‘విభజన చట్టం’పై విచారణకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకణ చట్టంపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామరాజు సహా 24 మంది వేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచ్ పేర్కొంది.
రాష్ట్ర విభజన హేతుబద్దంగా జరగలేదని పేర్కొంటూ పిటిషనర్లు... పునర్ వ్యవస్థీకణ చట్టంలోని పలు విధానపరమైన అంశాలను లేవనెత్తారు. విభజన చట్టం ఆమోదం పొందిన తర్వాత కూడా తెలంగాణ నుంచి కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా విభజన జరగలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ దశలో తామేం చేస్తామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.