రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటుచేసిన మంత్రుల బృందం (జీవోఎం) సమావేశాలు ఇంకా ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో బుధవారం రాత్రి జీవోఎం భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్ర మంత్రివర్గానికి సమర్పించాల్సిన నివేదిక తయారీ పూర్తయిందా? మీ కసరత్తు అయిపోయినట్టేనా?’ అన్న ప్రశ్నలకు షిండే స్పందిస్తూ.. ‘‘ఇంకా కొన్ని సమావేశాలుంటాయి. ఎన్ని అనేది నేను కచ్చితంగా చెప్పలేను’’ అని పేర్కొన్నారు.
‘గురువారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై నివేదిక, బిల్లు చర్చకు వస్తాయా?’ అని అడగ్గా.. ‘‘రేపు కేబినెట్‌లో ఈ అంశం లేదు’’ అని సమాధానమిచ్చారు. ‘నివేదిక ఎప్పటికల్లా తయారవుతుంది? ఎప్పుడు కేబినెట్‌కు అందజేస్తారు?’ అని ప్రశ్నించగా.. ‘‘మొత్తం పూర్తయినపుడు కేబినెట్‌కి ఇస్తాం. అప్పుడు మా పని పూర్తయినట్టు లెక్క. ఆ సంగతి మీకు ముందే చెప్తాం... సరేనా!’’ అని నవ్వుతూ బదులిచ్చారు.