
పీనుగును పెట్టి పరిపాలన చేస్తున్నారు: కె.నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ అనిశ్చితి కారణంగా వెనకబడిపోయిన ప్రజాసమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రంలో పలు చోట్ల జైల్‌భరో ఆందోళన జరిగింది. ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అలక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆ పార్టీ ఆరోపించింది. పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులను అరెస్‌ట చేసి వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నాయకత్వంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామకృష్ణ, పీజే చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు బైఠాయించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని రోజులుగా పరిపాలన స్తంభించిందన్నారు.
రాష్ట్రంలో ఓ పీనుగును పెట్టి కేంద్రం పరిపాలన చేస్తోందని ధ్వజమెత్తారు. దీంతో ప్రజాసమస్యలేవీ పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టే నాథుడే కనిపించడం లేదన్నారు. ప్రతినెలా వచ్చే పింఛన్లు, సరుకులు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేరస్తులను చట్టసభల నుంచి వెలివేసే ఆర్డినెన్‌స విషయంలో జరిగిన తతంగం ప్రధానిని అవమానించేలా ఉందని మండిపడ్డారు. తానైతే క్షణం కూడా ఆ పదవిలో ఉండేవాణ్ణి కాదన్నారు. ‘ఇసుకకు తక్కువ పేడకు ఎక్కువయిన రాహుల్ చెబితే ఓ ప్రధాని వినాలా?’ అని ప్రశ్నించారు. 3 ప్రజాప్రతినిధులకు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఉపయోగపడాల్సిన రైల్వే ‘ఇజ్జత్’ పాస్‌లను లక్షల సంఖ్యలో పక్కదారి పట్టించిన ప్రజాప్రతినిధులకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీల వల్లనే ఈ పాస్‌లు అనర్హుల చేతుల్లోకి వెళ్లాయని గుర్తించిన రైల్వేబోర్డు వారి ఆటలు సాగకుండా అడ్డుకట్ట వేసింది. ఇప్పటి వరకు ఇజ్జత్‌పాస్ పొందాలనుకున్నవారికి ఆదాయ ధ్రువపత్రాలు జారీ చేసే అధికారం ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఉండగా.. తాజాగా వారి పెత్తనానికి కత్తెర వేస్తూ రైల్వేబోర్డు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ఇకనుంచి ప్రజాప్రతినిధులు జారీ చేసే ధ్రువపత్రాలను పరిశీలించి అవి సరైనవేనని అధికారులు కూడా ధ్రువీకరించాలని మెలికపెట్టింది.
దీనిప్రకారం ఆయా మండలాల తహసీల్దార్లు ఎంపీలు జారీచేసే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సరైనవేనని ధ్రువీకరిస్తేనే రైల్వే అధికారులు ఆయా అభ్యర్థులకు ఇజ్జత్ పాసులు జారీ చేస్తారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో దాదాపు ఏడు లక్షల ఇజ్జత్ పాసులు అనర్హుల చేతుల్లో ఉన్నట్టు ఇటీవల అంచనాకొచ్చిన స్థానిక అధికారులు... ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని తొలగించి ఆదాయ ధ్రువపత్రాల జారీని అధికారులకే అప్పగించేలా నిబంధనలు మార్చాలంటూ చేసిన ప్రతిపాదనకు రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించి రెండు రోజులక్రితం ఈ ఆదేశాలు జారీ చేసింది.