'కార్పొరేట్ కంపెనీల కృత్రిమ బొమ్మ మోడీ'
హైదరాబాద్: ఆర్ఎస్ఎస్, కార్పొరేట్ కంపెనీలు కలసి చేసిన కృత్రిమ బొమ్మే నరేంద్ర మోడీ అని సీపీఐ నేత కె. నారాయణ అన్నారు. ఈ ప్రభుత్వం వెనక ఉన్న మతోన్మాద శక్తులను కమ్యూనిస్టు ఉద్యమాల ద్వారా బయట పెడుతామని ఆయన హెచ్చరించారు. ఆగస్టు 11న నిజాం కాలేజీలో భారీ బహిరంగా సభ నిర్వహించనున్నట్టు చెప్పారు.
రుణమాఫీ విషయంలో కౌలు దారులకు ఏ లాభం జరగడం లేదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం వెంటనే 30 లక్షల మంది కౌలు దారులకు గర్తింపు కార్డు ఇచ్చి రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని కోసం వేసిన కమిటీతో చంద్రబాబు నిజస్వరూపం అర్ధమవుతోందన్నారు. కార్పొరేట్ వర్గాలకు ఈ కమిటీలో స్థానం కల్పించారని తెలిపారు.
స్థానికతకు 1956 ప్రామాణికత అసమంజమని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో ఉస్మానియా విద్యార్ధులతో చర్చలు జరపాలని సూచించారు. పోలవరం, స్థానికత, ఉద్యోగాల విషయంలో వెంటనే సీఎం కేసీఆర్- అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.