అఖిలపక్షంలో మేం పాల్గొనలేదుగా..! : చంద్రబాబు నాయుడు
అందరితో చర్చించామని ఎలా చెబుతారు?
షిండేకు బాబు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: విభజన అంశంపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ హాజరు కాలేదని, అలాంటపుడు అందరితో చర్చించామని కేంద్ర మంత్రులు ఎలా చెబుతారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అందరితో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. శుక్రవారం తన నివాసంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణవాదులు కూడా ఆంధ్ర ప్రాంతం వారికి అన్యాయం జరగాలని కోరుకోవటం లేదని, విభజన తీరు అన్యాయమని వారు కూడా ముక్తకంఠంతో చెబుతున్నారని బాబు వెల్లడించారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు సమన్యాయం చేసే వరకూ రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపేయాలన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు బిల్లును అసెంబ్లీ, పార్లమెంటుల్లో వ్యతిరేకిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా జవాబివ్వలేదు. విభజనపై తాము న్యాయపోరాటం కాకుండా ప్రజా పోరాటం చే సి ప్రజా కోర్టులో కాంగ్రెస్‌ను దోషిగా నిలుపుతానన్నారు.
ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తనిస్తున్నాం. అనుమతించి ఉంటే ఈ ప్రశ్నలు అడిగే వాళ్లం.
1. మీ పార్టీ అభిప్రాయం చెప్పాలని జీవోఎం మీకు ఆహ్వానం పంపినప్పుడు వెళ్లి మీ అభిప్రాయమేంటో చెప్పకుండా ఇప్పుడు మాట్లాడటం వల్ల ప్రయోజనమేంటి?
2. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోమని మీరు లేఖ ఇవ్వడమే కాకుండా పదే పదే కోరారు. కాంగ్రెస్ అదే చేసింది. ఇప్పుడు మీ తీరు ఓట్లు, సీట్ల కోసం విమర్శిస్తున్నట్లుగా ఉందని అనుకుంటున్నారు. మీరేమంటారు?
చంద్రబాబుకు తెలంగాణ నేతల కృతజ్ఞతలు: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సిం హులు, ఎల్. రమణ, మండవ వెంకటేశ్వరరావు, ఉమా మాధవరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, సీతక్క, హన్మంతు షిండే, అర్కల నర్సారెడ్డి, వి. గంగాధరగౌడ్ తదితరులు చంద్రబాబును కలి శారు. పార్టీపరంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటంతో పాటు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినందుకు వారు బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్గం ముసాయిదా బిల్లును ఆమోదించిన తర్వాత ఇక వెనక్కుపోదన్నారు. సీమాంధ్రలో కూడా పార్టీని బతికించుకోవడం కోసం సమన్యాయం చేసే వరకూ విభజన ప్రక్రియ ఆపాలని డిమాండ్ చేస్తానని, దాన్ని తెలంగాణ నేతలు అర్థం చేసుకోవటంతోపాటు ప్రజలకు ఇదే విషయాన్ని వివరించాలని చెప్పారు.