సీఎం భవిత తేలిపోతుంది: నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై మొండికేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపిస్తున్నందున ఆయన భవిష్యత్ ఏమిటో ఒకట్రెండ్రోజుల్లో తేలిపోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసి కూడా ముఖ్యమంత్రి గొప్పగా నటిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో మూడు రోజులుగా జరుగుతున్న పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నారాయణ రాష్ట్ర సమితి తీర్మానాలను మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో అనిశ్చితి, పార్టీ నిర్మాణం, వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల గుర్తింపు తదితర అంశాలను క్షుణ్ణంగా చర్చించి.. ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో 45 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలను పోటీకి గుర్తించినట్టు తెలిపారు. రాష్ట్ర విభజన అనివార్యమైనందున రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా ప్రాంతాల రాజకీయ పరిస్థితిని బట్టి తమ పార్టీ విధానానికి అనుగుణంగా పొత్తులు ఉంటాయని అన్నా రు. విభజన తర్వాతే పార్టీకి రెండు కమిటీలు ఏర్పాటు చేస్తామని, తాను రెండు రాష్ట్రాలకూ కాపలాదారుగా ఉంటానని చెప్పారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణపై తమకు ఎటువంటి అనుమానాలు లేవన్నారు. తాము రాష్ట్ర విభజన కోరుకుంటున్నాం తప్ప ప్రజల మధ్య కాదని చెప్పారు. ప్రధాని కావాలన్న నరేంద్ర మోడీ కల నెరవేరదని, మిణుగురు పురుగు లాగ మోడీ వెలుగూ తాత్కాలికమేనని ఎద్దేవా చేశారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలండి: తాను ప్రవేశపెట్టిన కార్యకలాపాల నివేదికపై జరిగిన చర్చకు నారాయణ సుదీర్ఘ జవాబు ఇచ్చారు. వచ్చే ఎన్నికలకు అన్ని విధాలుగా సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలను విడదీయవద్దు: రాష్ట్రాన్ని విభజించాలేగానీ, ప్రజలలో కల్మషాలు కలిగించి వారిని విడదీయవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కేంద్రానికి సూచించారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాం గ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధిపై శ్రద్ధ చూపి ఉంటే తెలంగాణ వాదం బలపడి ఉండేది కాదన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి కార్పొరేట్ కంపెనీల ను కాపాడుకోవడానికి ఉద్యమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత సీపీఐదేనని ఎమ్మెల్యే గుండా మల్లేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, సిటీ కార్యదర్శి బోస్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ తదితరులు పాల్గొన్నారు.