'భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తుండదు'
ఖమ్మం: భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని, ఆ పార్టీ తనంతట తానుగా సముద్రంలో మునిగిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడటం వలనే ఎన్నికల్లో వైఫ్యలం చెందామన్నారు. భారతదేశంలో ఎక్కడా కాంగ్రెస్‌తో పొత్తు లేదనీ, తెలంగాణ ఇచ్చారనే కారణంతోనే ఇక్కడ పొత్తు పెట్టుకున్నామన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రైతాంగ రుణాల విషయంలో రైతులందరినీ అయోమయానికి గురి చేస్తోందన్నారు. 2013 జూన్ నుంచి 2014 జూన్ వరకు రైతులు తీసుకున్న లక్ష లోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని బ్యాంకర్ల సమావేశంలో తెలంగాణ మంత్రులు వెల్లడించడం దారుణమని, వెంటనే వారు దీనిపై పునః సమీక్షించాలని కోరారు. ఎన్నికలకు ముందు వాగ్దానాలను చేసిన విధంగా రైతులందరి రుణాలు మాఫీ చేయాలని, రైతుల బంగారం రుణాలను కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
పోలవరం సమస్యపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు కూర్చుని మాట్లాడి పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో సమస్యలపై తమ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని, ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు.