రైతులకు బతుకునిచ్చే తెలంగాణ కావాలి
దుబ్బాక: బంగారు తెలంగాణ కాదు.. రైతులకు బతుకునిచ్చే తెలంగాణ కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కరువు పరిశీలనలో భాగంగా గురువారం చేగుంటలో కూరగాయల పంటలను పరిశీలించారు. వల్లూర్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలరాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నీరులేక ఉల్లి, టమాటా పంటలు ఎండిపోయాయని సాయిలు నారాయణకు వివరించాడు. అప్పుల బాధతో గత ఏడాది తమ మామ పెద్ద సాయిలు, ఈ ఏడాది తన భర్త బాలరాజు ఆత్మహత్య చేసుకున్నారని వల్లూర్‌లో బాధితురాలు అనురాధ రోదిస్తూ తెలిపారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి లేకపోవడంతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రెవెన్యూ అధికారులతో ఎండిన పంటల వివరాలు తీసుకుని తగిన సహకారం అందించాలన్నారు. రైతుల బాధలను పట్టించుకోని కే సీఆర్.. మాటల గారడీతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ. పదిలక్షల పరిహారం, ఎండిన పంటలకు ఎకరాకు రూ. పదివేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వేసవిలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ప్రజలకు ఉచిత భోజనం అందించాలన్నారు. కరువును దృష్టిలో ఉంచుకొని రేషన్‌షాపుల్లో ప్రతి వ్యక్తికి 10కిలోల చొప్పున బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.