బీజేపీది సంకుచిత మార్గం
సీపీఐ నేత నారాయణ
సాక్షి, హైదరాబాద్: చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా కమ్యూనిస్టు పార్టీ పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందని సీపీఐ నేత కె.నారాయణ గుర్తుచేశారు. ఈ పోరాటానికి భయపడి నిజాం ప్రభువు భారత ప్రభుత్వానికి లొంగి పోయాక సెప్టెంబర్ 17 తర్వాత.. దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు ఖద్దరు చొక్కాలు ధరించి కాంగ్రెస్ వారి రూపంలో మళ్లీ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినందున పోరాటాన్ని కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు.
ఈ మహత్తర పోరాటాన్ని హిందువుల ఆధిపత్యం, ముస్లింల ఓటమి కింద చూపేందుకు బీజేపీ సంకుచిత ప్రయత్నం చేస్తోందన్నారు. నిజాంపైనే పోరాటానికి కమ్యూనిస్టులు పిలుపునిచ్చి సాయుధ పోరాటంలో పాల్గొంటే ఆయనకు సహకరించే పరిస్థితే ఉత్పన్నం కాదన్నారు. గతంలో ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ఉత్సవాలను జరపలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా అదే కోవలోకి చేరకుండా ఈ ఉత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.