట్ తొలగించారు.
బర్దన్ మృతికి సంతాపం ప్రకటిస్తూ తన అధికారిక ట్విటర్ పేజీలో సందేశం పోస్టు చేశారు. 'బర్దన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. చాలా కాలం పాటు ఆయన రాజకీయాల్లో, కార్మిక సంఘాల్లో పనిచేశారు. ఆయన మరణం తీరనిలోటు. బర్దన్ కుటుంబానికి, సన్నిహితులకు సంతాపం తెల్పుతున్నా' అని మమత ట్వీట్ చేశారు.
అయితే బర్దన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని వెంటనే ఈ ట్వీట్ తొలగించారు. అప్పటికే ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పక్షవాతంతో బాధపడుతున్న బర్దన్ కు ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.