తెలంగాణ ఇచ్చేది ఇలాగా? | All Party Meeting on Telangana Bill | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇచ్చేది ఇలాగా?

Published Tue, Feb 4 2014 12:59 AM | Last Updated on Sat, Aug 25 2018 4:39 PM

All Party Meeting on Telangana Bill

అఖిలపక్ష భేటీలో కేంద్రంపై విపక్షాల ధ్వజం
టీ బిల్లు మీద కాంగ్రెస్ తీరుపై బీజేపీ నిరసనగళం
అదే బాటలో లెఫ్ట్, తృణమూల్ సహా విపక్షాలు
విభజనపై కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయం లేదంటూ ఫైర్
బిల్లు పెడితే పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగవని, మిగతా బిల్లులకు ఇబ్బందని ఆందోళన
ఈ సమావేశాల్లో బిల్లు తగదంటూ వాదనలు
ముందు ఓటాన్ అకౌంట్ సంగతి చూడాలని హితవు
ప్రత్యేక రాష్ట్రం కోరేవారు, వద్దనేవారు వెల్‌లోకి వస్తే   ఏం చేస్తారని ప్రశ్నించిన సుష్మాస్వరాజ్
సమావేశాలు సజావుగా జరిపితే తెలంగాణ బిల్లుకు తాము మద్దతిస్తామని స్పష్టీకరణ
షరతులు పెట్టకుండా.. మద్దతిస్తారో లేదో చెప్పాలన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్
బిల్లుకు ఓటేయాలి.. లేదంటే ఓడించాలన్న చిదంబరం
నష్ట నివారణకు నేడు వార్ రూంలో కాంగ్రెస్ చర్చలు
సవరణలపై కసరత్తు కోసం నేడు జీవోఎం భేటీ
 
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎలాగైనా ఆమోదింపజేస్తామంటున్న యూపీఏ ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ తెలంగాణ బిల్లుపై స్వరం మార్చుతుండడంతో కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. బీజేపీ బాటలోనే మిగిలిన విపక్షాలూ నిరసన స్వరం వినిపిస్తుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అయోమయ స్థితిలో పడింది. తెలంగాణ బిల్లు పెట్టాక ఇరు ప్రాంతాల సభ్యుల వాదోపవాదాలతో గందరగోళం మొదలై.. సమావేశాలు సజావుగా సాగకపోతే తామేమీ చేయలేమని బీజేపీ చెబుతోంది. అసలు రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు బిల్లు ఎలా పెడతారని మిగతా పక్షాలు నిలదీస్తున్నాయి.

15వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలైన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బుధవారం నుంచి 21వ తేదీ వరకు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చించేందుకు సోమవారం ఉదయం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుబట్టాయి. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు, అవినీతి వ్యతిరేక అంశాలకు సంబంధించిన మరో ఆరు కీలక బిల్లులు సహా మొత్తం 39 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు కమల్‌నాథ్ విపక్షాలకు వివరించారు.

ఈ నేపథ్యంలో ప్రధానంగా బీజేపీ, లెఫ్ట్, తృణమూల్, సమాజ్‌వాదీ పార్టీల నేతలు అధికార కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయం లేనప్పుడు బిల్లు ఎలా ప్రవేశపెడతారని, అసెంబ్లీ తిరస్కరించిన బిల్లుపై సభలో గందరగోళం ఏర్పడుతుందని, సభ జరిగే పరిస్థితే ఉండదని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కమల్‌నాథ్‌తో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఇక తాము బిల్లును వ్యతిరేకిస్తామని సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటరీ నేత రాంగోపాల్‌యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల సభ్యుల వాదోపవాదాలతో సమావేశాలకు అంతరాయం కలుగుతుందని తెలిసి కూడా యూపీఏ ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్తలూ తీసుకోలేదంటూ సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి విమర్శించారు.

తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ ‘ముందుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి. లేదంటే సమావేశాలు సజావుగా నడిచే అవకాశం ఉండదు’ అని పేర్కొన్నారు. ఎన్‌డీఏ ప్రస్తుత చైర్మన్ ఎల్.కె.అద్వానీ, సుష్మా స్వరాజ్ కూడా సభ సజావుగా సాగే అవకాశాలు లేని దృష్ట్యా వీలైనంత త్వరగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కోరినట్లు తెలిసింది. అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఇంకా చాలా కసరత్తు చేయాల్సి ఉందని, ఫిబ్రవరి 17లోపు బడ్జెట్ పెట్టలేమని చిదంబరం అసక్తత వ్యక్తంచేసినట్లు సమాచారం. మొత్తం మీద మీరు బిల్లులన్నీ పాస్ చేసుకోవాలనుకుంటే తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లో తేవద్దని పరోక్షంగా విపక్షాలన్నీ సూచించినట్టు సమాచారం.

ఎత్తుకు పై ఎత్తు
ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి బీజేపీ వైఖరిని బట్టబయలు చేయాలని కాంగ్రెస్ చూస్తుండగా.. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీవారే బిల్లుకు అడ్డుపడుతారని బీజేపీ అంటోంది. కాంగ్రెస్ సొంత పార్టీ నేతలపై చర్య తీసుకునే సాహసం చేయకుండా తమను బద్నాం చేస్తుండడాన్ని ఆ పార్టీ అనుమానంగా చూస్తోంది. తెలంగాణపై క్రెడిట్ పొందుతూనే సీమాంధ్రలో మైలేజీ కోసం కాంగ్రెస్ పాకులాడుతోందని బీజేపీ భావిస్తోంది. దీంతో ఇదే వైఖరిని అవలంబించేందుకు బీజేపీ కూడా బిల్లు ప్రవేశపెట్టే తీరుపై నిరసన గళం వినిపిస్తోంది.

బీజేపీ వైఖరితో కాంగ్రెస్ పార్టీ, కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు కనిపిస్తోంది. అయితే బిల్లు ప్రవేశపెట్టడంపై వెనక్కితగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు. విపక్షాల ఎదురుదాడి ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుత సమావేశాల్లో బిల్లు తెచ్చేందుకు కేంద్రం పట్టుదలగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. అవసరమైతే సభను అడ్డుకునేవారిని సస్పెండ్ చేసైనా సరే బిల్లును పాస్ చేయాలనే భావనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం.

ఏ పార్టీ ఎటు?
* ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐ, లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ, పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి, అజిత్‌సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ ఇప్పటివరకు తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
     
* ఇక ముందునుంచీ తెలంగాణకు మద్దతు తెలుపుతున్న జేడీ(యూ) మాత్రం ఒకింత భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఇరుప్రాంతాల్లో శాంతి నెలకొనాలన్న వ్యాఖ్యలు చెబుతున్న ఆ పార్టీ నేత శరద్‌యాదవ్.. బిల్లుపై మద్దతు విషయమై మంగళవారం మరింత స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
     
* టీడీపీ ద్వంద్వ వైఖరిపైనా అనుమానాలు నెలకొన్నాయి. విభజన జరగాలంటే సీమాంధ్ర ప్రజలను, సమైక్యంగా ఉండాలంటే తెలంగాణ ప్రజలను ఒప్పించాలని చంద్రబాబు నాయుడు రాష్ట్రపతితో భేటీ అనంతరం వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు ఆ ప్రాంత కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలతో సోమవారం రహస్య మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. పార్లమెంటులో రెండు పార్టీలు కలసికట్టుగా వ్యవహరించాలని వ్యూహం రూపొందించినట్టు తెలుస్తోంది.
     
* తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విభజనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.

నష్ట నివారణకు వార్‌రూమ్ భేటీ..
సొంత పార్టీలో ఏకాభిప్రాయం లే కుండా తమపై అక్కసు ఎందుకంటున్న విపక్షాల దాడితో కాంగ్రెస్ నష్టనివారణ చర్యలకు రంగంలోకి దిగింది. మంగళవారం సాయంత్రం పార్టీ సీమాంధ్ర నేతలతో చర్చించేందుకు ఇక్కడి రకాబ్‌గంజ్‌రోడ్డులోని కాంగ్రెస్ వార్ రూంలో సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, పార్టీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు హాజరుకావాల్సిందిగా కోరినట్టు సమాచారం. ఈ సమావేశంలో పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలు సహకరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ చర్చించనుంది. ముఖ్యంగా సీమాంధ్ర ఎంపీలు విభజన విషయంలో అభ్యంతరం లేవనెత్తుతున్న పోలవరం, హైదరాబాద్ అంశాల్లో సవరణలు స్వీకరించి వాటి  సాధ్యాసాధ్యాలపై మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం.
 
నేడు జీవోఎం సమావేశం..
అటు అసెంబ్లీలో కోరిన, ఇటు విపక్షాలు సూచించిన సవరణల్లో ప్రధానంగా పోలవరం, కొత్త  రాజధానికి ఆర్థిక ప్యాకేజీ వంటి అంశాలను తిరిగి బిల్లులో పెట్టేందుకు మంత్రుల కమిటీ(జీవోఎం) మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు భేటీ కానుంది. జీవోఎం చేసిన సిఫారసులకు అనుగుణంగా తిరిగి కేబినెట్ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపే అవకాశం ఉంది. అక్కడి నుంచి బిల్లు పార్లమెంటును చేరనుంది.
 
బిల్లుకు ఓటేయాలి.. లేదంటే ఓడించాలి
‘‘15వ లోక్‌సభలో ఈ బిల్లుకు(తెలంగాణ బిల్లుకు) తెరదించకపోతే.. 16వ సభలోనూ ఇలాగే కొనసాగుతుంది. బిల్లు పాస్ కాకపోతే ఈ అంశానికి అంతం ఉండదు. బిల్లుకు ఓటెయ్యాలి.. లేదంటే ఓడించాలి. ఎందుకంటే అటు సీమాంధ్రలో 25 మంది ఎంపీలు, ఇటు తెలంగాణలో 17 మంది ఎంపీలు ఉన్నారు. వారు ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ రెండు ప్రాంతాలది వేర్వేరు వైఖరి.’’
 - మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement