సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన భాగస్వామ్య పక్షాలన్నిటితో మాట్లాడేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తామే కోరామని, దానికి విధిగా హాజరవుతామని సీపీఐ స్పష్టం చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సోమవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజన నేపథ్యంలో రెండు ప్రాంతాలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాము ఇప్పటికే కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు నివేదిక ఇచ్చామన్నారు. జీవోఎంకు నివేదించాల్సిన సూచనలు, సలహాలపై కూడా నివేదికను తయారుచేశామని, పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌లో చర్చించి మంగళవారం సమర్పిస్తామని చెప్పారు. కాగా, సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నగర శివార్లలోని యాప్రాల్‌లోని ఒక ప్రైవేటు క్లబ్‌లో జరుగనున్నాయి.